కోకిల పని
కోకిల పని
పట్టుదలకు ప్రతిరూపం..ఇవ్వడమే కోకిలపని..!
ప్రతిగాయం గేయంలా..మలచడమే కోకిలపని..!
తనకోసం దాచుకునే..సంపదంటు ఏంలేదు..
ఉన్నదంత గాలిలోకి..ఒంపడమే కోకిలపని..!
ఏకాకిని నొప్పించక..ఏకాకిగ తానుండును..
తనబ్రతుకును వెలుగుపాట..చేయడమే కోకిలపని..!
మౌనరాగ ధునితానై..ప్రవహిస్తూ పయనించును..
అక్షరాల గగనాలను..ఏలడమే కోకిలపని..!
నిరాశలను తరిమికొట్టు..నిగమపథము నాదంటూ..
ఎడారిలో వసంతాలు..నింపడమే కోకిలపని..!
ఆశయాలు లక్ష్యాలకు..అతీతమే గమ్యమెపుడు..
చీకటినే మధువులాగ..గ్రోలడమే కోకిలపని..
