Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kishore Semalla

Tragedy Inspirational Others

4.8  

Kishore Semalla

Tragedy Inspirational Others

అప్పటికే ఆలస్యమైంది

అప్పటికే ఆలస్యమైంది

6 mins
892


               
              
               మా ఇంట్లో అమ్మ, నాన్న, నాన్నమ్మ, అన్నయ్య మరియు వదిన ఆరుగురం వుంటున్నాం. మా బాబాయ్ కూతురు (మా చెల్లి ) పెళ్లి ఉండటం తో అందరూ చాలా రోజుల తరువాత ఊరికి వచ్చారు.

              
               అదృష్టమో, యాదృచ్చికమో అందరు ఒకచోట చాలా రోజుల తరువాత మళ్ళీ ఇలా కలుసుకున్నారు.


               బరువు బాధ్యతలు అమ్మకి కొత్తేమి కాదు. కాకపోతే అందరి రాక తో ఇంకాస్త బరువు, ఇంకొన్ని బాధ్యతలు అదనంగా చేరాయి.

   
               రోజు పడుకునే తన నిద్ర లో ఒక గంట తక్కువయ్యింది. చేసే పనుల్లో శ్రమ పెరిగింది, సాయం చేసే చేతులు కోసం అమ్మ ఎదురుచూడదు.


              ఆకలిని పట్టించుకోదు, కానీ అందరి ఆకలి గుర్తిస్తుంది. అంతా వడ్డించాక మిగిలితే తింటుంది, లేకుంటే ఆకలి లేదని అబద్ధం చెప్తుంది................. నేను అంతా గమనిస్తూనే ఉన్న.


              ఇదే సమయం లో ఒక రోజు అమ్మ కి నాన్నకి చిన్న గొడవ, దాంతో నాన్న అమ్మ తో మాట్లాడటం మానేశాడు...................... కానీ అమ్మ కన్నీళ్లు నాకు మాత్రమే కనిపించాయి.


              అమ్మ చాలా అమాయుకురాలు. పిల్లలు, భర్త తప్ప వేరే ప్రపంచం తెలీదు తనకి. ఆ రోజుల్లో చదువు లేదు. నాన్న అంటే చాలా ఇష్టం తో పెళ్లి చేసుకుంది. వరసకి ఇద్దరు భావ మరదల్లే.


             పెళ్లైన కొత్తల్లో నాన్న కి ఇంకా ఏ ఉద్యోగం లేకపోవడంతో తాతయ్య మిమ్మల్ని పోషించడం ఇంక నా వల్ల కాదు అని పెద్ద గొడవ చేసాడు. అన్నయ్య చంటి పిల్లాడు. వాడికి ఇదంతా తెలీదు ఒక్క ఆకలి వేస్తే ఏడుస్తాడు అంతే. వాడి ఆకలి తీర్చడానికి నాన్న ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు.


            ఇంతలో నాన్నకి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. కోచింగ్ కోసం డబ్బులు కావాలి. నాన్న తన ఆత్మ గౌరవం చంపుకోలేక తాత ని అడగలేకపోయాడు.


            ఆ కష్ట సమయం లో అమ్మ నాన్న కి తోడుగా నిలిచింది. తన తాళిని తీసి పసుపు కొమ్ము కట్టుకుని, దేవుడి దగ్గర తాళిని పెట్టి - మా ఆయన పెద్ద ఆఫీసర్ అయ్యి రావాలి అందుకోసం మీ దీవెనలు ఎప్పుడు మా ఆయన పైన ఉండాలి అని ప్రార్దించి, దాన్ని తాకట్టు పెట్టి వెళ్లి మంచి ఆఫీసర్ అయ్యి రమ్మని నాన్నని పంపింది.


           అక్కడికి రెండేళ్లకు నాన్న అసిస్టెంట్ కమెరిషియల్ టాక్స్ ఆఫీసర్ అయ్యాడు. మా కష్టాలు అన్ని తిరిపోయాయి అనుకున్నాం అందరం.


          కొన్ని రోజులు గడిచాయి, పరిస్తితులు ఏమి బాలేవు. నాన్న చీటికీ మాటికి అమ్మ మీద అరుస్తున్నాడు, కోప్పడుతున్నాడు, కసురుతున్నాడు. దగ్గరకి రానివ్వట్లేదు. విషయం తెలియని అమ్మ తనలో తానే బాధ పడుతుంది.

          అన్నయ్య ని చంకలో ఎత్తుకుని అమ్మవారిని దర్శించునుకుని, తన బాధ ని చెప్పుకుందాం అని గుడికి వెళ్లి తిరిగొస్తుంది. దారిలో నాన్న వేరే అమ్మాయిని బైక్ మీద తీసుకు వెళ్లడం గమనించి, కారణం ఇదా అని ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది.

