ప్రియమైన స్నేహమా!!
ప్రియమైన స్నేహమా!!
"ప్రియమైన స్నేహమా!
ఒంటరి మనసులకు తోడు నువ్వు. సృష్టిలో కెల్లా అపురూపమైన బంధం, స్నేహబంధం.
సుఖాలలో తోడుండే చెలిమి అవసరం లేదు. కష్టాలలో కూడా వెన్నంటి ఉండే నీడలాంటి స్నేహం ప్రతి ఒక్కరికీ కావాలి.
సంతోష క్షణాలను మాత్రమే కోరుకునే నేస్తం వద్దు. మాటల్లో చెప్పలేని బాధను, మనసుతో అర్థం చేసుకుని అక్కున చేర్చుకునే ఆత్మీయచెలిమి కావాలి.
ఎప్పుడూ ఒకవైపే ఆలోచిస్తూ, ఎదుటివారిని నిందించే స్వార్థపూరిత స్నేహం వద్దు. ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచించి, అర్థం చేసుకోగలిగి అనురాగ సుగంధాలు పంచే సహృదయమైన నేస్తం కావాలి.
బాధ్యతల బరువులను మోయనవసరం లేదు, మనోబలం పెంచే ఓ చిరు మాట చాలు.
ఏ విధమైన బహుమతులు,కానుకలూ ఇవ్వనవసరం లేదు. విలువ కట్టలేని మమతాభిమానాలు అందిస్తే చాలు.
ఇటువంటి గుణాలున్న స్నేహశీలిని వరముగా అందివ్వవూ..
ఇట్లు
స్నేహసేద్యం చేస్తూ
స్వచ్ఛమైన మనసుతో చెలిమి కోసం ఆరాటపడే
ఓ
స్నేహ కర్షకురాలు."