సరిద్దిదుకోవాలి
సరిద్దిదుకోవాలి


ఒక తుమ్మెద కనిపిస్తే...
ఎన్నిచూపులు విచ్చుకుంటాయో !
ఒక పూవు కనిపిస్తే...
ఎన్ని చూపులు మరులుగొంటాయో !
మేము కనిపిస్తే మాత్రం
చూపులు శూలాల్లా గుచ్చుకుంటాయి
ఎంతగా బాధిస్తాయో !
'గుండెకోత' చాలా చిన్నమాట
తెలియక అడుగుతాను
ఎన్ని పూవులకు - తుమ్మెదల మనసెరిగి
మధువులు పంచడం తెలుసు ?
ఎన్ని తుమ్మెదలకు - మధువులు ఆస్వాదిస్తూ -
పరిష్వంగ పారవశ్యంలో ఓలలాడటం తెలుసు?
మీకు, మాకూ తేడా ఒక్కటే -
మీరు సృష్టిని కొనసాగించగలరు
మేము చేయలేము
సృష్టిలో మాది మరో కోణం - కాదనను
మీలో కూడా కొందరికి ఆ లోపం ఉందిగా...
పూవులను, తుమ్మెదలను
అక్కా, బావా అంటూ...
ఎంత ఆప్యాయంగా పలకరిస్తాం
వేడుకలలో శుభాలు పలుకుతుంటాం
అయినా
- ఇటు మీరే కాదు
అటు కన్నప్రేవు,
పంచిన నెత్తురూ కూడా వెలివేస్తాయి
అయినవారందరికీ దూరంగా
యాచకులుగానో - చీకటి సుఖాలను
పంచుతూనో బ్రతకాలి
ఏ జీవజాతిలోనైనా - ఈ వివక్షత ఉందా?
మా ఉనికిని గుర్తిస్తే...
మీతో కలసి బ్రతకాలని ఉంది
అందరిలో - మిమ్మల్ని కౌగిలించుకొని
మానవత్వపు పరిమళాలు
ఆఘ్రాణించాలని ఉంది
ఇవి
నా చూపులోని అపహాస్యానికి
ఏ గళానికీ పట్టని, ఏ కలానికీ అందని
గుండెలు పిండే బాధతో ...
ఆ కన్నుల్లో పెల్లుబికిన భావాలు
సిగ్గుతో తలదించుకున్నాను
నేనే కాదు సమాజమే తలదించుకున్నా
ఉపయోగమేముంది ?
తప్పు సరిదిద్దుకోవాలిగాని