నువ్వే నేను గా
నువ్వే నేను గా
నేను నువ్వు ఒకే రకం..
నేను పిట్ట పాటల్లో చిగుళ్ల బాణీల
ప్రేమ పాటనై పల్లవిస్తే..
నువ్వు మెరుపు తునకల్లో వెన్నెల పెరట్లో
మల్లె తీగల్లో పరిమళిస్తావు..
నీ మాటలు విరబూసే వలపుల తోటల్లో..
నేనో సీతాకోకనై పుప్పొడుల మౌనాలను
నీలో జార విడుస్తాను..
నీ చూపులు రాసిన లేఖలన్ని ప్రణయాక్షరాల
కావ్యాలై.. తలపుల పుట తెరిచిన ప్రతి సారి వెన్నెల కురిసి తడిపింది ఎదలో..
అలకల ముంగిల్లో నీ పదాలను స్పర్శించే నదీ తరంలా
నీ లోగిల్లో.. పరవళ్ళు తొక్కుతాను..
నీ రూపు నిండిన కళ్ళల్లో ఎన్నెన్ని పచ్చదనాల
మెరుపులు తళుక్కుమన్నాయో..
నీ శ్వాసని అనుభూతించిన మనసు.. పిల్లన గ్రోవై .. మోహన మురళీ స్వనాల మరుల గీతాల రాగమైంది..
ఏ రాగమైనా నీ పాటలై జాలువారుతూ..
మదిని తడుతుంటే..
తడి కూజితాల కోయిలనై.. నీ ఊహలనే నెమరేసి
వసంతాల రంగులనై నీ దారంతా పరుచుకుంటున్నా..
అందియ సడుల్లో దాగిన మృదు రాగాన్న
ై
నీ అడుగుల్లో ఆనందాల సోపతినై..
ఏడడుగుల వెన్నెలలో .. ఏకాంతాల ఊయలనై
నీ మనసందుకున్న దళపతిని..
పెదవుల వెనుక దాగిన మాటల్లో మౌనాన్ని..
గుండె లయల సవ్వడిలో ఉలిక్కిపడి తళుక్కుమని
మెరిసే నీ ఊహల జావళిని..
పల్లవించే ప్రతి పాటలో నీ రాగాన్నే వెతికే సంగీతాన్ని..
ప్రతి పేరులోనూ నిన్నే తలిచే మనసు మాటు ప్రేమని..
నడిచెళ్ళిన గతాల కథల్లోనూ..
జ్ఞాపకంగా మిగిలిన వెన్నెల సడుల్లోనూ..
ఏకాంతంలో ఎదను తడిపే పారిజాతాల
తుళ్ళిoతల్లోనూ..
సంధ్యా సమీరాల్లోను నీ ఊసునే ఊహించే
మనసు నేస్తాన్ని..
నీ సిరాలోoచి ఒలికే సిసలైన స్థిత ప్రజ్ఞత కల మనసుల భావుకతను..
నేను నీ అక్షరమైతే.. నువ్వు నా మనో పుటవి..
నేను రంగునై జారితే.. నువ్వో కుoచెలా మునిగిపోయే
నా ఇంద్ర చాపాల అనేకానేక వర్ణాల మధురిమవి..
ఒంటరి దారుల్లో నీ తోడునై నడిచే నీ మనో
పుస్తకాన్ని..
మనసుల బాసెరిగిన మార్మికాన్ని..