నాతో నేను
నాతో నేను
"ప్రేమలో ఓడిపోయాను" అంటారు అందరూ...
కానీ నేను...
నాతో నేను, నా సొంత మనసుతోనే ఓడిపోయాను!
ఈ మాట చెబితే... నమ్ముతారా? లేక నవ్వుతారా?
అవును, నిజంగానే ఓడిపోయాను...
ఎండమావిని చూసి నది అనుకున్నట్టు,
నిజమైన స్నేహం దొరికిందని నమ్మి ఓడిపోయాను!
నాకంటూ కొందరున్నారనే భ్రమల్లో బతికి ఓడిపోయాను,
అందరినీ నావాళ్లనుకుని... నమ్మకాన్ని తాకట్టు పెట్టి ఓడిపోయాను.
లోపల ఏడుస్తూ, బయటకు మాత్రం
లేని సంతోషాన్ని ముఖానికి రంగులా పూసుకుని ఓడిపోయాను.
నాకంటూ ఒక విలువ ఉంటుందని ఆశపడి...
చివరికి శూన్యమై మిగిలిపోయాను!
ఇలా ఓడిపోయిన ప్రతిసారీ...
నా మనసు ముక్కలై, ఆ ముక్కలు గుచ్చుకుని రక్తం ఓడుతోంది.
అయినా సరే...
ఇంకా ఎందుకు ఊపిరి పీలుస్తున్నానో, ఎందుకు బతుకుతున్నానో తెలుసా?
బహుశా... రేపైనా నా ఓటమి నన్ను చూసి విసిగిపోతుందేమో అని!
గాయపడిన నా మనసుకు, నేనే ఒక ఓదార్పుగా మారతానేమో అని!
