మిధునపు ఆనావాళ్ళు
మిధునపు ఆనావాళ్ళు
ఓ చెలీ! ఏకాంతం మనసును
గిల్లుతోంది...
పోనీ రాకూడదూ!
కను రెప్పల మీద పీటేసుకు కూర్చున్న
నిద్రమా తల్లికి హారతిచ్చేసి..
చెదిరిన కురుల కళ్ళాలు కలిపి
తీరు తీరున దువ్వేసుకుని...
ఎగసి దూకుతున్న సముద్ర
కెరటపు అంచు లాంటి..
మల్లె దండని
సాంతం జడ పాయన తురుము కుని..
అలసి సొలసి
తారాడే మొహం మీద రవ్వంత
చంద్రకళ పూసుకుని...
కంటి చూపులో ఇంద్ర నీలం
పెదవి ఎరుపులో అరుణిమ మెరిపిస్తూ...
కాలవ గట్టంపటా
చెరుకు తోట మలుపు తిరుగుతూ..
ఎగిరెగిరి దూకి వచ్చేవేళ ఎగసిపడే..
నీ వాలు జడలో
రేక మందారం ఉలిక్కిపడేలా..
నడుముచుట్టు పిల్ల కాలువైతిరిగే
పమిట..
జలతారంచు
మిలమిలల జూలు మెరసి మురిసేవేళ...
పట్టీలెట్టుకున్న పాదాలు
పరువు లెత్తే..
మెత్తటి కుందేళ్ళయి
నావైపు పరుగెట్టే వేళ...
కోనసీమ లంకతోట
ఏటివార ఇసుక మేట వెనక కట్టు కుందాం ఇసుక గూళ్ళు..
ఎడతెగని నిశీధి కబుర్ల వరవడిలో
ఏలుకుందాం ఎన్నో ఏళ్ళు..
ఇవేగా మన మిధునపు ఆనవాళ్లు!
