"స్టేటస్" ఓ చిన్న కథ
"స్టేటస్" ఓ చిన్న కథ
*స్టేటస్*
సరదాగా రాసిన ఓ మరీచిన్న క్రైమ్ కథ
@ రామశర్మ
##############
" ఏమండోయ్..ఏడు వారాల నగలు, పట్టుచీరలు కనబడ్డంలేదండీ.."
సావిత్రి పెద్ద పెట్టున ఏడుస్తూ ఫోన్ లో చెప్తున్న మాటలు విని గాభరా పడిపోయాడు
శంకరం.
" ఆండాళమ్మ సీరియల్ లోని ఆండాళ్ దా ? "
ఆదుర్దా పడిపోయాడు.
" కాదండీ. నావే.. పుట్టింటోళ్ళిచ్చినవి"
" ..ఆండాళ్ వేమోనని కంగారు పడ్డాను"
" ఆ..అంటే ..నావిపోయినా పర్లేదా ..మీ సీరియల్ పిచ్చిపాడుగానూ.." గట్టిగా అరిచేసరికి అసలు విషయం అపుడర్ధమయ్యింది శంకరానికి.
"ఎపుడూ.! ఎవరు తీసారంటావ్.."
"ఏమోనండీ నాకేం తెలుసు..వారం క్రితం పెళ్ళి కెళ్ళినప్పుడు పెట్టుకున్నా కదా..ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో.."
" నిన్న మీ చెల్లెలొచ్చింది కదా ..ఓ సారి అడుగు.."
"ఏంటి మీ ఉద్దేశ్యం ..మీ అనుమానం తగలెయ్య..దానికేం పనండీ..వాటిని ముట్టుకోవటానికి?"
" అనుమానం కాదే..అడుగోసారి తప్పేముంది..ఎన్ని సార్లు చెప్పానో..స్టేటస్ అనుకుంటూ నగలన్నీ వేసుకుంటావ్..ఏ ఫంక్షన్ కెళ్ళినా ..!"
"మరి ఫంక్షన్లకు వెళ్ళే ముప్పావు సగం కారణం
అదే కదండీ..మన స్టేటస్ ఏంటో అందరికీ తెలియొద్దా ఏం?.."
" ఇపుడు తెలిసొచ్చిందిగా బాగా.. ఎవడో
కన్నేసి ఎత్తుకెళ్ళుంటాడు. ఐనా అజాగ్రత్త ఎక్కువ నీకు. బ్యాంకు లాకర్లో పెడదామని ఎన్ని సార్లు మొత్తుకున్నా వినలేదు" చెప్పాడు శంకరం.
" వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి" చెప్పింది
సావిత్రి.
"ఏమండోయ్..!" మళ్ళీ పెద్దగా అరిచింది.
" ఏమైంది.!"
"మన బుజ్జి పిల్లిని ఎవరో చంపేసారండీ..
బీరువా వెనక ఇపుడే దాన్ని రక్తపుమరకలతో చూస్తున్నా..!"
" అయ్యో..హత్య కూడా జరిగిందా..దొంగతనమే కాదన్నమాట" అన్నాడు శంకరం.
" అవునండీ అసలే నల్లపిల్లి. నా బంగారు తల్లి.
దానిమీద ఎన్ని కవితలు రాసి ప్రైజులు గెల్చుకున్నానో.."
" సావిత్రీ..! పొద్దున నువ్వు వినిపించిన కవిత విని చచ్చి పడుంటుందిలే ..!" ఆ పిల్లి స్థానంలో తనెప్పుడో ఉండాల్సినవాడు సావిత్రి కవితలు వింటూ అని పెద్దగా అనాలనుకుని అంతవరకే అంటూ సమాయించుకున్నాడు శంకరం.
"మరీ వేళాకోళమాడకండీ.. నా కవిత్వాన్ని ఏమనకండి"
" సర్లే..! మరోసారి ఇల్లంతా వెతుకు..నేనొస్తున్నా!"
###### ####### #####
15 రోజుల తర్వాత
" ఆ ఏడు వారాల నగలెత్తుకెళ్ళిన, పిల్లిని చంపిన క్రైమ్ కమ్ దొంగ గాడు ఇంతవరకూ దొరకలేదు . ఏం పోలీసులో? " అంటూ " "అవునూ..అన్నీ మర్చిపోయి కవితలు రాసుకుంటున్నావా ? "
అడిగాడు సావిత్రిని శంకరం.
" అదేనండీ ! ప్రథమ బహుమతి గా 50 రూపాయలు -ఇస్తూ కవితల పోటీ పెట్టారు.దాని కోసం కవితలు రాస్తున్నా.."
"ఎన్ని సార్లు చెప్పానూ.. ప్రతీ దానికీ రాయకని.
మరీనూ..."
" లేదండీ..అందరూ అక్కడ కొత్తోళ్ళే..నాలాగా బాగా రాసేవారు తక్కువ"
" అబ్బో...! ఏడువారాల నగలు ఎత్తుకెళ్ళినవాడు ఆ సమయంలో ఎలాగోలా నీ కవితలు వినుంటే బాగుండేది. నగలక్కడే పడేసి పారిపోయుండేవాడు.." నవ్వుతూ సరదాగా అన్నాడు శంకరం.
