పసిడికొండ.
పసిడికొండ.
-------------------
మర్యాదస్తుడు వీడు మారు మాట్లాడడు
తల్లి పాలు త్రావుచు తనరు చుండెడివాడు.
నిత్య వ్యాయామశాలితడు
నిర్మల హృదయుండు.
తల్లి వేలును బట్టి
తన నోట బెట్టి
తన్మయత్వంబుతో
తారంగ మాడుచు
పలకరించిన చాలు
పాల బుగ్గలతోడ
పసిడినవ్వులు కురిపించి
పండువెన్నెలలు తా పంచువాడు.
సద్దు చేసిన చాలు
నిదుర పోనే పోడు
సామ్రాట్టు వోలె సేవలందించుకొని
సర్వకాలము సమర్ధుడై తన యాట సాగించుకొను ఱేడు.
ఊయల నెక్కివేడుకగా వూగు చుండెడి వాడు
భాగ్య వంతుడు వీడు బంగారు కొండగా
కీర్తి నొందిన వాడు
గృహముకే సిరి వీడు.
బంధుమిత్రులనెల్ల బాంధవ్యములతోడ
కలుపు చుండెడి వాడు
కలిమి పంటయె వీడు.
తల్లి తండ్రులకెపుడు తోడుగాతానుండి
దైవంపు రూపుగా ధరయందు వెల్గుచు
తన కళలు చూపించి
పరవశము కలిగించు పరమాప్తుడే వీడు.
బాలవీరుడు వీడు భావి భారత పౌరుడు
నేడు పసివాడు రేపు భవితను తన చేత త్రిప్పు వాడు.
దారి చూపెడి వాడు ధర్మాత్ముడవుతాడు.
తల్లి తండ్రుల ఆశ తప్పక తీర్చి దేశ ప్రగతికి వీడు
దిశను చూపెడి వాడు....
-----------------------------
