gopal krishna

Children Stories Classics Fantasy

4  

gopal krishna

Children Stories Classics Fantasy

ఎవరు అర్హుడు?(బామ్మచెప్పిన కథ)

ఎవరు అర్హుడు?(బామ్మచెప్పిన కథ)

3 mins
259


    యమునా నది తీరాన బ్రహ్మ స్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యయన పండితుడు ఉండేవాడు. ఆయనకు మందార వల్లి అనే కుమార్తె ఉండేది. ఆమె రూపలావణ్యాలలో దేవతా స్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి. తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడినుండో ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరికి వారు తాము మందారవల్లిని చేసుకుంటామని పెళ్లి చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ప్రమాణం చేసి కూర్చున్నారు. 

    ముగ్గురు యువకులు అందచందాలలోనూ, చదువుసంధ్యలులోనూ సమానులై ఉండడంచేత అగ్నిస్వామి కి ఏం చేయాలో తోచలేదు. వారిలో ఎవరికి తన కుమార్తెను ఇచ్చినా మిగిలిన ఇద్దరూ తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పేద బ్రాహ్మణుడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు.

    ఇలా ఉండగా మందారవల్లి కి ఆకస్మికంగా ఏదో వింత వ్యాధి పట్టుకొని కొద్ది రోజుల్లోనే మరణించింది ముగ్గురు యువకులు ఆమె కోసం రోదించి ఆమె శవాన్ని స్మశానానికి తీసుకుపోయి యధావిధిగా దహన సంస్కారాలు జరిపారు. వారిలో ఒకడు స్మశానం నుంచి తిరిగి రానేలేదు. మందారవల్లి ని దహనం చేసిన చోట ఆమె చితాభస్మం లోనే నిద్రిస్తూ అక్కడే ఒక చిన్న పాక వేసుకుని తపస్సు చేస్తూ జీవించసాగాడు.

    రెండోవాడు మందారవల్లి అస్తికలను పోగు చేసుకుని వాటిని మూటకట్టి గంగలో కలపడానికి కాశీకి బయలుదేరాడు. మూడో వాడు గొప్ప విరాగి అయ్యి దేశాటన మొదలుపెట్టాడు. వాడు వక్రోలకము అని ఒక రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు. మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఆ ఇంట్లో ఉన్న చంటిపిల్లాడు పోరు పెట్టి ఏడవసాగాడు. వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడు ఏడుపు మానలేదు. అందుకని ఇంటావిడ చంటివాడిని చేత్తో ఎత్తుకొని మండుతున్న పొయ్యి లో పడేసింది. చూస్తూ ఉండగానే ఆ పిల్లవాడు పిడికెడు బూడిద అయిపోయాడు.        

   ఇదంతా చూస్తూ ఉన్న బ్రాహ్మణ యువకుడు "మీరు మనుషులా రాక్షసులా మీ ఇంట ఆతిథ్యం ఆరగించితే నేను నరకం పాలవుతాను" అన్నాడు. "నాయనా, నీవు తొందరపడుతున్నావు. మేము రాక్షసులము కాదు. పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు. మా వద్ద మృతసంజీవనీ విద్య ఉన్నది" అన్నాడు బ్రాహ్మణుడు. కానీ యువకుడు ఇదేమీ నమ్మలేదు.

    ఇంతలో బ్రాహ్మణుడి భార్య పక్కనే ఉన్న గోడకు ఉన్న చిలుక కొయ్యకు వేలాడుతున్న సంచిలో నుండి ఒక పుస్తకం తీసి భర్తకు అందించింది. అతడు పొయ్యిలో నుండి చిటికెడు బూడిద తీసి పుస్తకంలో ఉన్న మంత్రం చదివి, ఆ చిటికెడు బూడిద ను పొయ్యిలో ఉన్న బూడిద మీద రాల్చగానే, చిన్న పిల్లవాడు లేచి, పరిగెత్తు కుంటూ తల్లి వద్దకు వచ్చాడు. ఇదంతా చూసే ససరికి బ్రాహ్మణ యువకునికి ఆశ్చర్యంగా అనిపించింది. తరువాత వాడు అక్కడే భోజనం చేసి, విశ్రాంతి తీసుకున్నాడు.                             రాత్రివేళ అందరూ నిద్రిస్తూ ఉండగా వాడు ఆ పుస్తకాన్ని దొంగిలించి మౌనంగా అక్కడి నుండి బయట పడ్డాడు. వాడు నేరుగా బ్రహ్మస్థలం చేరుకొని, స్మశానంలో మందరవల్లిని బూడిద చేసిన చోటికి వచ్చి, అక్కడి నుండి చిటికెడు బూడిద తీసుకొని, పుస్తకంలో మంత్రం పఠించి ఆ బూడిదను మందరవల్లి శరీరాన్ని కాల్చిన చోట చల్లాడు. అంతే మందారవల్లి లేచి కూర్చుంది. 

    "ఈమెను బతికించినవాణ్ణి నేను కాబట్టి నేనే వివాహమాడతాన"ని చెప్పాడు ఆ యువకుడు. దీనికి రెండో వాడు ఎంతమాత్రం అంగీకరించకుండా, "మందరవల్లి అస్థికలను నేను గంగలో కలిపి ఆమెకు మోక్షం కలిగించినందుడనే పునర్జీవనం పొందింది. కావునా నేనే వివాహార్హత కలిగినవాడిని" అని ఘర్షణ పడ్డాడు. మూడోవాడు మందరవల్లి చనిపోయి బూడిద అయిన తరువాత నేను ఆమె తోడిదే ఈ ప్రపంచమని భావించి ఇచటనే నివసిస్తున్నాను. కాబట్టి ఆమె నాది" అన్నాడు. వాళ్ళ గొడవ ఎంతకూ తేలలేదు. 

     చివరకు వాళ్ళు మందరవల్లిని తీసుకొని, ఆమె తండ్రి అయిన అగ్నిస్వామి వద్దకు వెళ్లి, వేద వేదాంగాలలో గల సూక్ష్మ ధర్మాలను అనుసరించి తీర్పివ్వమని తాము కట్టుబడి ఉంటామని కోరారు. "నాయనలారా, ప్రాణం పోసిన యువకుడు సందేహం లేకుండా చాల గొప్పవాడు. కానీ ప్రాణం పోసినవాడు తండ్రి సమానుడు, అతనికి కూతురులాంటి మందరవల్లిని వివాహమాడే అర్హత లేదని ధర్మసూత్రాలు వక్కాణిస్తున్నాయి. ఇక రెండో యువకుడు ఆమె అస్థికలను గంగలో కలిపి ఆమెకు మోక్షం ప్రసాదించాడు. అతను కూడా చాల గొప్పవాడే, కానీ వేద వేదాంగాలు చెప్పేదేంటంటే, అలా చేసినవాడు సోదర సమానుడౌతాడు కాబట్టి, అతనికి మందరవల్లిని వివాహమాడే అర్హత లేదు. ఇంక మూడోవాడు. ఆమె బూడిద అయినప్పటికీ, ఆమె చితి యందే నిద్రించి, అక్కడే తపస్సు చేస్తున్నాడు. ఆమె చితిలో నిద్రించిన అతను భర్త సమానుడౌతాడు. కాబట్టి అతనికే మందరవల్లి చెందడం న్యాయం" అని చెప్పాడు. 

      దీంతో చేసేదేమీ లేక మందరవల్లిని ఆ బ్రాహ్మణయువకునికి అప్పగించి, వివాహం జరిపించి వాళ్ళు తమదారిన పయనమయ్యారు.


Rate this content
Log in