S Datla

Comedy

3.2  

S Datla

Comedy

విశ్వాసం

విశ్వాసం

5 mins
312


విశ్వాసం


@@@@@@@@@

" ఉదయం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఏంటి రా ఆలోచిస్తున్నావ్ " అని అడిగాడు లంచ్ బ్రేక్ లో బాలు శేఖర్ ని .

" అవును మేము కూడా గమనించాం . రోజు లాగా లేడు ఏమైందిరా ... " అని అడిగారు గోపాల్ , రాజు .

" నాకు ఒకటి తినాలని అని ఉంది రా .... "

" దానికి ఎందుకు అంత దిగులు . ఏంటో చెప్తే ఆంటీ చేసి పెడతారు గా " అన్నాడు రాజు .

" అమ్మ చేయదు రా " అన్నాడు శేఖర్ దిగులుగా .

" ఏంటి ... నువ్వు అడిగితే నీకు ఆంటీ చేసి పెట్టక పోవడమా ... అది జరగని పని . ఆంటీ కి నువ్వంటే చాలా ఇష్టం కదా . నువ్వు అడగక పోయినా నీ కోసం చేసినవి మాకు కూడా తెచ్చి పెడతావు . అలాంటిది అడిగినా చేసి పెట్టక పోవడం ఏమిటి ఆశ్చర్యం గా ఉంది " అన్నాడు గోపాల్ .

" అవును కానీ నేను అడిగింది చేసి పెట్టక పోగా నాలుగు తగిలిస్తుంది " అన్నాడు శేఖర్ దిగులు గా .

" అంటే ఏమి తినాలని అనుకుంటున్నావు రా ... కొంపదీసి మనిషి బుర్ర కాదు కదా " అన్నాడు వెటకారంగా బాలు .

" మీరు నన్ను ఏదో ఒకటి అనకుండా ఉండరుగా ..అందుకే నేను చెప్పలేదు ఇన్ని రోజులు కానీ , ఈ రోజు ఎందుకో బాగా తినాలని ఉంది " అన్నాడు శేఖర్ .

" సారీ రా ... నిన్ను సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నాను . నీకు అంతలా తినాలని ఉంటే అది ఏంటో చెప్పరా ఆంటీ కాక పోతే మా అమ్మ వాళ్ళకు చెప్పి చేయిస్తాం " అన్నాడు బాలు .

" కుదరదు రా మన అమ్మలు అందరూ ఫ్రెండ్స్ . ఆ విషయం మరిచిపోతున్నారు మీరు " అన్నాడు శేఖర్ దిగులుగా .

" ఏంటి రా నువ్వు తినాలి అనుకుని ఆ వంటకం మాకు చెప్పకుండా చంపుతున్నావ్ ... ఆంటీ తో చేయించుకో అంటే కాదు అంటావ్ , మా అమ్మలు చేస్తారు రా అంటే వద్దు అంటావు . నువ్వు పెట్టే టెన్షన్ కి లంచ్ బాక్స్ ఖాళీ చేసినా కూడా నాకు ఆకలి తీర లేదు " అన్నాడు బాలు .

" కావాలంటే నా బాక్స్ కూడా తిను అంతే కానీ అలా మాట్లాడకు " అన్నాడు శేఖర్ కోపం గా .

" బాలు మాటలకు ఏమి కానీ .. అసలు నువ్వు తినాలి అనుకున్నది ఏమిటో చెప్పరా ముందు .... అది నీ చేత ఎలా తినిపించాలో మేము చూస్తాం " అన్నాడు రాజు .

" చికెన్ .... "

" ఏంటి ... మళ్లీ చెప్పు " అన్నాడు గోపాల్ ఆశ్చర్యపోతూ .

" చికెన్ ..." .అని " మళ్ళీ చెప్పు " అని అనబోతున్న గోపాల్ నోరు మూసి " నువ్వు మళ్ళీ అడగకు .... నువ్వు విన్నది నిజమే నాకు చికెన్ తినాలని ఉంది " అన్నాడు శేఖర్ .

" ఇదేం కోరిక రా బాబు ... ఆంటీ కి తెలిస్తే నిజంగా నే నీ తోలు తీస్తారు గా " అన్నాడు రాజు .

" అందుకే కదా ఇలా ఉన్నాను " అన్నాడు శేఖర్ దిగులు గా .

" దానికి ఎందుకురా బాధ ... మేము తెచ్చినప్పుడు తిను .. అప్పుడు ఎవరికీ తెలియదు గా " అన్నాడు బాలు .

