ఎన్నో రంగులు
ఎన్నో రంగులు


రంగేలేని నీటి చుక్కల ఒంటి పై నేసిన
చీరె పేరు ఏడువర్ణాల హరివిల్లు!
పులకింపచేసే పుడమిదొక్కొక్క చోట
ఒక్కొక్క వర్ణం!
ఒక్కొక్క తావులో మనిషి ఒంటిపై
మారే వేర్వేరు రంగులు!
నిజమైన రంగుల్లాంటివి కొన్ని
'నిజాలు బంధాలు ప్రేమలు'
పరావర్తనంతో రంగులు పులుముకునేవి ఇంకొన్ని
'మోసాలు క్షణికావేషాలు స్వార్థాలు'
ఒక్కరోజులోనే 'నవ్వులు కోపాలు సంతోషాలు వేదనలు' ఎన్ని మారే రంగులో!
అన్ని రంగులు కలిపితేనే మనిషి!
అన్ని రంగులు పులిమితేనే అవని!
అన్ని రంగులు కలిస్తేనే వైవిధ్యమైన ప్రతిరూపాలు!
కలగాపులగంగా కలిపితేనే కొత్త వర్ణాలు!
లోకమనే కాన్వాస్ పై ఎన్ని రంగుల వ్యక్తిత్వాలో!
దేవుడు కలిపే ఎన్నో వర్ణాల నిష్పత్తులే కదా
మనిషిని పోలిన మనిషి ఉండనట్టు
అనేకరకాల మనుషులు!
మంచితనం ప్రేమ త్యాగం సహనం అనే బొమ్మలను గీసేందుకు అవసరమయ్యే రంగులనెప్పుడు
చచ్చేంతవరకు కుంచెతో
మనిషి కలుపుకుంటూనే ఉండాలి!
అన్ని వర్ణాలుంటేనే కాలమంటూ ఒకటి ప్రపంచానికి ఋతువులై రంగురంగుపూలలో మెరిసిపోతూ!