జనారణ్యం
జనారణ్యం
విషం నిండిన నాగు
దారి మరచిందో
లేక తిండి కనిపించిందో
ప్రాకుతూ జనారణ్యంలోకి...
మనిషి ఒళ్ళంతా విషమేనని తెలియక...
దారిని వెతుక్కుంటూ జనారణ్యంలోకి...
పైకి కనపడే నాలుక ఒకటే మనిషికి
ద్విజిహ్వ పాములకు...
కుబుసము వదలి కదులుతూ ఆ నాగు...
మాటలు నేర్చి
అవసరానికి రూపు మార్చి
కథలు నడుపుతూ మానవుడు...
పక్షి గ్రుడ్లను మింగుతూ ఆ నాగు...
దొరికింది దోచుకుంటూ
కట్టడాలు కడుతూ
అక్రమార్జనలను మింగుతూ మానవుడు...
బుసలు కొడుతూ ఆ నాగు...
మేకపోతు గాంభీర్యంతో మానవుడు...
జర జర ప్రాకుతూ ఆ నాగు
సందుల్లో
గొందుల్లో
బురద కాలువల్లో
పరుగులు తీస్తూ
పరుగు పెట్టిస్తూ
వీథుల్లో
నగరాల్లో
మానవుడు...
ఒకటే ఆశతో పరుగు పందెం
నాగు అపాయమని తెలిస్తే కాటేసే నైజం
మనిషికి ఉపయోగమని తెలిస్తే
వాడేసుకుని పారేసే నైజం
అది వస్తువునైనా , సాటి మనిషిని అయినా...
అదే మనిషి ఉపకారం చేసిన వారిని
నాగు పాములా మారి కాటేస్తూ. ..
ప్రాకుతూ వచ్చి జనారణ్యంలో చిక్కుకోకు
కోరల్లోని విషాన్ని లాగేసి
చర్మాన్ని వలిచేసి
దేహాన్ని మాంసంగా మార్చేసి
ఆరగించేస్తాడు మనిషి...
విషముంది అని గర్వపడకు
మనిషిలో నీకు మించిన విషముందని మర్చిపోకు...
వెళ్ళిపో... జనారణ్యం నుంచి...
కీకారణ్యం లోకి...
బ్రతికిపో...