        
              అమ్మకి చాలా భయం వేసింది, నాన్న వదిలేస్తాడని. అందుకే వెంటనే ఆడిగేసింది. "అన్నీ తెలుస్తున్నాయి మీ కథలు", ఇంతకీ ఎవరా నంగణాచి నా కాపురం లో నిప్పులు పోయాడానికి వచ్చింది అని నాన్న ని గట్టిగా అడిగి కడిగేసింది.


         అంతే కోపం తో ఊగిపోయిన నాన్న మొదటి సారి అమ్మ మీద చెయ్యి ఎత్తాడు. అది మొదలు అమ్మ అడిగిన ప్రతి సారి కొట్టేవాడు. అమ్మ రోజు బాధ పడేది, ఏడ్చేది. ఎన్నో నిద్ర లేని రోజులు గడిపింది. కానీ ఏ రోజు మమ్మల్ని, నాన్న ని వదలలేదు. తన రెక్కలు ముక్కలు అయ్యేలా కష్టపడేది................ అమ్మ కష్టం నాకు మాత్రమే అర్ధం అయ్యేది.


          కొన్నాళ్లకు తను పెద్ద వాళ్ళందరిని బ్రతిమాలి, తన మాంగాల్యం కాపాడమని వేడుకుంది. వాళ్ళందరూ నాన్నకి అర్థమయ్యేలా చెప్పారు. కొన్ని రోజుల కి నాన్న దారికి వచ్చాడు.


         కానీ అమ్మ కి ఇంకా కష్టాలు తప్పలేదు. అన్నయ్య కి స్కూల్ కి వెళ్లే వయసు వచ్చింది. మాతో పాటే అమ్మ వయసు కూడా పెరుగుతుంది. కానీ పనులు తగ్గట్లేదు. అమ్మ ఆరోగ్యం ఎప్పుడు బాగుండేది కాదు. తరచు వొళ్ళు వేడిగా ఉండటం, కాళ్లు చేతులు తిమ్మిర్లు పట్టడం ఇలాంటివి వుండేవి............నాకు చాలా బాధ వేసేది.


         మాతో చెప్పుకోలేదు, అన్నయ్య చిన్నపిల్లోడు. నాన్న కి చెప్తే అరుస్తాడు. కానీ అమ్మ మొఖం పైన చిరునవ్వు చేరిగేది కాదు. ఆ అందమైన ముఖం చూస్తే స్కూల్ నుంచి ఇంటికి వచ్చే అన్నయ్యకి ఎంతో ఆనందంగా ఉండేది.
        
  
         ఒకరోజు అమ్మ బాగా అలసిపోయింది. పాపం ఏ పని చెయ్యలేకపోతుంది. నోరు తెరచి నాన్న ని " కొంచెం కష్టంగా ఉంది, పని ఎక్కువ అవుతుంది". "పిల్లలు బట్టలు, మీ బట్టలు ఉతకాలి." " మీకు పిల్లలకు వంట చేసి త్వరగా కట్టాలి". నా ఆరోగ్యం కూడా కాస్త మంచిగా ఉండటం లేదు ఈ మధ్య. ఒక వాషింగ్ మెషీన్  కొంటె కొంత సాయం అవుతుందని అడగలేక అడిగింది.


         దానికి కస్సుమని, పాము బుసకొట్టినట్టు పైకి లేచాడు నాన్న.


         వచ్చే సంపాదన పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ఇప్పటికిప్పుడు వాషింగ్ మెషీన్ అంటే ఎంత అవతాదో తెలుసా నీకు. ఐనా నువ్వు కొత్తగా కోరికలు అడగటం మొదలుపెట్టావే. నేను, పిల్లాడు స్కూల్ కి వెళ్ళాక నీకు పనేముంటుంది. త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని కాసింత విశ్రాంతి తీసుకో అని చెప్పి నాన్న చేతులు దులిపేసాడు.


          దానికి అమ్మ బాధని తనలోనే దాచుకుని పిల్లలు చదువు ముందు, నేనే సర్దుకుపోతా అనుకుంది.............. కానీ అమ్మ బాధ నాకు అర్ధం అయింది.


         అమ్మ తన అన్ని కోరికలు మెల్లమెల్లగా చంపుకుంటు నెట్టుకొచ్చేస్తుంది.............. కానీ ఆరోజు  అనుకున్న నేను అమ్మ కష్టాలు తీర్చేయాలి ఎలా ఐనా అని.


