అమ్మా ప్రేమ
అమ్మా ప్రేమ
అమ్మచేతి గోరుముద్దలోని
కమ్మనైన ప్రేమ...
ఆడపిల్ల మరచునా!
అత్తారింటికి వెళ్ళినా!
ప్రాయపు బరువులను మోయలేని
ఎదలు చేయు చప్పుళ్ళ ప్రేమ
ఆకర్షణలకు ఆలవాలమే గాని
నిండు మనసు అర్పణలుండునా!
అందాలన్నీ మూటగట్టి మగని
దోసిట్లో పోసే సమయాన
దోరవలపు చూపుల ప్రేమ
ముదిత మురిసిపోతూ తలవకుండునా!
అమ్మగా మారిన అతివ ఆనందం
పురిటి శిశువుపై పంచుకున్న ప్రేమ
ఏ రత్నరాశులు, ఏ రాజభోగాలతో
ఎప్పటికైనా సరితూగ గలుగునా!
బొడ్డుకోసిన మమకారంతో కదిలే కడుపు
రొమ్ముపాలిచ్చి పెంచుకున్న ప్రేమ
ఏ పరిస్థితైతేనేమి బిడ్డ దూరమయితే
ఆ తల్లి గుండె పగలకుండా ఉండునా!!
