నీళ్ళమీద రాతలేగా
నీళ్ళమీద రాతలేగా
తరచిచూస్తే ఘోషలన్నీ..నీళ్ళమీదీ రాతలేగా..!
మరిగిపోయే బాధలన్నీ ..పాలమీదీ తరకలేగా..!
శ్వాసనేలే శక్తి ఏదో..చూడకుండా ముచ్చటెందుకు..
దిక్కుమాలిన మాటలన్నీ..గోడమీదీ గీతలేగా..!
వీధిశునకం నయంకాదా..కోట్లుమింగే నేతకన్నా..
సీటుకోసం ఆటలన్నీ..చరితమీదీ మచ్చలేగా..!
కవితలల్లే హృదయమేగా..అక్షరాలా స్వర్గమంటే..
నడుంకట్టిన పాటలన్నీ..నవతమీదీ కోటలేగా..!
కత్తులైనా బాంబులైనా..కంటిచూపుల సాటిరావోయ్..
వెలుగుతేనెల వాడలన్నీ..రెప్పమీదీ తోటలేగా..!
మంచుపల్లకి నీడలోనే..మురిసిపోతే ఏమి చెప్పను..
ఆవిరయ్యే ఆశలన్నీ..కలతమీదీ వరదలేగా..!

