రావుదరికి
రావుదరికి
నీవు గాక తోడెవ్వరు..కనిపించవు రావు దరికి..!
నీ కన్నా గురువెవ్వరు..కనిపించవు రావు దరికి..!
ఎదమాటున చిరునవ్వై..మిగిలేవుగ ఎల్లపుడూ..
మాయగుట్టు పట్టెవ్వరు..కనిపించవు రావు దరికి..!
దేనికొరకొ పరితపించు..అవసరమే తప్పిస్తివి..
సరసవీణ రూపెవ్వరు..కనిపించవు రావు దరికి..!
ఓదార్పును ఆశించే..మనసు పట్టు రాల్చేస్తివి
ప్రేమకల్ప తరువెవ్వరు..కనిపించవు రావు దరికి..!
ఈ రెప్పల వాకిటనే..నర్తించే నెఱజాణా..
స్నేహదీప వనమెవ్వరు..కనిపించవు రావు దరికి..!
మైమరపను మిఠాయీని..తినిపించే కోమలివే..
తీపి నదుల మాటెవ్వరు..కనిపించవు రావు దరికి..!
