జ్వాలనై
జ్వాలనై
అపరాతిరి త్రాగొచ్చి నరుపులతో నను గాంచి
విపరీతముగా నీవు వెఱ్ఱిపట్టినట్లు ప్రవర్తించి
సంసారపు నౌకను సమస్యల జలధిలో ముంచ
హింసాత్మక ధోరణిలో నెదురులేక కలహించ
నిశ్శ్శబ్దంలో మున్గి నిట్టూర్పులు విడుస్తున్నా!
నిస్సత్తువతో నిలిచి నిత్యము రోదిస్తున్నా!
ఎప్పటిదో నా కథ!ఎన్ని వేల యేండ్ల చరిత!
తప్పులనిక క్షమించక తరిమేశా నా కలత!
నిబ్బరంగా నడుగేసి నిశ్చలంగా నిలబడతా!
అబ్బురంగా చూడకండి!అద్భుతమే చూపెడతా!
బానిసతనముకు నేను బందీని కాను కాను!
గానుగెద్దులా నిపుడు కాలమును గడుపలేను!
ఆదిశక్తి రూపిణిగా నవతరించబోతున్నా!
బాధలను తెగటార్చి భయాన్ని వదిలేస్తున్నా!
గుండెలోని మంటతో గొంతువిప్పబోతున్నా!
మండుతున్న జ్వాలనై నీ మదాన్ని తగలేస్తున్నా!
మారుతున్న కాలంలో మహిళ జయిస్తుందిలే!
ధీరతతో నడుగేసి దివ్యమై వెలుగుతుందిలే!//
