STORYMIRROR

MadhuriDevi Somaraju

Comedy Drama Others

4  

MadhuriDevi Somaraju

Comedy Drama Others

తాను చేసినదే

తాను చేసినదే

2 mins
321

రామా! శంభో! అంటూ మంచము మీద పడుకుని సెలైన్ ఎక్కించుకుంటూ అటూ ఇటూ తిరగలేకా, నిలకడగా పడుకోలేకా అవస్థ పడుతున్నాడు చెంగల్రావు. 

ష్! కదలకూడదూ, అరవకూడదండీ! అని హెచ్చరిస్తూ తన పని తాను చేసుకుని పక్కకు వెళ్లినది నర్స్.


ఇంతలో తనను పలకరింౘడానికి వచ్చాడు తన స్నేహితుడైన పొరుగింటి మీసాల్రావు. అతను పొరుగు వాడే కాదు, తన తోటి, పోటీ వ్యాపారస్థుడు కూడా. అయితే ఆ వ్యాపారము వీరిరువురి స్నేహాన్ని, అహాల్నీ మాత్రం దెబ్బ తీయలేదు.


ఏమైంది రా చెంగల్వా ఏమిటి నీకీ అవస్థా అంటూ ఆవేదనగా వచ్చాడు మీసాల్రావు! ఏమి చెప్పనూ! శ్రావణ మేఘాలు కమ్ముకుని చక్కగా వర్షాలు పడుతున్నాయి కదా అనీ, ఇంటిదాన్ని బజ్జీలు వేయమన్నాను! దాని ఫలితమే ఇది! అని నిట్టూర్చాడు చెంగల్రావు. బజ్జీలు తింటే ఆస్పత్రి పాలవడమేమిటీ అసలు రక్తం పాడవటమేమిటిరా మహా అయితే విరేచనాలు అయ్యి నీరసం రావాలి కానీ! అంటూ విస్తు పోయాడు మీసాల్రావు. అతను తన ముక్కు కింద నుంచీ గడ్డం వఱకూ తన కండువా అడ్డం పెట్టుకుని మాట్లాడుతుండటంతో పలుకు ముద్దగా వస్తున్నా విషయం అర్థమవుతుండటంతో సమాధానం చెప్పాలని ప్రయత్నించినా నిరసం వలన మాట పెగలక మిన్నకుంఠి పోయాడు చెంగల్రావు.


అది విరేచనాల వలన వచ్చిన అస్వస్థత కాదు. నూనెలో కల్తీ వల్ల శాల్తీ కడుపులో కండరాలు దెబ్బ తిన్నాయి. అందుకే ఇంత అవస్థ, అంత చికిత్సానూ. అంటూ చెప్పింది పక్కనున్న నర్స్. అవునా, నూనెలో కల్తీనా అంటూ ఉలిక్కి పడ్డాడు మీసాల్రావు, క్రితం వారం అధికారులు పట్టుకున్న పలు కల్తీ నూనెలలో తనదీ ఉండటం గుర్తుకు వచ్చి! 

అది సరే, ఇంతకీ మీరేమిటీ, ఆ గుడ్డను ముఖముకు అడ్డంగా ఉంచకుండా తీయండీ, కరోనా రోజులు కావివి! అంటూ మాట్లాడింది నర్స్, అంతా ఒకే ఊరి వారు కావటంతో. తీస్తే తన పరువు పోతుందని భయపడినా, చుట్టూ అందఱూ అంటూ ఉండటంతో తీయక తప్పింది కాదు అతనికి! అంతే, అక్కడ ఉన్న వారంతా ముందు ఆశ్చర్య పోయినా, తర్వాత విషయం అర్థమయ్యి పెద్ద పెట్టున నవ్వారు! ఒక్క చెంగల్రావు తప్ప! చిన్న బుచ్చుకున్న మీసాల్రావు ముఖం చూసి మనసు కలుక్కుమంది కూడానూ! ఎందుకంటే, అందుకు మూల కారణం తనేగా! 

జుట్టు పెరుగుతుందీ నలుపు రంగు అదురుతుందీ అంటూ ఊదరగొట్టి, తాను ఎక్కడెక్కడివో కలిపి తెచ్చిన కలుపు మొక్కల పసరు అమ్మి లాభం గడించాడనుకున్నాడే కానీ, దాని వలన మీసాల పిచ్చితో సార్థక నామధేయుడనిపించుకున్న తన స్నేహితుడికే ఇబ్బంది కలిగిందని గ్రహించి మౌనంగా తల బాదుకున్నాడు చెంగల్రవు! ఇద్దఱూ తేలు కుట్టిన దొంగల్లా ఒకఱి చేతులు ఒకఱు పట్టుకోవటం తప్ప బయట పడలేరు కదా!


Rate this content
Log in

More telugu story from MadhuriDevi Somaraju

Similar telugu story from Comedy