గాజులు
గాజులు
రంగు రంగుల రాణి గాజులు
పెళ్లి వేడుకను పెంచు గాజులు
చిత్ర చిత్రపు మెలిక గాజులు
సింగార మొలకించెడి గాజులు
అమ్మల్లారా!గాజులు!గాజులు!
చిన్న తల్లులకు చిట్టి గాజులు
దిష్టి సోకనీయవీ నల్ల గాజుల
పూవుల పూవుల బొమ్మల గాజులు
వరుసలుండిన జమిలి గాజులు
అమ్మల్లారా!గాజులు!గాజులు!
కన్నెపిల్లలకు నచ్చెడి గాజులు
ఘల్లు ఘల్లు మనే కంచు గాజులు
లావణ్యమును పెంచు లక్క గాజులు
రమణీయమౌ రాజస్థానీ గాజులు
అమ్మల్లారా!గాజులు!గాజులు!
పెద్దముత్తైదువులు మెచ్చే గాజులు
పేరంటాళ్ళకు పంచెడి గాజులు
పట్టు చీరపై మెరిసెడి గాజులు
పండగలప్పుడు తొడిగే గాజులు
అమ్మల్లారా!గాజులు!గాజులు!
రాజసమొల్కెడి రత్నపు గాజులు
రంగులీనెడి రబ్బరు గాజులు
మనసు దోచునీ మట్టి గాజులు
మన్నిక తో నిల్చియుండెడి గాజులు
అమ్మల్లారా!గాజులు!గాజులు!
రాణివాసము మెచ్చిన గాజులు
రాజుల కాలపు పూర్వపు గాజులు
జాతి సంస్కృతి నిల్పెడి గాజులు
జీవనములో భాగమీ గాజులు
అమ్మల్లారా!గాజులు!గాజులు!
సొగసు పెంచు శోభనపు గాజులు
వగలు పోవునీ వంకీ గాజులు
మగువ కందము నిచ్చెడి గాజులు
మగవారి మనసు దోచే గాజులు
అమ్మల్లారా!గాజులు! గాజులు!
వేదకాలపు గుర్తులీ గాజులు
సీతచేతికి తొడిగిన గాజులు
రాధ కరమున మురిసిన గాజులు
కాలము నెరగవీ కలికి గాజులు
అమ్మల్లారా!గాజులు! గాజులు!
జాతి బేధములు చూపవీ గాజులు
మతము లేవీ తెలియని గాజులు
సౌభాగ్యానికి చిహ్నమీ గాజులు
సరాగాలకు సాక్షులీ గాజులు
అమ్మల్లారా!గాజులు గాజులు!
--------------------------------------------------
