సెల్ ఫోన్
సెల్ ఫోన్
ఇంట్లో చొరబడి ఎన్నాళ్ళో అయింది
దాని పెత్తనం రోజుకింతా పెరుగుతుంది
అందరి హృదయాలకు పలుపుతాడు కట్టింది
మనసు దోచుకోవడంతో ఆగలే దోపిడీ చేస్తోంది
మనుషుల మధ్య మాట ముచ్చట్లు తగ్గి
దానితో సహవాసంతో కాలం చప్పరిస్తున్నారంతా
రెండు మూడేళ్లకోసారి స్టైల్ మారుస్తూ
ఆధునిక సాంకేతికతలను సిగలో తురుముకుంటూ
మెల్లమెల్లగా బానిసలను చేసుకుంటుంది
పిల్లలనుంచి ముసలోళ్లదాకా అన్ని వయసులు
దాని ముందు దాసోహం
ఏ వ్యసనం మానినా, దాన్నుంచి తప్పించుకోలేక
అతి బుద్ధిమంతుల్లా దాని కొంగు పట్టుకొని అంతా
ఒక్కసారి తలదూరిస్తే తలెత్తుకోలేమింకా
తనివి తీరదు ఒకటెనుకొకటి తలుపులు తెరుస్తూ
మాయాజాల సుందరుల మోహంలో
హెచ్చరికలు బెల్ కొట్టినా ఖాతరు చేయం
మనసు మార్చుకుని మనుషులుగా మారడానికి
తపో భంగమైనట్లు భావన
వగలమారి చిట్టి తల్లి సెల్ ఫోన్ రాకముందు
మనిషి కనిపిస్తే మాటలు దొర్లేవి
నడి బజారులో, నాలుగు రోడ్ల కూడలిలో
కబుర్లు కాగతాళీయంగా మొదలయ్యేవి
మంచి చెడుల ముచ్చట్లు, మనసులోని బాధలు
సాపపరుచుకుని కూర్చునేవి
ఇప్పుడు పదిమంది పక్క పక్కనే ఉన్నా
తలలన్నీ దాని బడిలో పాఠాలు నేర్చుకుంటూ
దాంతో మురిపాల్లో పడి కాలాన్ని చాక్లెట్ లా చప్పరిస్తూ
మనిషి కోసం కనిపెట్టిన సెల్ ఫోన్ కు
మనిషి మారాడు కట్టు బానిసగా
సర్వేంద్రియాణాం సతతం ప్రణామం
