కవిహృదయం
కవిహృదయం
*కవిహృదయం*
( వచనకవిత )
జనహితకరణం , రసభరితం కవి హృదయం
ఘన వినయ సమన్విత మృదు నవనీతం
కమనీయమౌ కవిత్వరచనా సామర్థ్యం
శ్రమజీవుల శ్రేయస్సుకై నిత్య సంఘర్షణం
ఋషి తుల్యమౌ వైరాగ్యభావనాకలితం
విషయవాంఛల నధిగమించు నిగ్రహం
పారమార్థిక చింతనతో పరబ్రహ్మస్వరూపం
పారద్రోలు చుండు నరిషడ్వర్గసమూహం.
జ్ఞానమార్గానువర్తితమౌ సాధు సజ్జనత్వం
దీనజనార్తిహరణమే కవికులానికి లక్ష్యం
భవిష్యద్దర్శన శక్తిసమన్విత దార్శనికత్వం
ద్రష్టయై భావితరానికి దిక్సూచిగా పయనం
అజరామరమై నిల్చు నట్టి కవితా దీప్తి విభవం.
ఆదర్శప్రాయమైన జీవనంతో అహరహరం
తపనపడితే అలవడు తుందద్భుత పాండిత్యం
గర్వాంధకారంతో పెద్దలను తూలనాడటం
తగదు తగదు కవులకు అధిక్షేపణమే అల్పత్వం
ఉన్నతప్రమాణాలతో ఉద్యమించే కవి కలం, గళం
ఊపిరి నివ్వాలీ జాతికి అనుక్షణం అదే కవి గమ్యం!//
