శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

విన్నపం

విన్నపం

3 mins
336           ‎

     ప్రియమైన మీకు,

     ‎ఇలా మిమ్మల్ని సంభోదిస్తూ మీకు ఉత్తరం రాసి చాలా రోజులైపోయింది కదూ...! అవును మరి అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్లు వచ్చేసాయి కదా. ఏ విషయం మాట్లాడుకోవాలనుకున్నా... నిమిషాల్లో మాట్లాడేసుకుని నిర్ణయాలు తీసేసుకుంటున్నాం. ఆలోచిస్తే అది తొందరపాటే. కొన్ని కొన్ని విషయాలు రాతలతో వివరించిన లేఖలను కళ్ళతో చదివాక బాగా అర్థం చేసుకుని... సమయం తీసుకుని చెప్పే సమాధానాలే సరైనవని నా అభిప్రాయం. అందుకే ఇది ఫోన్లో అడిగే విషయం కాదనిపించింది.ఫోన్ చేసి అడిగినా నామాట పూర్తి కాకముందే ..మీరు తిరస్కరిస్తే నేను చెప్పాలనుకున్న విషయం చెప్పలేక పోవచ్చు.అందుకే... మీ ఎదురుగా అడగలేక ఈలేఖ ద్వారా నావేదనని అక్షరాల్లో నింపుకుని మీముందుంచాలనే నాప్రయత్నం.దయచేసి అర్థం చేసుకుంటారు కదూ...!


     ‎ మా అమ్మకు ఒంట్లో బాగోలేదని చూడ్డానికి మా పుట్టింటికి వచ్చినప్పటినుంచీ ...నాలో ఏవేవో ఆలోచనలు.నా మనసంతా ఎంతో గుబులు గా ఉంది. ఎవరితోనూ చెప్పుకోలేని నిస్సహాయత. మీతో చెప్పినా అర్థం చేసుకుంటారా అనే సందిగ్థత.


    ‎ మన కుటుంబంలో మీరు,నేను,మీ అమ్మగారు, మనిద్దరి పిల్లలు. ఈ ముప్పై సంవత్సారాలు ఎంతో హాయిగా గడిపేసాము. పిల్లలకు కూడా పెళ్లిళ్లు అయి ఉద్యోగరీత్యా దూరంగా వెళ్లిపోయారు.ఈమధ్య మీ అమ్మగారు కాలం చేసినప్పటినుంచీ మనిల్లెంత బోసిపోయిందో కదా...!      నాకొస్తున్న ఫీలింగ్ తో మీరు కూడా తరచూ అంటూనే వుంటున్నారు.ఇంట్లో పెద్దవాళ్లంటూ కనుమరుగైతే ఆఇల్లు ఇల్లే కాదని. నిజమే.. ఆవిడున్నంత కాలం చూడటానికి వచ్చే బంధుమిత్రులతో ఇల్లెంతో కళకళ లాడుతూ ఉండేది. పెద్దవాళ్ళు ఇంట్లోఉన్నంత వరకే ఇప్పుడు మనింట్లో ఏ సందడీ లేకేమో నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి...!


