అద్దె ఇల్లు
అద్దె ఇల్లు
*అద్దెఇల్లు*
(తేటగీతి మాలిక )
అవసరానికో గూడుగా నద్దె యిల్లు
దొరికినంతనే భారము తొల్గిపోవు
ననుచు చింత వీడి మనము చిందులేయ
క్రొత్త కష్టముల్ మనలను కుదిపివేయు
ఖర్చు పెంచెడి విద్యుత్తు కాల్చివేయు
పంపు లందున జలములు పాఱవకట!
మొదటి తారీఖు బరువులో ముంచివేయ
నిక్కటులు పెంచుచుండునా యింటి పెద్ద
పాలకుల నెప్డు సేవించు బంట్లవోలె
వినయమున్ జూపి మాట్లాడి వీడి సిగ్గు
శాసనంబులన్ మీరక సఖ్యతమెయి
కాలమెట్టులో తీరుగా గడుపవలయు.
మంచి తనముతో యజమాని మదిని గెల్చి
ప్రేమ పొందిన చాలును వేడ్కమీర
కలిసి మెల్గుచు నెయ్యులై గడుపవచ్చు
నద్దె యింటిలో వారినెల్లాదరించి
సొంత బంధువులన్నట్లు చూచువారు
జగతి యందున కలరులే!దిగులు వలదు!
నోరు మంచిదిగా యుండ నూరు మనకు
మంచిదౌ నను సూక్తిని మరువ రాదు!//
