పున్నమి పూట
పున్నమి పూట
ఆరుబయట నిలుచుంటానా...
చేదు వేపల తీయని నీడలలో
అప్పటిదాకా ఆడుకుంటున్న బాల్యం
తప్పిపోయిన గోళీని వెదికిపెట్టమని
కాళ్ళను నేలకు తపతపా కొట్టుకుంటుంది
వెన్నెలకుప్పలాటల సందడిలోంచి
సందుచేసుకుని ఈవలకు వచ్చిన వెన్నెల పాప
ఆడదాం రమ్మంటూ చేయిపట్టుకు లాగుతుంది
అప్పుడెప్పుడో తెగిపోయిన ఊయల
స్మృతుల చెట్టుకొమ్మకు మళ్లీ ముడిపడుతుంది
ఎప్పుడు విన్నదని నా మాట మనసు?
ఒక్క గంతుతో ఊయలెక్కి ఊగుతూ
నిస్తేజంగా నిలబడ్డ నన్ను చూసి వెక్కిరిస్తుంది
ముఖ చిత్రం: లాస్య
