చీకటి నీడలు
చీకటి నీడలు
నీడల ఉనికి వెలుతురులోనే
మసక చీకట్లో మసకగా నీడలు
చీకటి కమ్మిన వేళ తెలియని జాడలు
అస్పష్టంగా కనిపించే చీకటి నీడలు
ఏ బతుకు పూల పాన్పు కాదు
జీవితమంటే వడ్డించిన విస్తరి కాదు
కష్టాల కడలి ఈదుతేనే చేరేటి దరి
చిమ్మ చీకటి దాటితే వెలుగులు మరి
చీకటి నీడలు వెంటాడే జీవితం
మూసుకున్న దారుల్లో ప్రయాణం
వెలుగుకై వెతుకుతూ ఆరాటం
రేపటి భవిష్యత్తుకై తప్పని పోరాటం
నవ్వుల వెనుక దాగిన కన్నీళ్లు
కనిపించని గుండె గాయాల ఆనవాళ్లు
ఎవరికీ అర్థం కాని అంతులేని కథలు
తన మనసే మనసును ఓదార్చే వెతలు
నమ్మిన చోటే వంచనల దాష్టీకం
ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి
చీకటి నీడల్లా వెంటాడే ఆపదలు
దరిదాపుల్లో కనిపించని ఆశల చుక్కలు
కొన్ని జ్ఞాపకాలు చీకటి గదిలో నిక్షిప్తం
మూసినా వెంటాడి వేటాడు అనుక్షణం
వాటిని మరిచిపోవాలనుకున్న ప్రతి క్షణం
గుండె తలుపు తట్టి బాధించే లక్షణం
ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా నడిచే రోజులు
చీకటి నీడలు వెంటాడినా లోపలి ధైర్యం
తుఫానులు ఏవోచ్చినా తట్టుకునే స్థైర్యం
చీకటి నీడలు వీడి వెలుగుల్లోకి పయనం !
