వర్షం తో హర్షం
వర్షం తో హర్షం


స్కూల్ లాంగ్ బెల్ మ్రోగింది. బైట వాతావరణం వర్షం వచ్చేటట్లు గా ఉంది. ఐదవ తరగతి నుండి చింటూ, బాబు పరుగు పరుగున బైటికి వచ్చారు.
"చింటూ, వర్షం వచ్చేటట్లుంది. ఆగుదామా." అడిగాడు బాబు.
"పదరా, చక్కగా వర్షంలో తడుస్తూ వెళ్తే ఎంత బాగుంటుందో." అన్నాడు చింటూ ఉత్సాహంగా
"అమ్మ తిడుతుందేమో రా." బాబు గొంతులో బెరుకు ధ్వనించింది.
"అబ్బా, అమ్మ రాలేదు కదరా. ముందు పద."
అంటూ బాబు చేయందుకుని వర్షం లోకి ఒక్క పరుగు తీసాడు చింటూ.
ఇద్దరూ వర్షం లో తడుస్తూ ఇంటి వైపు పరుగు తీస్తున్నారు. వర్షం ఇంకా పెరగడం తో మూసి ఉన్న దుకాణం దగ్గర ఆగారు. ఆ దుకాణానికి పైన రేకులతోవాస దించడంతో అక్కడ నిలబడేందుకు వీలుగా ఉంది. ఇద్దరూ అక్కడ నిల్చుని పారే నీరుని చూస్తున్నారు. ఇంతలో బాబు కి ఏదో ఐడియా వచ్చింది. వెంటనే తన బేగ్ లో నుండి నోట్ బుక్ బైటికి తీసి కాగితాలు చింపి పడవలుగా
చేసి పారుతున్న నీటిలో వదలడం మొదలు పెట్టాడు.
"రేయ్, అమ్మ చూస్తే..." చింటూ, బాబు చేసిన పని చూసి అరిచాడు.
"ఇక్కడ అమ్మ లేదుగా. ఇంటి దగ్గర అమ్మ, స్కూల్ లో టీచర్ లు తిడతారు. కానీ ఇక్కడ మనమేగా
ఉంది." అన్నాడు బాబు నిర్లక్ష్యంగా.
"అయినా బుక్స్ చించ కూడదు కదరా. అమ్మకి తెలిస్తే తిడుతుంది గా." అన్నాడు చింటూ.
"మరి వర్షంలో తడిసి నందుకు తిట్టదా! వర్షంలో పరుగెత్తించి తీసుకొచ్చావు. అప్పుడు లేదా." బాబు
కోపంగా అడిగాడు.
"ఒరేయ్ బాబూ అయిపోయాం రా." చింటూ సడెన్ గా రోడ్డు కవతలి పక్క చూస్తూ అనేసరికి బాబు కూడా తల తిప్పి చూసాడు.
అంతే. ఇద్దరికీ నోట మాట రాలేదు. అప్పటికే వాళ్ళ అమ్మ సుజాత దగ్గరకు వచ్చేసింది.
"ఏమర్రా, ఏమిటా ఆటలు? వర్షం పడేలాగా ఉంటే
నేను వచ్చే వరకు ఉండండి. వర్షంలో తడిసి రాకండి, అని చెప్పానా! మీరేం చేశారు? నేను వచ్చే వరకు ఆగలేరా. వచ్చేయాలి. వర్షంలో తడవాలి. వద్దంటే వింటారా. పదండి." అంటూ
కసిరి వారిద్దరినీ గొడుగు క్రిందకి లాగి ఇంటి వైపు కి వడివడిగా అడుగులు వేసింది. చింటూ, బాబు మారు మాట్లాడకుండా తల్లి వెంట నడిచారు.
ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ బట్టలు మారుస్తూ "ఎన్ని సార్లు చెప్పినా వినరు కదా ఇలా తడిస్తే రేపు జలుబులు, జ్వరాలు వస్తే బాధ పడేదెవరు? ఆ వంకతో స్కూల్ కి డుమ్మా, ఒకరు వెళ్ళక పోతే మరొకరు వెళ్ళకపోవడం. ఆ( , ఏంటి, ఇవన్నీ అవసరమా..." " ఇంకా ఏదో అనబోయేంతలో
"అబ్బా, సుజీ, ఇంక ఆపుతావా. ఈ వర్షం మా
ప్రాణాలకి ఎందుకొచ్చింది రా బాబూ, అని వాళ్ళు
ఏడ్చేలాగున్నారు." అంటూ తడి తల రుమాలు తో తుడుచు కుంటూ గేట్ తీసుకుని లోపలికి వచ్చాడు మోహన్.
అతన్ని చూడగానే తల్లి చేతుల్లో నుండి విదిలించు కొని తండ్రి దగ్గరకు పరిగెత్తారు పిల్లలు "డాడీ" అంటూ
" మీరెలా వచ్చారు? తడిసి నట్లున్నారు. బస్ లో రాలేదా." ఆరాగా అడిగింది సుజాత.
" ఈ రోజు కాస్తత్వరగా బైల్దేరాను. మా ఫ్రెండ్ ఒకతను లిఫ్ట్ ఇస్తానంటే వెదర్ కూల్ గా బాగుందని ఓకే అన్నా. కానీ దారిలో వర్షం విజృంభించడంతో తడిసి పోయాను." అన్నాడు మోహన్.