    ‎ మీ అమ్మ గారు ఈ మూడేళ్లు మంచంపట్టి ఎంత బాధపడ్డారో మీకూ నాకూ మాత్రమే బాగా తెలుసు. ఆవిడకి ఎలాంటి ఇబ్బందీ రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటూనే వచ్చాం.ఎంతైనా ఆరోగ్యం చెడితే మన చేతుల్లో ఏం లేదు. ఎవరి బాధా మనం తీసుకునేది కాదుగా. వారి బాధ వారు అనుభవిస్తూ పోవాల్సిందే.మనకు తోచిన ఆసరా వారికిస్తూ ప్రేమగా మాట్లాడుతూ సమయానికి మందులు, ఆహారం ఇవ్వడమే ఎవరికైనా మనం చేయగల సేవ. ఇలాంటి సేవ చేసే అదృష్టం నాకు రాసున్నందుకేనేమో...ఏ ఉద్యోగం చేయకుండా హౌస్ వైఫ్ గా వున్నాను కాబట్టే ... ఇంటి బాధ్యతలు సంతోషంగా చేపట్టి... మీ అమ్మగారి చివరిచూపు వరకూ ఆవిడకు తోడుగా వుండే భాగ్యం నాకే దక్కింది. అప్పట్లో అప్పుడప్పుడు కొంచెం విసుగనిపించినా... ఇప్పుడు ఆలోచిస్తే ...ఆ కొంచెం మాత్రం ఎందుకు విసుకున్నానా అని నామీద నాకే చిరాకేస్తుంది. మనిషి వున్నప్పుడు కంటే... మనిషిపోయాకా ఆవిడ విలువ ఎక్కువైంది. నిజం చెప్పాలంటే మాఅమ్మ దగ్గర పెరిగిన రోజుల కంటే...పెళ్లై వచ్చాకా మీ అమ్మ గారి దగ్గరే ఎక్కువ రోజులు గడిపాను. అందుకేనేమో మీ అమ్మగార్ని అసలు మరచిలేకపోతున్నాను. 

    ‎

   ఇప్పుడు నాకు మా అమ్మ గురించి కూడా ఆలోచనలు మనసుని ముసిరేస్తున్నాయి .దాదాపు మా అమ్మకి కూడా మీ అమ్మ గారి వయసే. అమ్మ ఒంట్లో కూడా ఏపనీ చేసుకోలేని నిస్సత్తువ వచ్చేసింది. అన్నయ్య, వదిన ఇద్దరూ ఉద్యోగాలకు పోయేవాళ్ళు. ఉదయం పోయి రాత్రయ్యేవరకు రారు. ఉన్న ఇద్దరి పిల్లల్ని హాస్టల్ లో వేసి చదివిస్తున్న సంగతి మీకూ తెలుసు.మాఅమ్మని ఇంటిపట్టున ఉండి కనిపెట్టుకునే మనుష్యులు ఎవరూ లేక... ఒకవేళ జీతానికి ఎవరినైనా పెట్టుకోవాలనే ఆలోచన వున్నా ...ఎవరో తెలియని వ్యక్తులకి ఇల్లు అప్పగించే ధైర్యం లేక ఎటూ తేల్చుకోలేని సమస్యతో చేసేదిలేక మా అమ్మను హోల్డ్ ఏజ్ హోంలో జాయిన్ చేయాలనుకుంటున్నారట.

    

    ‎అన్నయ్య పరిస్థితులను బట్టి వారు హోమ్ లో జాయిన్ చేస్తే ... బంధువులంతా తప్పుగా భావించి తల్లిని పట్టించుకోకుండా హోమ్ లో పడేశారంటూ చెవులు కోరుకుంటారే గానీ ... పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోరు.అమ్మ కూడా ఒకవిధంగా బాధ పడుతుంది.


    ‎అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను.ఇంట్లో నేనిప్పుడు ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి.. నన్ను కన్న అమ్మకు నేనే అమ్మనై స్వయంగా నాచేతులతో ఈ చివరిరోజుల్లో అయినా సేవ చేసుకోవాలనిపిస్తుంది. తల్లి కొడుకు దగ్గరే ఉండాలని అనాదిగా ఆచరిస్తూ వస్తున్నాం.తల్లి పిల్లలెవరికైనా అమ్మే...!ఇలాంటి పరిస్థితి వస్తే ఆతల్లి కన్న పిల్లలెవరైనా సరే ఆమె బాధ్యత తీసుకోవడంలో తప్పులేదుగా.కొడుగ్గా అన్నయ్య అమ్మని ఈ వయసులో చూసుకోవాల్సిన విధంగా చూసుకోలేక పోతున్నాడు గనుక కూతురుగా నేనే అమ్మను చూసుకోవాలనుకుంటున్నాను. నన్ను కనకపోయినా మీ అమ్మగార్ని కూతురుగానే చూసుకున్నాను. అలాంటప్పుడు నన్ను కని పెంచిన అమ్మని నేను చూసుకోలేకపోతే నా ఈ జన్మకు అర్థం లేదనిపిస్తుంది.


