చిన్న ఆశ
చిన్న ఆశ
చిన్న ఆశ
(ద్విరదగతి రగడ )
ఇరుకైన వీధిలో నీ చిన్న గృహములో
కరువైన కాంతితో కాటేయు కంపులో
మగ్గిపోవుచు మేము మాటలే మరిచాము
అగ్గిలా మండుచూ నాశనే విడిచాము
పరుగులను బెట్టుచూ భయముతో కనలుచూ
సిరులనే తల్చుచూ చింతలో మునుగుచూ
మరలమై సంసార మసటులో మునిగాము
తెరవులేదనుచుండి దిగులుతో కుమిలాము
మారులే కాలంబు మా రాత మారులే
దారియే దొరుకులే తామసము వీడులే
జలములే స్వచ్ఛమై జలజలా పారులే
కలుషితంబులులేని గాలులే వీచులే
కళకళ లాడుతూ భాస్కరుని కిరణాలు
వెలుగునే నింపగా విరబూయును వనాలు
జీవితంబున కాస్త జీవంబు మిగులులే
మా వగలు తొల్గగా మనసులే మురియులే
మొలకెత్తె నొకయాశ ముచ్చటగ మదిలోన
కలలన్ని తీరగా కరిగించు కాలమున
ప్రొద్దు పొద్దున నేను పూవులను కోయుచూ
ముద్దుగా పతితోడ ముచ్చటల నాడుచూ
పాదపంబుల నీడ భానుడిని కాంచుచూ
మోదముగ నడుచుచూ మురిపెంబు నొందుచూ
భావనలు కలబోయ పాటలను పాడుచూ
మావారితో కలిసి మైమరచి నవ్వుచూ
ఇంటిలో కార్యంబు లిరువురము సలుపంగ
జంటగా మేమెపుడు సరసాల గడుపంగ
ధనమేమి ఖర్చౌన? దాంపత్య వనములో
కనరాని స్వర్గమే కనుపించు ధరణిలో
చిన్న చిన్న యాశను చిగురింప చేశాను
పున్నెముల కోసమై పూజలను చేశాను.
