అనుభవం
అనుభవం
ఆమెఅడుగు జాడలలో..దివ్యమైన అనుభవం..!
చూపలేని తాళగతుల..చిత్రమైన అనుభవం..!
ఆమెకురుల నీడలలో..ఎన్నికలల రాగసిరులు..
మధుధారలె యేరులైన..అందమైన అనుభవం..!
ఆమెవలపు వీణియతో..మోహమెంత మనోహరం..
పలుకలేని అక్షరాలు..మాయమైన అనుభవం..!
ఆమెపెదవి అంచులింట..స్వరములెన్ని ఆగిపోయె..
నిత్యప్రణయ మాలికలే..కావ్యమైన అనుభవం..!
ఆమెగాన ఫణితిలోన..సాగిపోవు నదినైతినె..
ఒకబంగరు మేఘమాల..తీర్థమైన అనుభవం..!
ఆమె నాట్యభంగిమలకు..మూగబోయె మానసమే..
చరిత్రలో మిగిలిపోవు..శిల్పమైన అనుభవం..!
