శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

4.1  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

రక్షణ

రక్షణ

2 mins
489



  

   కావ్య తన అన్నయ్య సతీష్ కి విషయం ఎలా చెప్పాలో అర్థంకావడంలేదు. చెప్తే అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో...? రవిని ప్రేమిస్తున్నానంటే ... మంచి మనసుతో అర్థం చేసుకుంటాడా...? ఎలాగైనా ఈరోజు చెప్పేయాలి....గట్టిగా ధైర్యాన్ని కూడదీసుకుంది.


            *   *   *   *   *


   వయసులో ఎదిగిందని కూడా చూడకుండా....చెల్లెలు చెంపపై చెళ్లున కొట్టాడు సతీష్. అన్నయ్య చేతిదెబ్బ...తన మనసుపై తగిలింది కావ్యకు.

   

   "నోరు మూసుకుని...ఇంట్లో పడుండు. మన కులమేంటి...? వాడి కులమేంటి...? మన అంతస్తు ఎక్కడ..? వాడి అంతస్తు ఎక్కడ..? అలాంటి వాడితో పెళ్ళైతే...జీవితాంతం నరకం చూస్తావు. ఎన్నో సుఖాలతో పెరిగినదానివి...వాడిని పెళ్లి చేసుకుంటే ...నువ్వు కోల్పోయిందేమిటో ముందు ముందు కళ్ళ చూస్తావు". పెద్ద పెద్ద కేకలు పెట్టి కావ్యని బెదిరించాడు.


   అన్నయ్య మాటలు కావ్యలో మరింత కలతను పెంచాయి. రవి కులం తక్కువోడే కావచ్చు. అంతస్తులు తేడా కావచ్చు. అతన్ని పెళ్లి చేసుకున్నా సంతోషంగానే ఉంటానన్న నమ్మకం ఆమెకుంది. ఎందుకంటే...అతను గుణవంతుడు, సంస్కారం గల మనిషి. అలాంటి వ్యక్తి చాలు ఏ ఆడదైనా జీవితంలో సుఖపడాలంటే. కులం, ఆస్తి అంటూ మంచి మనుషుల్ని చిన్నచూపు చూస్తున్నంతసేపూ ఈ సమాజం బాగుపడదు. అందుకే...మనసులో రవి అంటే... ఓరకమైన ఇష్టం ఉంది కాబట్టే... ధైర్యంగా చెప్పగలిగింది . తనకు తెలుసు...నిజంగానే రవిని పెళ్లి చేసుకుందామనుకున్నా ఇంట్లో జరిగే పరిమాణాలు ఎలా ఉంటాయో ఊహించగలదు. అసలు తన ఉద్దేశ్యమే వేరు. అతని చెల్లెల్ని చెరబట్టాలని చూస్తున్న తన అన్నయ్య  ప్రయత్నం తప్పించాలనే...!

   

   అవును మరి...తన స్నేహితురాలు సుష్మ రవికి చెల్లెలే. రవి లక్షణాలే తన అన్నలో కూడా ఉండి ఉంటే... ఉత్తమురాలైన స్నేహితురాలు తనకు వదినగా రావడానికి సంతోషించేదేమో...? కానీ తన అన్నయ్య...స్త్రీ లోలుడు. పచ్చి దుర్మార్గుడు. ఎంతోమంది అమ్మాయిలతో తిరుగుతున్నాడన్న విషయం తనకు తెలియంది కాదు . ఇప్పుడు సుష్మ మీద కూడా కన్నేసాడన్న సంగతి గ్రహించి ....వీడేంత స్థితిమంతుడై...పెద్ద కులంలో పుట్టినా... ఇలాంటి వాడి చేతిలో మాత్రం ఆమె జీవితం బలి కాకూడదని... రవిని ప్రేమించానని తాను చిన్న అబద్దాన్ని ప్లాన్ చేసి...రవిపై  తనకున్న అభిప్రాయాన్ని తడబడకుండా చెప్పింది...! తన స్నేహితురాలి జోలికి అన్నయ్య వెళ్లకుండా రక్షణ కల్పించాలన్నదే తన ముఖ్య ఉద్దేశ్యం.


   కావ్య విషయానికొస్తే...అన్న ఎంత దుర్మార్గుడైనా...తన చెల్లెల్ని తమకంటే పై స్థాయిలో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడే గానీ...ఎవరికి పడితే వాడికిచ్చి చేసేయడానికి ఎంతమాత్రమూ అంగీకరించడు. తన అన్నయ్యలాగే...లోకంలోని ఆడపిల్లల అందరి అన్నయ్యలూ తన వాళ్లదగ్గర బాధ్యతగానే ఉంటారేమో...! 

   

   కావ్య ఆలోచిస్తుంది.... అన్నయ్యలోని ఆ ఆవేదనా,ఆవేశమంతా నా సౌఖ్యం కోసమే. నాకు రక్షణగా కూడా అడ్డుకున్నాడంటే...నాపై బాధ్యత ఉండబట్టే. అన్నయ్యపై తనకున్న దురాభిప్రాయంతో పాటూ ప్రేమతో కూడిన సదాభిప్రాయం కూడా కలగడంతో...ఆమె మనసు ఆనందంతో పులకించిపోయింది...!!


    ****  *****  ******   ********   *******

  


     



    


Rate this content
Log in

Similar telugu story from Drama