" అంటే మీరు ఆదివారం కదా చేసుకుంటారు . ఆదివారం మనకు సెలవు కదా ఎలా తెస్తారు నా కోసం . అయినా ఈరోజు మండే కదా సండే వరకు నేను ఆగలేను బాగా తినాలి అని అనిపిస్తుంది " అన్నాడు శేఖర్ .

" అయితే ఏం చేద్దాం రా ... నీ కోసం వారం మధ్యలో చికెన్ అంటే మా తోలు ఊడుతుంది " అన్నాడు బాలు .

" ఈవినింగ్ హోటల్ కి వెళ్ళదాం " అన్నాడు గోపాల్ హుషారుగా .

" వద్దు రా బాబు ... మా నాన్నకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ ఊరి లో . ఎవరైనా మా నాన్నకు చెప్తే నా పని అంతే " అన్నాడు శేఖర్ .

ఇంతలో లంచ్ బ్రేక్ టైం అయిపోవడం తో అందరూ క్లాస్ కి వెళ్ళిపోయారు . క్లాసులో కూడా శేఖర్ దిగులుగానే ఉన్నాడు .

ఏం చేసి శేఖర్ చికెన్ తినే లాగ చేయగలం అని మిగిలిన ముగ్గురు క్లాస్ వినకుండా మరీ ఆలోచించినా ఉపాయం మాత్రం తట్టలేదు .

ఈవినింగ్ క్లాస్ అయ్యాక అందరూ బయటకు వచ్చారు . " శేఖర్ ... దిగులు పడకురా ఏదో ఒకటి చేద్దాం " అన్నారు ముగ్గురూ .

" నాకు ఒక ఐడియా వచ్చింది రా " అన్నాడు శేఖర్ .

" ఏమిటో చెప్పు .... "

" రేపు మీ ముగ్గురు మా ఇంటికి రండి మా ఇంట్లోనే చేసుకుందాం " అన్నాడు శేఖర్ .

" నీకు ఏమైనా మతి గాని పోయిందా ... చికెన్ తినాలనే పిచ్చి పట్టి " అన్నాడు రాజు .

" ముందు నేను చెప్పేది వినండి రా మా ఇల్లు మన కాలనీలో కొంచెం వేరుగా , దూరంగా ఉంటుంది కదా . చుట్టుపక్కల ఇల్లు కూడా లేవు .... "

" అయితే ... "

" చెప్పేది పూర్తిగా వినండి ... "

" అయితే చెప్పు ... "

" రేపు లంచ్ బ్రేక్ కి ముందు మనకు ఉన్న సబ్జెక్ట్ సార్ సెలవు రాను అని ఈరోజు చెప్పారుగా . అప్పుడు మనం మా ఇంటికి వెళ్ళి చికెన్ వండుకుని తినదాం . మీలో ఎవరికైనా వండడం వచ్చా " అన్నాడు శేఖర్ .

" నాకు వచ్చు కానీ ఆంటీ కీ తెలిసిపోతుంది కదా " అన్నాడు గోపాల్ .

" లేదురా ... అమ్మ , నాన్న రేపు ఉదయం ఊరు వెళ్తున్నారు . సాయంత్రం వరకు రారు ... "

" నువ్వు ఒకటి మరచి పోతున్నావ్ . పాత్రలు మనం శుభ్రం చేస్తాం ...కానీ చికెన్ స్మెల్ వలన ఆంటీ గుర్తు పడితే ... " అన్నాడు రాజు .

" నా దగ్గర ఒక స్ప్రే ఉంది .. అది కొడితే ఇక ఏం వాసనా రాదు " అన్నాడు శేఖర్ .

" అలాగే నువ్వు చెప్పినట్లే చేద్దాం " అని అనుకొని ఇంటికి వెళ్ళి పోయారు అందరూ .

నెక్స్ట్ డే అనుకున్నట్టుగానే లంచ్ బ్రేక్ కు ముందే శేఖర్ ఇంటికి వెళ్ళారు దారి లో చికెన్ కొనుక్కుని .

చెప్పినట్టుగానే గోపాల్ చికెన్ కర్రీ చేశాడు .

అందులోకి ప్రపంచ పటంలో ఉండే దేశాల నమూనాలను తయారు చేసుకుని చికెన్ కర్రీ తో తిన్నారు .( ఏంటో అనుకొనేరు ... చపాతి ఆకారాలు అలా వచ్చాయన్నమాట 😀).

అనుకున్నట్లు గానే మొత్తం తిని గిన్నెలు కూడా శుభ్రం చేసారు .

