కనపడని తీరం
కనపడని తీరం
కడవరకు కనపడని తీరమది
కనుమరుగైనాకే కనిపించే స్వర్గమది
అదే మరణం
అంతవరకు నిరంతరం
బ్రతుకు సమరం నిత్య కృత్యం.!!
జననం మొదలు జీవన మంతా
యావతో ముడిపడి అడుగు కదిపితే
కడలి ఘోషలా భయపెడుతుంది
మురిపాల మూటల
కమ్మని కలలా జో కొడుతుంది!!
తోలు తిత్తి దేహం లోని జీవం
చివరి శ్వాసను విడిచేదాకా
సుఖదుఖ్ఖాల పట్టాలపై
పరిగెడుతూనే వుంటుంది!!
నవాబైనా గరీబైనా
జవాబులు దొరకని ప్రశ్నలెన్నిటినో
మస్తిష్కంలో మోస్తున్నారు
అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే ఆరాటంతో..!!
స్థిమితం స్థిరత్వం
శాశ్వతం కాని బాటసారులమనే
విషయం తెలుసుకోలేక
విషమ పరిస్థితులను
సృష్టించుకొని
దృష్టి నంతా దానిపై నిలిపి
బంధాలను ఇబ్బందుల
ఇరకాటంలోకి నేట్టి
దోబూచులాటలాడుతున్న
అన్ని తెలుసనుకుంటున్న
ఏమి తెలియని వాళ్ళే అధికం ఈ లోకంలో.!!

