మానవత్వం మనుగడెక్కడ?
మానవత్వం మనుగడెక్కడ?
ఎక్కడెక్కడ?
ఎక్కడెక్కడ?
మానవత్వం మనుగడెక్కడ?
వృధ్యాపంలో ప్రేమ కోసం తల్లడిల్లే
కన్నతల్లిపై కరుణ చూపరాయే..
రాజినామా చేసిన తండ్రి
రాజీపడి బ్రతుకుతుంటే
ధైర్యం చెప్పి సహాయపడరాయే!
అక్క చెల్లెల్, అన్నా తమ్ముల్ కంట నీరు
ఎవరి కంట ఏనాడు పడదాయే !
చెలువ ప్రాణం విలువ ఏదని
ప్రశ్నించే గొంతుక మూగబోయే..
ఆశల రెక్కలు విరిగిన యువత,
రక్తపు మడుగుల్లో మిగులుతుంటే
ఏ మనిషి పట్టించుకోడాయే..
వీధి చివర వీధి కుక్కు
పసిపాప ప్రాణం హరించగా
లెక్క చేయరాయే..
తిండి లేక నీరు లేక,
ఎండ దాటికి తాళలేక
వదిలిన ప్రాణాల విలువ ఎరుగరాయే..
మనుగడెక్కడ మనుగడెక్కడ
మానవత్వపు మనుగడెక్కడ?
ఇక్కడిక్కడ !
ఇక్కడిక్కడ
మారిన మానవత్వపు చిరునామిక్కడ!
మానవత్వం ప్రకటించేందుకు,
సానుభూతి చూపేందుకు
పూనుకున్న సామాజిక వేదికలు .
అసంఖ్యా స్థాయిలో వస్తున్న, మానవత్వపు గీతికలు,
విఖ్యాతి కై ప్రాకులాడుతున్న అమానుష మానవాళి.
సామాజిక సంఘర్షణలకై
గుంజాటనపడు జనం,
సామాజిక మాధ్యమాల్లో
మానవతా స్థాయి తెలియజేస్తున్న జనం.
ఇళ్లలో, వీధుల్లో, రాష్ట్రంలో,
దేశంలో జరుగుతున్న వాటికి
స్పందించరు ఎందుకో?
ప్రతిఘటించరు ఎందుకో?
