నగిషీలు చెక్కిన
నగిషీలు చెక్కిన


కొన్నిసార్లు
నా దగ్గర కవిత్వముండదు
కన్నీళ్లే వుంటాయి
కన్నీటికి రంగు కలిపి
కవిత్వమనలేను?
కొన్నిసార్లు
నా దగ్గర కవిత్వముండదు
చెమట చుక్కలే వుంటాయి
చెమటచుక్కలకు సెంటుకొట్టి
కవిత్వం చేయలేను?
కొన్నిసార్లు
నా దగ్గర కవిత్వముండదు
జీవితమే వుంటుంది
జీవితాన్ని యధాతథంగా
ఆవిష్కరించే
కవి సమయమే వుంటుంది
నరకప్రాయమైన జీవితానికి
నగిషీలు చెక్కి
కవిత్వంగా రాయలేను?
కవిత్వాన్ని చూడగలిగే
చూపులేని
మనుషుల మధ్య
కొన్నిసార్లు
నా దగ్గర కవిత్వముండదు