ఉదయబాబు కొత్తపల్లి

Classics Inspirational Children

4  

ఉదయబాబు కొత్తపల్లి

Classics Inspirational Children

స్ఫూర్తి (మినీ కధ)

స్ఫూర్తి (మినీ కధ)

3 mins
468


 పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు ట్రెజరీలో చెల్లించేసి నాకు రావలసిన రెండు చలానాలను తీసుకుని నా బాగ్ లో భద్రంగా దాచుకుని బాంక్ బయటకు వచ్చి "హమ్మయ్య.ఈ సంవత్సరానికి ప్రధాన బాధ్యత తీరిపోయినట్టే."అనుకుని బైక్ తీసాను.

దారిలో గుర్తుకు వచ్చింది. కళాకేంద్రంలో రక్తదాన శిబిరం జరుగుతోందని.ప్రధానోపాధ్యాయుడు గా నాకు కళాకేంద్రం వారు నిన్న సాయంత్రమే నాకు ఆహ్వానపత్రిక అందజేశారు.

నేను పనిచేస్తున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘానికి కబురు చేసి రప్పించి ఆహ్వాన పత్రికల కాపీలు వారికి ఇచ్చి "కుర్రవాళ్ళు...రక్తదానం చేయండయ్యా.కొందరి ప్రాణాలు కాపాడిన వాళ్లు అవుతారు."అన్నాను.

వారందరూ నా దగ్గర చదువు కున్నవాళ్లే. "మీరేపుడూ రక్తదానం చేయలేదా సర్?"అడిగాడు వెంకటేష్.

"ఏమో నాయనా నాకు సూది అంటేనే భయం.ఇంతవరకు రక్తదానం చేయమని ఎవరూ అడగలేదు.నేను చెయ్యలేదు. నాకు ఏమొచ్చినా మిరియాలు,ధనియాలు, వాము, జీలకర్ర...ఇలాయింట్లో ఇది దొరికితే ఆ కషాయం తాగేస్తాను. ఠక్కున తగ్గి ఊరుకుంటుంది." అన్నాను.

"మేమందరం ఇన్నిసార్లు చేయడానికి మీరిచ్చిన  ప్రోత్సాహము, చూపిన ఉత్సాహమే మాస్టారూ.ఆమరునాడు మన పాఠశాల విద్యార్థులు ఇంతమంది రక్తదానం చేశారన్న వార్తను దిన పత్రికలో చూపిస్తూ,ఆ ప్రసంసాపత్రాలు కూడా మాకు అందజేసేవారు.  ఆ స్ఫూర్తితోనే రేపుకూడా రక్తదానం చేస్తాము సర్.  నేను 28 సార్లు చేసాను సర్.మనోడు 23 సార్లు.. "  అంటూ తన వెనుక  ఉన్న శిష్యులందరిని చూపిస్తూ చెప్పాడు.

నాకు ఒళ్ళు పులకరించింది. "ఎంతటి అదృష్టవంతులయ్యా...మీకు ఉపాధ్యాయుడినే. మీ అందరికి చెప్పగానే గాని ఒక్కసారి కూడా రక్తదానం చేయని అసమర్థుడిని నేను.ఇది ఏమయినా నా మాటకు విలువ ఇచ్చి మీరు సమాజశ్రేయస్సుకు చేస్తున్న సేవను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను బాబు." అన్నాను సంతోషకరమైన మనసుతో.

"మీరు వస్తారా మాస్టారూ.?"అడిగాడు వెంకటేష్.

"చెప్పలేను నాన్న.గుమాస్తా సెలవు పెట్టాడు.రేపు ప్రస్తుత పదవ తరగతి విద్యార్థుల పరీక్షరుసుము బాంక్ లో చెల్లించాలి. కుదిరితే ఒక అడుగు అటు వేస్తాను.లేకపోతే లేదు.ఇదీ సమాజ శ్రేయస్సు కే కదా.రేపటి మీ వారసులు వాళ్లే కదా." అన్నాను నవ్వుతూ.

అందరూ నాకు వినయంగా నమస్కరించి ఉత్సాహంగా వెళ్ళిపోయారు.

బైక్ ఎక్కిన నన్ను ఈ ఆలోచనలు యాంత్రికంగా        కళాకేంద్రానికి తీసుకొచ్చేసాయి.

వెంకటేష్ ఎదురొచ్చి నన్ను తీసుకు వెళ్లి డాక్టర్ల కు పరిచయం చేశాడు.

