బ్రతుకు నాటకాలు
బ్రతుకు నాటకాలు
బ్రతుకు నాటకాలు నేర్చుకోకముందు .
అచ్చం గా మనం జీవించిన ఆ బాల్యపు పొద్దు
ఎంత స్వచ్ఛంగా పిలుచుకునే వాళ్ళం
ఒరేయ్ ,పోరా ,రారా అనుకుంటూ .
అందరి నెత్తుటి వర్ణం ఒకటేనని తెలుసు మనకు కొట్టుకు పోయిన మోకాళ్ళకు ఉమ్ముతడి పూసుకుని
చేయి చేయి కలుపుకొని మళ్లీ పరుగులెత్తేవాళ్ళం .
ఈ లోకమొక ఆటస్థలమని ఎరిగిన తత్వజ్ఞానులం .
పట్టాలు పుచ్చుకోని పుట్టు మేధావులం .
వర్షించే ఆకాశపు అభినయాన్ని చప్పట్లతో
ప్రోత్సహించేవాళ్ళం .
ప్రసవించిన స్త్రీ తలనిమిరిన తండ్రిలా
మట్టిని మమకారం తో తాకే వాళ్ళం .
సుతి మెత్తని గాలిని అతి ఘాడంగా
కౌగిలించుకొనే వాళ్ళం .
ఎంత పెద్దరికాన్ని ప్రదర్శించే వాళ్ళం మనమప్పుడు.
కానీ రాను రానూ ...చిన్నవాళ్లమైపోతున్నాం .
చిన్నబుచ్చు కోవాల్సిన పనులుచేసేస్తున్నాం .
