మనసు నవ్వితే
మనసు నవ్వితే
వెన్నెల కురిసిన వేకువల్లే
నెలవంక మెరిసిన గగనమల్లే
రాతిరి నవ్విన వెన్నెలల్లే
అమృతం తాగిన మైమరపల్లె
రెక్కలు చాచిన విహంగమల్లే
సితార తంత్రులుమీటిన
మృదు గానమల్లే
వానకురిసి వెలిసిన ఆకాశంలో
హఠాత్తుగా విరిసిన ఇంద్రధనుస్సల్లే
మబ్బులు వీడిన నిర్మలాకాశమల్లే
కలవరింతలు లేని కమ్మని నిద్రల్లే
అమ్మ లాలీ పాటలోని హాయిదనమల్లే
మనసు నవ్వితే మండువేసవిలోని
మామిడి ఫలపు మధుర రసాలల్లే
నవ్వులు చిప్పిళ్లవూ
మంచి ముత్యాలు కూర్చిన హారాలల్లే
నవ్వుల నవరత్నాల జల్లులుకురిసి విరిసి పొవూ..
మనిషి మానసిక ప్రపంచం ఆహ్లాదమై
మధురానుభూతుల మధురమైనిండినప్పుడే
మనసునిండి మనఃస్ఫూర్తిగా నవ్వులు విరిసిపెదవులపై సజీవాలై పోతాయేమో
కానీ నేటి యాంత్రిక కాలంలో
బరువులమోతలో యంత్రంలామారి
నవ్వులన్ని నకిలీలై ప్లాస్టిక్ పువ్వులై
అసలు నవ్వునే మరచే యంత్రమౌతున్నాడు
అందుకే మనసు నవ్వడం మరచిపోయి
పెదాలు యాంత్రిక నవ్వులు నవ్వుతున్నాయి

