వలస కూలీ
వలస కూలీ


ఏం పేరు?
వీర్ సింగ్.
ఏ ఊరు వెళుతున్నారు?
బీహార్.
ఎక్కడి నుంచి?
తమిళనాడు నుంచి.
మొబైల్ నెంబర్?
.......................
ఓ మధ్య వయసు వ్యక్తి పోలీసు అధికారి ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నాడు.
ఏదో నాకొచ్చిన కాసింత హిందీ వారి మాటలు అర్థం చేసుకునేలా చేసింది.
అతని తరువాత ఇంకో అతను వచ్చి పోలీసు అధికారి ఎదుట నిలుచున్నాడు.
మళ్లీ మొదలైంది ప్రశ్నలు జవాబుల ప్రక్రియ.
నేను నా వివరాలు ఇచ్చి ఆఫీసు వాళ్ళు ఇచ్చిన లెటర్ చూపించి వచ్చి కార్లో కూర్చున్నాను.
అలా చాలా మంది చెప్పిన జవాబులు వ్రాసుకున్నారు పోలీసులు.COVID-19 లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థలో అందరినీ స్ట్రిక్ట్ గా చెక్ చేసి గానీ అనుమతించట్లేదు.
తరువాత దూరంగా చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులకి సిగ్నల్ ఇచ్చారు.
చెక్ పోస్ట్ ఓపెన్ చేశారు.ఒక దాని తరువాత ఒకటి లెక్క పెట్టలేనన్ని సైకిళ్ళలో వాళ్ళంతా వెళుతున్నారు.
రోహిణీ కార్తె ఎండలు రోడ్ల మీద భగ్గుమంటున్నాయి. ఏసీ కొద్దిగా పెంచమని డ్రైవర్ తో చెప్పి చల్లటి నీళ్ళు తాగాను.
ఎవరూ వీళ్ళంతా అని మా డ్రైవర్ ని అడిగాను.
వలస కూలీలు సార్.లాక్ డౌన్ లో సైకిళ్ళ మీద ఇంటికి వెళుతున్నట్టు ఉన్నారు సార్ అని బదులిచ్చాడు అతను.
ఇంత ఎండలో నీళ్ళు కూడా లేకుండా సైకిల్ మీద ఇంటికి వెళుతున్నారా? నా ప్రశ్నలో ఆశ్చర్యం.
తప్పదు కదా సార్.ఇక్కడ పనుల్లేవు.అక్కడ ఇల్లు చేరేంతవరకూ వాళ్ళకి కష్టమే సార్ మధ్యలో అక్కడక్కడా ఆగి ప్రభుత్వం ఏదైనా భోజనం,నీరు అందిస్తే తీసుకుని మళ్లీ
బయలుదేరుతారు.అతని గొంతులో నిట్టూర్పు.
మా కారు కూడా ఆ సైకిళ్ళ వెనుక ముందుకు కదిలింది.
ఏసీ పెంచినా నాకు అంతా వేడిగా అనిపిస్తోంది.