"
మళ్ళీ మళ్ళీ మీ వేళాకోళం..నా స్టేటస్ ఏంటీ ఏమనుకుంటున్నారు..హమ్మా..ఆ ఫస్ట్ ప్రైజ్ 50/- నాకే చూసుకోండిక .." కాస్త అలిగి కోపంగా పట్టుదలగా అన్నది సావిత్రి.
" ఆల్ ది బెస్ట్ డియరూ" అన్న శంకరానికి వద్దని మొరాయించినా సావిత్రి కవితలను వినిపించింది.
మొబైల్ లోనూ ఫేస్ బుక్కులోనూ చాలా గ్రూపుల్లో పెట్టింది లైకులకోసం.
########
నెల తర్వాత
" ఏమండోయ్" మళ్ళీ కేక వేసింది పేద్దగా సావిత్రి.
పేపరు చదువుతూ కాఫీ తాగుతున్న శంకరం ఆ అరుపుకు ఉలిక్కిపడ్డాడు. తాగుతున్న కాఫీ కప్పు వొణకడంతో వేడి కాఫీ తొడమీద పడి చురుక్కుమంది.
"ఏమైందే..ఆ గొంతు కాస్త తగ్గించు" విసుగ్గా అన్నాడు తొడమీద రుద్దుకుంటూ శంకరం.
" నా పట్టుచీర , నగలెవరి దగ్గరున్నాయో తెలిసిపోయింది. పోలీసులకు మనమే చెప్దాం.."
యురేకా అన్నంత ఆనందంతో అంది సావిత్రి.
" ఏంటీ ? ఎలా కనిపెట్టావ్. " ఆశ్చర్యంగా ముఖం పెట్డి అడిగాడు శంకరం.
" ఆ గ్రూపులు ఈ గ్రూపులు అంటారు ..ఎపుడూ వాట్సాపూ ఫేస్ బుక్కూ అంటారు? ఇపుడదే సాయం చేస్తోంది. 50/- ప్రథమ బహుమతి పొందినందుకు ఎన్నో అభినందనలొచ్చాయని చూపిస్తూ పంపన వారిలోని ఒకరి వాట్సాప్ 'స్టేటస్' చూపించింది సావిత్రి.
అందులో పట్టుచీర కట్టుకుని నిండా నగలు వేసుకుని ' హ్యాపీ బర్త్డే నాదీ ' అని క్యాప్షన్ పెట్టుకున్న ఫొటో *వాట్సాప్ స్టేటస్* రూపంలో పెట్టింది ఒకావిడ .
"ఎవరే ఈవిడ ? అవును అవిడ వేసుకున్న నగలన్ని నీవే. ఆ పేద్ద బార్డర్ ఉన్న ఎరుపు రంగు పట్టుచీర నీదేనే!!" అనందంగా అన్నాడు శంకరం.
" అవునండీ..ఈమెవరో ఏమో తెలియదండీ..ఒక్క నిముషం ఉండండి"
అంటూ నెల క్రితం తమ ఇంటి పైన తను ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చి తన కవితలు వినిపించాలని జరిపిన కవితా సమ్మేళనం లో వచ్చినాళ్ళందిరినీ ఓ గ్రూప్ గా వాట్సాప్ లో చేర్చింది. ఇరవైమంది ఫొటో తెచ్చి చూసింది సావిత్రి. అందులో తెలియనివాళ్ళు కూడా వచ్చారు. వారి మధ్యలో
ఓ పాత చీర కట్టుకున్నావిడ ఉంది.
స్టేటస్ పెట్టిన ఆవిడే ఈవిడ.
ఇంకేముందీ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగం లోకి దిగి అసలు దొంగను.. ఆ *స్టేటస్* ఫొటో ఉన్న నంబరు ద్వారా పట్టేసారు.
"చిన్న చిన్న దొంగతనాలు చేస్తాను.
ఆ కవితా సమ్మేళనం ప్రకటన చూసి వాళ్ళ ఇంటిపై ఓ కన్నేసి వెళ్ళాను. ఆ రోజు కవితలో తవికలో చదువుతున్న సమయంలో టెర్రస్ నుంచీ వీళ్ళ బెడ్రూమ్ లోకెళ్ళాను. ఎవరూ లేరక్కడ బెడ్ రూమ్ లో..తాళాలు తగిలించి అలానే వేళాడుతున్న బీరువా తలుపు కాస్త వారగా తీసిఉంది. బుద్ధి గడ్డి తిని చెడ్డ పని చేసా. ఆ ఫోటో నా వాట్సాపు స్టేటస్ గా ఇంతవరకూ తెస్తుందని తెలీక " అని పోలీసుల ముందు ఒప్పుకుందా కవితలు రాని కుందనమ్మ.
కుందనమ్మకు శిక్ష పడగానే కేస్ క్లోజ్ చేసారు పోలీసులు.
కవితలు రాసుకోవడంలో మునిగిపోయింది సావిత్రి. అవన్నీ వింటూనే ఉన్నాడు పాపం శంకరం.
స్టేటస్ సింబలైన ఆ ఏడువారాల నగలీసారి బ్యాంక్ లాకర్ లోకెళ్ళాయి.
ఇక పిల్లి ఎలా హత్యకు గురైందో ఎవరూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మాత్రం చేయలేదు. మూగ జీవంటే లెక్కెవరికీ..!
####### ######## ########