వంట కొత్త వలన , ఇంకా మాట్లాడుకుంటూ తినడం వలన క్లాస్ స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది .

మిగిలిన ముగ్గురు కంగారు పెట్టడంతో " మీరు వెళ్ళండి రా ... నేను ఇంకా శుభ్రం చేసి వాసన రాకుండా స్ప్రే చేసి క్లాసు కి వస్తాను . నలుగురం లేక పోతే ఇంటిలో తెలిసిపోతుంది " అన్నాడు శేఖర్ .

అలాగే అని ముగ్గురు స్కూల్ కి వెళ్ళిపోయారు . శేఖర్ అంతా శుభ్రం చేసుకుని నెక్స్ట్ పీరియడ్ లో వాళ్ళతో జాయిన్ అయ్యాడు .

సాయంత్రం అందరూ తాము చేసిన పనిని తలచుకుని తెగ సంతోష పడిపోయి కొంతసేపు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయారు .

నెక్స్ట్ డే శేఖర్ దెబ్బల తో స్కూల్ కి వచ్చాడు .

" ఏమైందిరా ... ఎవరు కొట్టారు నిన్ను . చెప్పు వాళ్ళ దగ్గర కు వెళ్ళి మరీ తాట తీస్తాం " అన్నారు ముగ్గురు కోపంగా .

" మీరు వెళ్ళితే మీకు కూడా ఇలాగే తగులుతాయి దెబ్బలు " అన్నాడు శేఖర్ ఏడుస్తూ .

" ఎవరో చెప్పమంటే మాకు కూడా తగులుతాయి అంటావ్ ఏంట్రా " అన్నాడు బాలు .

" కొట్టింది ఎవరో చెప్పు ముందు " అన్నాడు గోపాల్ .

" మా అమ్మ .. "

" ఆంటీ నా .... ఎందుకు కొట్టారు నిన్ను " అని అడిగాడు రాజు . ఎందుకు అన్నట్టు చూసారు మిగిలిన ఇద్దరు కూడా .

" నిన్న మనం చేసింది తెలిసిపోయింది " అన్నాడు శేఖర్ ఏడుస్తూ .

" అంటే నువ్వు ఏ పనైనా సగం సగం చేస్తావు గా ... నిన్న స్ప్రే కొట్టడం మర్చిపోయావా ... " అన్నాడు బాలు .

" లేదురా కొట్టాను .... "

" మరి ఆంటీ కి ఎలా తెలిసింది ... "

" విశ్వాసం వలన ... "

" విశ్వాసం వలనా ... అర్థం కాలేదు " అన్నారు ముగ్గురు .

" ఎందుకు అర్థం అవుతుంది . వద్దు ..వద్దు .. అంటుంటే మీ ఇంటిలో పెట్టినట్టే మా ఇంటిలో మేము పెంచుకుంటున్న కుక్కకి చికెన్ బోన్స్ పెట్టారు మీరు ... "

"అయితే ... "

" అది మా ఇంటి లో పెరిగిన కుక్క రా ... అది మేము తినే పప్పు, , కూరలే అది కూడా తింటుంది . అది అరగక వాంతులు చేసుకుంది . ఆ బోన్స్ చూసి అమ్మ నాలుగు తగిలిస్తే నిజం చెప్పాను . ...

ఆ పేరు కూడా వినపడ కూడని మన ఇంటిలో ఏకంగా వండి తింటారా " అని ఎప్పుడూ కొట్టని మా అమ్మ తన ప్రతాపం మొత్తం చూపించింది అన్నాడు శేఖర్ ఏడుస్తూ .

" అంటే మేము పెట్టినప్పుడు శుభ్రం గా లొట్టలు వేసుకుంటూ తిని తరువాత నీ పరిస్థితి ఇలా అవడానికి మీ కుక్క విశ్వాసం కారణం అన్నమాట " అని నవ్వారు ముగ్గురూ .

" మా విశ్వాసం కాదురా .. దాని తప్పు ఏమీ లేదు . వద్దు వద్దు అంటుంటే వినకుందా దానికి పెట్ఝడమే కాకుండా మళ్ళీ నన్ను సగం సగం పనులు చేస్తాను అని అంటారా .. నాకు తగిలిన దెబ్బలు మీకు కూడా తగలాలిగా " అని వెంట తెచ్చుకున్న కర్ర తో ముగ్గురికి వెంట పడి మరీ తోలు తీసాడు శేఖర్ .

@@@@@@@@@

శుభం .



Rate this content
Log in

More telugu story from S Datla

Similar telugu story from Comedy