   పెళ్లయ్యాక అత్తింటికి వచ్చేసాక ..మా పుట్టింట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనసులోనే పెట్టుకున్నాను గానీ ... వాటికి పరిష్కారం చూడండని నేను మిమ్మల్ని ఏనాడూ కోరకపోవడానికి కారణం అత్తింట్లో నేను,మావాళ్ళు చులకనవ్వకూడదనే. వయసైపోతున్న మా అమ్మకు ఇప్పుడైనా నాకేదో చేయాలని మనసు కొట్టుకుంటుంది. మా అమ్మను మనింటికి తీసుకొస్తే...ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారన్న తృప్తి మనకీ వస్తుంది. 

    

    ‎ కొడుకుని వదిలి కూతురు ఇంటికి రావడం అమ్మకి మొహమాటం గా ఉండొచ్చు. వాళ్ళు బాగా చూసుకోడం లేదనే నేను ఈనిర్ణయం తీసుకున్నానని అన్నయ్య కూడా నన్ను అపార్థం చేసుకోవచ్చు. ఇలా ఆలోచిస్తూ పోతే ... మధ్యలో అవస్థ పడేది అమ్మే కదా.


    ‎మీ అమ్మగారి స్థానంలో మాఅమ్మనుకుని తీసుకెళ్తున్నా అని మీరే వారికి నచ్చచెప్పాలి.ఇంతకీ మా అమ్మని తీసుకురావడం మీకు ఇష్టమో కాదో... మిమ్మల్ని అడగకుండానే నేనీ నిర్ణయం తీసుకున్నాను.అందుకే మీ ఎదురుగా అడగలేక...ఎంతో కూడబలుక్కుని నాకోరికను ఈఅక్షరాల్లో అల్లుతున్నాను. కాదనరు కదూ...!


    ‎మన కొడుకులు,కోడళ్లు కూడా ఉద్యోగస్థులే. రేపన్న నాడు మనకీ ఈపరిస్థితే వస్తే... ఏమీ చేయలేక మనల్ని కూడా మన పిల్లలు హోమ్ లో వేCCసే ఆలోచనతోనే వుంటారన్నది నిజం. వారికి మనపై ప్రేమ లేక కాదు.పరిస్థితులు అలా చేయించ వచ్చేమో...?మన జనరేషన్ కి ఉన్న కొంచెం పాటి ఓపిక,సహనం ,ఆలోచనా కూడా మనపిల్లలకు ఉండదు. మన అవయవాలన్నీ మన స్వాధీనంలో వుండగానే..మనతో పాటూ మనతోటివారికి కూడా మార్గదర్శకం అయ్యేలా అన్ని సౌకర్యాలూ వుండే హోల్డ్ ఏజ్ హోంలో జాయిన్ అయిపోవాలనే మైండ్ సెట్ మనకి మనమే ఇప్పటినుంచీ అలవాటు చేసుకుంటే... ముందు ముందు మనకీ ఎలాంటి మానసిక బాధా ఉండదేమో...? తోటి ముసలివారితో మంచి కాలక్షేపం కూడా. మనసుపెట్టి మీరు ఒకసారి ఆలోచించండి. దీనివల్ల ఎవరికీ ఏ విధమైన ఇబ్బందీ వుండదనిపిస్తుంది.మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ...! 


    ‎ప్రస్తుతం అమ్మ విషయం ఆలోచించండి. మన పెద్దవాళ్లకు సేవ చేసే భాగ్యం మనకు దొరికినప్పుడు మనం వినియోగించుకోవాలి. మన గురించి మనం ఆలోచించడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి మంచి నిర్ణయానికి వద్దాం. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఉత్తరం రాసాను కదూ....!

                        మీ

    ‎                    నేను.


           ‎


     ‎


Rate this content
Log in

Similar telugu story from Drama