        అన్నయ్య  పెరిగి పెద్దవాడయ్యాడు. అమ్మ శక్తికి మించిన పని చేస్తుంది. కానీ తన ముఖం లో అది కనపడనివ్వదు. తన సంతోషమంత కుటుంబమే. నచ్చిన వంటలు వండేది. "బాగున్నాయి" అన్న మా ఒక్క మాట కోసం తన ప్రాణం ఎదురుచూసేది.


         ఇంతలో అమ్మ తగ్గిపోవడం నేను గమనిస్తూనే ఉన్న. ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోవడం తో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అమ్మ కి మధుమేహం వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దాంతో చిన్నప్పట్నుంచి అమ్మ కి అన్ని రుచులు చూపించాలన్న నా కల చేదిరిపోయింది............... కానీ అప్పటికి అమ్మ అలసిపోలేదు.


         కొన్నాళ్లకు ఇంట్లో పరిస్థితులు అన్ని చక్కదిద్దుకున్నాయ్. నాన్నకి జీతాలు బాగా పెరిగాయి. పెద్ద ఇల్లు కట్టుకున్నాం. అందరికి పెద్ద ఇల్లు కనిపిస్తుంది,................. కానీ నాకు మాత్రమే అమ్మకి పెరిగిన పని కనిపించింది.


         ఇంట్లో నాన్న మాటే జరగాలి. అందుకే ఇల్లు నాన్న కి నచినట్టే కట్టారు. కానీ ఆ ఇంటి కోసం పని చేసిన పని వాళ్ళని అమ్మ కన్నబిడ్డల్లనే చూసుకుంది. ఏరోజు ఎవరికి ఏ లోటు చెయ్యలేదు.


          అలసిపోయుంటారని తెలిసి మధ్యాహ్నం నిమ్మరసం కలిపి తీసుకెళ్లేది. ఇంట్లో పనులు చేసేది, మళ్ళీ సాయంత్రం ఐతే అందరికి టీ చేసి తీసుకువెళ్ళేది. ఇలా అమ్మకి పగలంతా విశ్రాంతి లేకపోవడం, సమయానికి తిండి తినకపోకడం తన ఆరోగ్యాన్ని మరింత క్షిణింపజేశాయి............... అయినా అమ్మ అలసిపోలేదు.


          ఇంతలో ఆనందకరమైన విషయం. అన్నయ్యకి పెళ్లి కుదిరింది............... అమ్మ కి చెప్పలేనంత ఆనందం కళ్ళలో నాకు కనిపించింది.


          పిల్లలే ప్రాణంగా బ్రతికే అమ్మ కదా, ఈ ఆనందం తో తన ఆరోగ్యం కోసం బెంగ పడలేదు. మరింత ఉత్సహంతో వచ్చిపోయే చుట్టాలతో ముచ్చట్లు ఆడుకుని అసలు అలసట లేకుండా పని చేసింది........... ఐనా అమ్మ అలసిపోలేదు.


          వదిన వస్తే అమ్మకి సాయంగా వుంటుంది అని అనుకున్నా.  అన్నయ్యకి హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది. వాళ్లు హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ అమ్మ బోసిపోయింది.


         అమ్మ మళ్ళీ ఒంటరి అయిపోయింది. అమ్మ నవ్వులు బోసిపోయాయి. మళ్ళీ ఆరోగ్యం క్షిణించడం మొదలు అయింది. కానీ ఆరోగ్య విషయాలు ఏవి మాతో చెప్పేది కాదు. నాన్న కి ఎప్పుడో చెప్పడం మానేసింది, పట్టించుకోడు అని.


         తర్వాత కొన్నాళ్లకు ఇప్పుడు ఇలా మళ్ళీ అందరూ కలుసుకున్నారు. కానీ ఏది మారలేదు. వంట గది ఇంకా పరిగెడుతూనే ఉంది. తర్వాత రోజుల్లో నాన్న వాషింగ్ మెషీన్ కొన్నా అమ్మకి చేతులతో ఉతకడం అలవాటు అయిపొయింది. చేసే పనులు పెరిగాయి అందరి రాక తో.


          రాత్రి ఐతే చాలు అమ్మ ఒడికి చేరిపోతా నేను.అన్నయ్య వదిన అమ్మ చుట్టూ చేరి కబుర్లు చెప్పడం చాలా బాగుండేది.................... అప్పుడు అమ్మ కళ్ళలో ఒక ఆనందం నేను గమనిస్తూనే ఉన్న.


         ఒకరోజు అమ్మ కాళ్ళలో రక్తం గూడు కట్టడం నేను గమనించ, ఐతే అమ్మ అది మట్టి అని అందర్నీ నమ్మేలా చేసింది................ "కానీ నాకు ఎక్కడో అనుమానం, అమ్మ అబద్ధం చెప్పిందని."