"ఆహా, ఏం తెలివి తేటలు! వర్షం పడేలాగా ఉంటే ఎవరైనా బైక్ మీద లిఫ్ట్ తీసుకున
ి వస్తారా. తడిసి పోతారని తెలియదా. మీరలాగ. మీ పిల్లలిలాగ. వర్షం పడేలాగా ఉంటే రాకండి, నేను వచ్చే వరకు ఆగండి, అంటే వినకుండా బైలుదేరి మధ్యలో నీళ్ళలో ఆటలు. నిజంగా నన్ను టెన్షన్ పెట్టి చంపేస్తున్నారు." అంటూ మాట్లాడుతూనే
నలుగురికీ వేడిగా బూస్ట్ కలిపి తెచ్చింది.
తాగటం అవగానే పిల్లల్ని "వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. తర్వాత కాసేపు కార్టూన్ ఫిల్మ్ చూద్దురుగాని, సరేనా." అంది సుజాత.
"అలాగే మమ్మీ," అంటూ వాళ్ళు లోపలికి వెళ్ళి పోయారు.
సుజాత వెళ్ళి మోహన్ ప్రక్కన సోఫా లో కూర్చుంది.
"ఏమిటి సుజీ, ఎందుకంత టెన్షన్ నీకు? వర్షంలో
తడిస్తే మహా అయితే జలుబు చేస్తుంది, లేదా ఒకరోజు జ్వరం వస్తుంది. వర్షంలో తడిసీ తడవక
ముందే ఇంతగా గొడవ చేస్తావ్. నీకు వర్షం అంటే
ఇష్టం లేదా?" అడిగాడు మోహన్, భార్య భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకుంటూ.
"కాదండీ. నాకు వర్షం అంటే ప్రాణం. వర్షాన్ని ఎట్టి
పరిస్థితుల్లో కూడా ఏమనుకో కూడదనే ఇంత జాగ్రత్త పడతాను." అంది సుజాత.
"అదేంటి, వర్షాన్ని అనడమేంటి." ఆశ్చర్యంగా అడిగాడు మోహన్.
"అదేనండీ, వర్షంలో తడిసి జలుబు చేసింది, జ్వరం వచ్చింది అని నింద వేయడం ఇష్టం లేదు.
దాని వల్ల ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ముందే
జాగ్రత్త పడతాను, కానీ వర్షాన్ని అంటే తట్టుకో లేను. నేను కూడా ఏమీ అనుకోడానికి ఇష్టపడను."
అంది సుజాత.
ఆశ్చర్యంగా చూస్తూ "ఇదేం లాజిక్." అన్నాడు మోహన్.
"ఈ వర్షం నా ప్రాణం. మనిద్దరినీ కలిపింది ఈ వర్షం. ఆరోజు వర్షం లో బస్టాప్ లో ఉన్న నన్ను
కుర్రాళ్ళు అల్లరి చేస్తుంటే వర్షం వలన ఆగిన మీరు
వారితో గొడవ పడి, వారిని బెదిరించి నన్ను కాపాడారు. ఆ తర్వాత నాన్న వచ్చి మీరు తన కొలీగ్ కొడుకని గుర్తించడం, ఇరు కుటుంబాలు
అన్ని విధాలుగా నచ్చుకొని మన వివాహం జరిపించడం. మన వివాహం రోజున వర్షం, ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయిన రోజున వర్షం, పిల్లలు పుట్టిన రోజున వర్షం. ఈ విధంగా వర్షం నా జీవితంలో అన్ని ముఖ్యమైన సంఘటనల్లో భాగమైపోయింది. ముఖ్యంగా మన మొదటి కలయిక వర్షం కారణంగా కావడం తో నాకు వర్షం అంటే ప్రాణం గా అన్పిస్తుంది. అందుకే దాని వలన ఇన్ని లాభాలు పొందిన నేను ఏ విధంగానూ నష్ట పోకుండా జాగ్రత్త పడతాను." అంటూ ముగించింది సుజాత.
"నీలో వర్షం పట్ల ఇన్ని భావాలున్నాయా. సరే, నీ భావాలను గౌరవించడం భర్తగా నా విధి కాబట్టి
నేను కూడా నీలాగే ఇంక నుండి జాగ్రత్త పడతాను,
సరేనా." అంటూ భార్య నుదుటిపై చుంబించాడు
మోహన్.
"మేం కూడా మమ్మీ." అని విన్పించి అటు వైపు
చూసేసరికి పిల్లలు కూడా దగ్గరకు వచ్చారు
నవ్వుతూ.
"మేం కూడా విన్నాం మమ్మీ, ఇంక నుండి మాకు కూడా వర్షం అంటే ప్రాణమే." అన్నారు ఇద్దరూ ఏక కంఠంతో.
వాళ్ళనలాగే దగ్గరకు తీసుకుని ముద్దులతో ముంచెత్తింది సుజాత. మోహన్ కూడా వారిని
ప్రేమ గా హత్తుకున్నాడు.
🌲🌼🌲🌼🌲