gopal krishna

Tragedy Action Others

4  

gopal krishna

Tragedy Action Others

తోడూ - నీడా

తోడూ - నీడా

3 mins
397


   "ఇదిగో నీళ్లు, తాగు మావాఁ" ... అంటూ చేతికి అందించింది మంగమ్మ. కాళ్ళీడ్చుకొచ్చిన సోమయ్య నీరసంగా అరుగుమీద కూలబడి భార్య అందించిన చల్లని నీళ్ళ చెంబు అందుకొని పక్కన పెట్టేసి, భుజమ్మీ ది తుండుగుడ్డతో మొహం తుడుచు కున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు. చెంబులోని నీళ్ళు కొన్ని మొహంమీద పోసుకొని, మిగిలినవి గటగటా తాగేశాడు.

"పోనీలే మావాఁ..బాధపడమాక, మన లాంటోళ్ళకి దేవుడే దిక్కు. ఇంతకీ మాట్లాడావా? ఎల్లినపని ఏటైనాది" అంది. "ఏవీ..కాలేదే మంగమ్మా.అయ్యగోరు ఒప్పుకోలేదు. నీకిప్పటికే శానా టయమిచ్చినానురా, సోమయ్యా అన్నారు" నీరసంగా అన్నాడు. "నిజవేఁ... మామా అట్టని మనఁవేవీ అయ్య గోర్ని మోసం సెయ్య నేదు కదా. పోనీలే మన బతుకులు తెల్లారడానికి ఇంకెంత కాలమనీ. ఒక పది, పదేనేళ్ళు. ఉన్న ఎకరా మడిని అయ్యగోరికి ధారాదత్తం సేసేద్దాంలే. ఎవసాయాన్ని నమ్ముకున్న మన నోట్లో దేవుడు మట్టి కొడతా ఉంటే ఏం సేత్తాం. ఎవురితో సెప్పుకుంటాం, రా మావాఁ ఎండన బడి వచ్చావు. గంజి తాగుదువు" అంది మంగమ్మ.

ఒక్కగానొక్క కూతురు సీతని పట్నంలో మునిపల్ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్న రంగాకి ఇచ్చి, రెండేళ్ల కిందట పెళ్ళి చేసారు సోమయ్య, మంగమ్మా దంపతులు. అల్లుడు చాల మంచోడని, నెమ్మదస్తుడని, ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవని తెలీడంతో ఇద్దరూ బాగా ఆలోచించి, ఉన్న ఒక్క ఎకరం మడిని ఊరిపెద్ద, సర్పంచ్ అయిన నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టి, రెండు లక్షలు అప్పుతెచ్చి పెళ్ళి చేసారు. తరువాత కూతురు పురిటి ఖర్చులకు ఇంకో పాతికవేలు పైబడి ఖర్చయి పోయింది. అసలు వడ్డీ కలిసి మూడు లక్షలు అయిపోడంతో నాయుడుగారు పిలిచి బాకీ గురించి చెప్పారు.  

     ఎప్పటికప్పుడు అప్పు తీరుద్దామంటే, పంటలు పండక, పండినవి వర్షాలవల్ల తుఫాన్ల వల్ల చేతికి అందక, అప్పు తీర్చలేక పోయారు సోమయ్య దంపతులు. "ఈ ఏడాది ఎలాగైనా అప్పు తీర్చాలి సోమయ్యా" అంటూ నాయుడుగారు మెడమీద కత్తి పెట్టాడు. సోమయ్య ఎకరా భూమి హైవే కి అనుకుని ఉండడంతో, దానికి అమాంతంగా ధర పెరిగిపోయి, లక్షల్లోంచి కోట్లవైపు పరుగులు పెడుతోంది. పోనీ భూమి అమ్ముదామా అంటే డబ్బిచ్చి కాగితాలు పట్టుకెళ్ళు అంటూ సోమయ్యకు షరతులు పెట్టాడు నాయుడుగారు. 

    సోమయ్య ఎంతబతిమాలినా నాయుడు గారి మనసు కరగలేదు. ఈ గొడవలన్నీ అల్లుడికి తెలిస్తే పరువుపోతుందని భయం. "ఒరేయ్, సోమయ్యా, రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటున్నా. నువ్వు డబ్బు తెచ్చి ఇచ్చినాసరే, రిజిస్ట్రేషన్ చేసినా సరే, కష్టాల్లో ఉన్నావు కాబట్టి ఇంకో ఏభైవేలు ఇస్తాను" చెప్పారు నాయుడు గారు.

"సిన్నప్పటినుండి ఆ పొలంలోనే బతికానే. మా అయ్య సదువుకోరా సోమయ్యా అని సెప్పినా ఇనలేదు. ఆ పొలం నమ్ముకొని నేనేం బాగుపడ్డాను. కూతురి పెళ్ళి సెయ్యడం తప్ప నాకేమీ ప్రయోజనం లేకపోయింది" కన్నీళ్లు పెట్టుకుంటున్న భర్తని ఓదార్చడం తప్ప మంగమ్మ మాత్రం ఏం చెయ్యగలదు? "ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబీకుల్లా నాలుగు గేదెల్ని మేపుకుంటూ, పొలంమీద వచ్చిన డబ్బుతో రోజులు వెళ్ళదీసేసారు. తల్లికి బాగోలేదని రెండు గేదెలు, కూతురు పెద్దమనిషి అయ్యిందని, ఊళ్ళో వాళ్ళకి ఘనంగా భోజనాలు పెట్టాలని రెండు గేదెలు అమ్మేసిన రోజు ఎవరో తన శరీరం నుండి గుండెను కోసి వేరు చేసినట్లు విలవిల్లాడి పోయాడు సోమయ్య.

