ఆపలేము
ఆపలేము
చిగురాకుల కోవెలలో..రాగాలను ఆపలేము..!
మరుమల్లెల మనసులలో..చిత్రాలను ఆపలేము..!
ఎందుకలా నవ్వుతాయొ..కలహంసలు నన్నుచూసి..
వాటి ఎదను జరుగుతున్న కలహాలను ఆపలేము..!
ఆకసాన మేఘాలకు..గమ్యమనగ ఈ భువియే..
అది తెలిసీ తిరుగుతున్న మేఘాలను ఆపలేము..!
ఊహలోని మధువంతా..పొంగుతూనె ఉండును కద..
తనువు మరచి పనిచేసే..త్యాగాలను ఆపలేము..!
జలధులన్ని దిగదుడుపే..కంటజారు వేదనలకు..
మనసుగొడవ చాలించని..గంధాలను ఆపలేము..!
ఎవరికొరకు పూస్తున్నవి..వసంతాలు మధురముగా..
ప్రతి సుమమున ఒదుగుతున్న..అమృతాలను ఆపలేము..!
పల్లె ఎదో పట్నమేదొ..చెప్పేందుకు వీలు పడదు..
కాలుష్యపు సాలెగూటి..దారాలను ఆపలేము..!