             అదే రోజు రాత్రి అన్నయ్య తలని నిమురుతూ- " నీ భార్య ని బాగా చూస్కో. ఆడపుట్టుగా అంటేనే కష్టాలతో పుడతాం, కష్టాలతో బ్రతుకుతామ్. మేమంటే అందరికి లోకువె."  ప్రాణంగా చూసుకునే భర్త దొరికితే మాకు ఆ కష్టాలన్నీ కనిపించవు అని ఆ రాత్రి అన్నయ్యకి చాలా మాటలు చెప్పింది అమ్మ..................." నేను అన్ని వింటూనే వున్నా".


              ఆ మరుసటి రోజే హటాత్తుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అమ్మ. అంతా త్వరగా అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.


             ఐనా " అప్పటికే ఆలస్యమైందని" డాక్టర్ చెప్పాడు.


             తనకి బ్లడ్ కాన్సర్ అని ఇన్నాళ్లు మీ ఎవరికి చెప్పకుండా తనలో తానే కృంగిపోయేదాని, ఎప్పట్నుంచో పోరాడుతుందని, ఇదంతా కేవలం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని డాక్టర్ చెప్పాడు.


             అమ్మ పూర్తిగా అలసిపోయింది జీవితం లో, ఏం అనుభవించింది తన జీవితంలో. పేద ఇంట్లో పుట్టి చిన్నపుడు కష్టపడింది. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈరోజు వరకు కష్టపడుతూనే ఉంది.


             అమ్మ లేని రోజులు మొదలయ్యాయి. నాన్న బయట నుంచి వచ్చి, "పిల్లా" ఈ కూరలు తీసుకువెళ్ళు లోపలకి అని అరచి, లేదు కదా అని దిగులు చెంది వచ్చి కూర్చున్నాడు. అటు నుంచి టీ అందించి, టిఫిన్ రెడి చేసి స్కూల్ కి వెళ్లడానికి బట్టలు ఇస్త్రీ చేసి ఎప్పుడు గల గలా మాట్లాడే అమ్మ లేకపోవడం నాన్న కి అమ్మ విలువ ఏంటో తెలుస్తోంది ఇప్పుడు.


            ఒంటరి గా పడుకోవడం, ఐతే బయట తినడం లేకుంటె నాన్నమ్మ ఏమన్నా వొండితే తినడం. అన్ని పనులు తానే చేసుకోవడం. ఇక పై అమ్మ లేదు, రాదు అని గుర్తించాడు నాన్న.


           కానీ అమ్మ నా దగ్గరకు వచ్చేసింది. నేను ఏడో నెలలో వుండగానే అమ్మ కడుపులో ప్రాణం వదిలేసాను. ఆరోజు నుంచి అమ్మ లేకుండా ఒంటరి గా వున్నాను. ఇన్నాళ్లు అమ్మ కష్టాలు చూసినా.....ఏం చెయ్యలేని నిశయస్థితి లో ఉండిపోయాను.


          ఇప్పుడు అమ్మ వుంది నాకు. నాకు అమ్మ లేని లోటు తీర్చడానికి అమ్మ నా దగ్గరకి వచ్చేసింది. ఈ భూమి మీదకి వచ్చి వుంటే నేను అందరి లానే అమ్మ విలువ, అమ్మ కష్టం గుర్తించలేకపోయేవాడ్ని ఏమో. నన్ను పురిటి లొనే ప్రాణం తీసిన ఆ దేవుడు తల్లి పడే కష్టం, తను పంచె ప్రేమ గుర్తించే లా వరం ఇచ్చాడు అనుకుంటా. అందుకే నా ఆత్మ ఎప్పుడు అమ్మ ని వదిలి లేదు.

        *************************************
  
......ఆడవాళ్ళ కష్టాన్ని గుర్తిద్ధం, వాళ్ళకి పనుల్లో సాయం చేద్దాం. ప్రేమ గా, ఆప్యాయంగా చూసుకుందాం. వాళ్ళ ఆరోగ్యం మన బాధ్యత. వాళ్ళు బలంగా వుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ లోక్డౌన్ సమయం లో మా అమ్మ పడే కష్టం చూసి, తన లా ప్రతి ఇంట్లో ఒక అమ్మ వుంది. పనిలో సాయం చేసే ఇంకో చెయ్యి తోడు ఐతే తనకి అన్నిట్లో మగాడు అండగా వున్నాడు అని చెప్పే నా ప్రయత్నమే ఈ కథ.......


                                      - కిషోర్ శమళ్ల
           

          


         


Rate this content
Log in

Similar telugu story from Tragedy