బయటపడలేదు కానీ మంగమ్మా అంతకంటే నరకాన్నే అనుభ వించింది. అత్తగారు పోవడంతో ఇంట్లో పెద్ద దిక్కు లేని సంసార మైంది. అప్పుడే సమస్యలన్నీ ఒక్కొక్కటిగా చుట్టుముట్టాయి. వరసగా మూడేళ్లు కరువు. నాయకులు రావడం ఏదో నష్ట పరిహారం ఇస్తామని చెప్పడం. తీసుకున్న బ్యాంకు లోన్ కోసం మెడలో తాళిబొట్టు అమ్ముకోవడం ఇవన్నీ గుర్తొచ్చాయి మంగమ్మకి. కళ్ళు చెమర్చాయి ఆమెకు.

"ఇంక ఈ ఊళ్ళో బతకలేమే మంగా, ఇందాక నాయుడుగారి ఇంటికెళ్ళే దారిలో మా సిన్నాన్న కొడుకు సిట్టిబాబు కనపడ్డాడు. హైదరాబాద్ లో ఏదో అపార్ట్మెంట్ లో వాచ్మాన్ గా సేస్తున్నాడుట. ఆడి భార్య కూడా అక్కడే ఆ ఇళ్లల్లో పనిమనిషిగా పనిసేస్తోందని చెప్పాడు" సోమయ్య తలదించుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు. మంగమ్మని పెళ్ళాడాక ఆమెను ఎప్పుడూ ఇంట్లోంచి బయట పనుల్లోకి తీసుకెళ్ళింది లేదు.

ఏదో అపరాధభావం సోమయ్య కళ్ళల్లో నిండిపో యింది. భార్య కాయకష్టం చేసి తెచ్చిన డబ్బు తినే వాడిగా అసమర్ధుడిగా మిగిలిపోయానని బాధ పడ్డాడు. "పోనీలే మావాఁ... మనకి ఇలా రాసి ఉంది. ఇలాగే జరగనీ. ఆ సిట్టిబాబు ని అడిగి ఇవరం తెలుసుకో. ఇక్కడ పనుంటుంది అంటే ఎల్లిపోదాం" అంది మంగ   హైదరాబాద్ లో పనులిప్పించే కాంట్రాక్టర్ తో మాట్లాడి సోమయ్యకి ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ దగ్గర పని కుదిర్చాడు చిట్టిబాబు." నాయుడుగారు పొలం తనపేరున రిజిస్టరు సెయ్య మన్నారే మంగా" తనవంతుగా ఆఖరి ప్రయత్నం చేసేసి కన్నబిడ్డలా చూసు కున్న పొలం చేజారిపోతున్నందుకు చిన్నపిల్లాడిలా బావురుమన్నాడు సోమయ్య.

    భర్తని ఓదార్చడం మంగమ్మ తరం కాలేదు. పొలం తనపేరున మార్పించుకున్న నాయుడు గారు మాత్రం చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ తాను కట్టించ బోయే కొత్త అపార్ట్మెంట్ డిజైన్ల కోసం ఇంజనీర్లతో ప్లాన్లు వేయించసాగాడు.

   రిజిస్ట్రార్ ఆఫీస్ నుండి వచ్చిన సోమయ్య, నాయుడు గారు ఇచ్చిన ఏభై వేలను కూతురికి అందజేయాలని అనుకున్నాడు. "ఒలే మంగా, ఈ డబ్బు సీతకి అప్పచెప్పేసిరా, మనం ఎల్లుండి ఊరెల్లి పోదాం" అన్నాడు. "మనకి డబ్బు అవసరం పడితే ఎలా మావాఁ " అంటూ మంగమ్మ ఎంత చెప్పినా వినకుండా, అది పూర్వీకుల ఆ డబ్బు కూతురికి అప్పగించేయమన్నాడు సోమయ్య.

    "నేనెళ్ళి కూతురిని మనవణ్ణి సూసొత్తాను మావాఁ" అంటూ ఎర్రబస్సు ఎక్కింది మంగ. హైదరాబాద్ ప్రయాణానికి కావలసిన సామాన్లు మూటలు కట్టాడు. రాత్రి ఎప్పటికో గానీ నిద్రపట్టలేదు సోమయ్యకి. కళ్ళు మూసినా తెరిచినా తన ఎకరం భూమి కళ్ళముందు కదలాడుతోంది. నన్నేమ్మేసావా సోమయ్యా అంటూ భూమి తల్లి ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది కళ్ళముందు. కళ్ళల్లో నీళ్లు ఏరులైపారుతున్నాయి. గుండెల్లో సన్నగా నొప్పి మొదలైంది అతనికి.

    ఇంట్లో వెలుగుతున్న గుడ్డి దీపం చమురు అయిపోయిందన్న సూచనగా కొడిగట్టి పోయింది. సోమయ్య గుండె ఆగిపోయింది తన ఎకరం పొలం కోసం మూగగా రోదిస్తూ.

(ఒక నిజసంఘటన ఆధారంగా)

రచన :  గోపాలకృష్ణ

9491691157


Rate this content
Log in

Similar telugu story from Tragedy