కార్తికమాసవైభవము
కార్తికమాసవైభవము
కార్తికంబున వైభవ కాంతి మెరసె
హరిహరాదుల కీయగా హారతులను
పడుతులెల్లరు భక్తితో పరవశించి
వచ్చియుండిరి దేవుని ప్రాంగణమున.
మ్రుగ్గు లెన్నియో పెట్టిరి మ్రొక్కు కొనుచు.
దీపముల్ వెలిగించగా పాపరాశి
భస్మమౌనంచు నమ్ముచు ప్రమిదలందు
తైలమున్ పోసి దేవుని తల్చుకొనిరి.
అరటి దూటపై దీపముల్ వరుస బెట్టి
జలము లందున విడిచిరి జయము కోరి.
కార్తికవ్రతమున్ సల్ప కలుగు శుభము
ధనము ధాన్యము గోవులన్ దానమిడగ
మేరునగమంత పుణ్యము మిగిలి తుదకు
శివుని సన్నిధిన్ భక్తులు చేరుకొంద్రు.
పరమ పావన మీమాస పర్వమిదియె
పూర్ణిమ దినమునన్ శ్రద్ధగా పూజ చేసి
కార్తికంబున యందరు కలిసి మెలిసి
వనము లందునామ్లకవృక్ష మునకు మ్రొక్కి
భోజనంబులు సేయగా పుణ్య మొసగి
దేవ దేవుండు కోరికల్ తీర్చు నెపుడు.
స్నాన జపతప దానముల్ సలుపు చుండి
కార్తిక మహాపురాణమున్ గలిసి చదివి
నివ్విధంబుగా జనులిల నెరుకకల్గి
నుపవసించగా హరియె తా నుద్ధరించు.//
