సమాజానికో హెచ్చరిక
సమాజానికో హెచ్చరిక


"స్త్రీ ప్రకృతి స్వరూపిణి।
ఆడది ఆదిశక్తి।
దేవుడు అంతటా తానుండలేక
అమ్మను సృష్టించాడట"।।
చాలు చాలు ఈ పోలికలూ, పొగడ్తలు
చాలించు నీ వికృత విన్యాసాలు
నన్ను నన్నుగా చూడు
నేనూ మనిషినేనని గుర్తించు।।
గుర్తుందా! మరో మనిషిని కని
అమ్మనై అమృతధారలిచ్చి పెంచి
నడకతో పాటు నడతనూ నేర్పి
బతుకు పరిచయం చేసింది నేనేగా!
అలసి సొలసిన వేళ ఆదరించి,
ఆలినై అలరించి, అవసరాలను తీర్చి
తన ప్రతిరూపాన్ని మోసుకుంటూ,
తన మగతనాన్ని నిరూపిస్తూ,
తండ్రి అనే బంధం చూపిందీ నేనేగా!
గిరులైన, తరులైన
కడకు ఆకాశ గమనమైనా
వెరుపు లేక సాగే వీరవనితను నేను.
వంటింటినే కాదు రాజ్యాలనైనా
అలవోకగా ఏలు ధీరురాలిని నేను.
పర్వతాలు మోసే అవనిని నేను,
ఒడలు కదిపానో కుదేలైపోతావు.
శృంగార ముప్పొంగు నదిని నేను
కోపించి పొంగితే అల్లకల్లోలమవుతావు.
అమృత ఫలములిచ్చే తరువును నేను
అవసరమైతే ఆత్మాహుతితో అంతం చేయగలను.
ఆకాశాన మెరిసే తటిల్లతను నేను
క్రోధాగ్ని రగిలితే పిడుగునై కాల్చగలను.
అణువణువులోనూ చైతన్యమే నింపాను
అయినా నీ స్వార్ధపుటాలోచనల
కర్కశ కోరల చిక్కి విలవిలలాడుతున్నాను.
నన్ను నన్నుగా గుర్తించు
దేవిగా కాకున్నా మనిషిగా చూడు.
సమాజమా మేలుకో!
నేనూ అతనూ సమానమేనని ఒప్పుకో!
నేనూ,తనూ "మేము" గా మారితేనే
నీ ప్రగతి సాధ్యమని తెలుసుకో.
@@@@@@@