"మా సర్ కూడా రక్తదానం చేస్తారు సర్.ఇంతవరకు ఏనాడు ఇవ్వలేదు.వారి వయసు 45 సంవత్సరాలు. "అన్న వెంకటేష్ మాటలకు బాగుండదని అయోమయంగా చూస్తూనే నా ఐడెంటిటీ కార్డ్ వెంకటేష్ కి ఇచ్చాను.అందులో నా బ్లడ్ గ్రూప్... వయసు నా కేడర్. అన్ని వివరాలు ఉన్నాయి.నాపేరు రాసిన చోట సంతకం పెట్టి బెడ్ మీద పడుకున్నాను. వెంకటేష్ తో పాటు నా శిష్యులందరూ నా పక్క చూట్టూ చేరి నేను రక్తదానం చేస్తుంటే ఫోటోలు తీయించుకున్నారు.

అనంతరం ఒక ప్రసంసాపత్రం, ఫ్రూటీ డ్రింక్, ఒక కమలా ఫలం ఇచ్చారు.

అందరూ నాకు అభినందనలు చెప్పారు.

". మాస్టారూ. నీరసంగా ఉందా. బైక్ మీద పాఠశాల లో దిగబెట్టమంటారా?"అడిగాడు వెంకటేష్ నా కార్డ్ ఇస్తూ.

"లేదు నాన్న.నేను బాగానే ఉన్నాను.వెళ్లగలను."అని అందరికి కృతజ్ఞతలు చెప్పి పాఠశాలకు వచ్చేసాను.

********

మరునాడు ప్రార్ధనా సమయంలో నేను రక్తదానం ఆవశ్యకత విద్యార్థులకు తెలియచేస్తుంటే వెంకటేష్ బృందం వచ్చారు.వారంతా చేస్తున్న సామాజిక సేవ విద్యార్థులకు తెలియజేశాను.వాళ్లు నాకు దండవేసి, శాలువతో సత్కరించారు.

ఇది జరుగుతున్న సమయంలో యాదృచ్చికంగా పాఠశాల ముందు కారు ఆగింది. అందులోంచి తెల్లకోటు ధరించిన నలుగురు డాక్టర్లు నేరుగా నా దగ్గరకు వచ్చారు.వారందరూ నిన్న నేను చూసినవారే. వారిలో  ఒక యువ డాక్టర్ తాను విద్యార్థులతో రెండు నిముషాలు మాట్లాడే అవకాశం ఇమ్మని కోరాడు.

నేను అవకాశం ఇచ్చాను.

"ప్రియ విద్యార్థులారా. మీరు చేసే రక్తదానం ఎందరికో పోయే ప్రాణాలను నిలబెడుతుంది.నిన్న జరిగిన కార్యక్రమంలో మేము సుమారు 68 మంది వద్దనుంచి రక్తం సేకరించాము. తాను చెప్పడమే కాదు చేసి చూపించే ఉన్నారా వ్యక్తి మీ ప్రధానోపాధ్యాయులు. నిన్న మేము సేకరించిన రక్తంలో 67 మందివి అందరి వద్దా సాధారణంగా దొరికే రకాలే. కానీ నిన్న మీ మాస్టారూ చేసిన రక్తదానం వల్ల ఒక ప్రముఖ వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగాము. దానికి కారణం వారిది  అతి తక్కువగా దొరికే రక్తపు రకం. అందుకే మా వైద్య బృందం వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇక్కడకు వచ్చాము. భవిష్యత్తులో మీరు మీ మాష్టారుని, అన్నలని ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేయవలసిందిగా కోరుతూ... మరి మారు మీ ప్రధానోపాధ్యాయులకు మా అభినందనలు తెలియచేసుకుంటున్నాము." అని ఒక దండ, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

నాకు అప్రయత్నంగా కళ్ళు చమర్చాయి.నేను మొదటిసారి చేసిన రక్తదానం వల్ల ఒక ప్రముఖ వ్యక్తి ప్రాణాలు నిలిచాయన్న మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి. కానీ వారికి నేను స్పూర్తా... వాళ్ళు నాకు స్పూర్తా... అణా సందిగ్ధంలో ఉండగానే విద్యార్థుల హర్షధ్వానాలతో పాఠశాల ప్రాంగణం ప్రతిధ్వనించింది.

                                 సమాప్తం



Rate this content
Log in

Similar telugu story from Classics