అదిగో వాన
అదిగో వాన
అదిగో వాన...
కారుమబ్బులు కమ్మె ఖచరములు తలలూచె
సైరికుల హృదయాల సన్నని యాశ మొలచె
మన్ను వాసన రేగ మంచి సూచన తెచ్చి
కన్నభూమికి పైరగాలి కబురులు తెచ్చి
రివ్వుమని వీచగా రేగడికి బలమొచ్చె
దవ్వులందు మెఱుపులు తళతళా యనజొచ్చె
చిన్న చిన్నగ రాలు చినుకులను గమనించ
సన్న జలతారువలె జారుతూ మురిపించ
జలజలా చిరుజల్లు జగతిపై వాలంగ
గలగలా నవ్వుతూ కర్షకులు మురియంగ
పల్లెలందున వాన బడబడా కురిసింది
జల్లుజల్లున ధరకు సంపదలు తెస్తుంది
భయము పోద్రోలుచూ బాసటగ వస్తుంది
జయము కలిగిస్తుంది శక్తి నిలబెడుతుంది
భోగ భాగ్యాలతో ప్రజకు వరమిస్తుంది
వేగముగ దేశమున వృద్ధి కనిపిస్తుంది.//
