" రాజకుమారి "
" రాజకుమారి "


నా బంగారు తల్లి ఎక్కడ ఉందీ, నాన్న వచ్చేసరికి బుట్ట బొమ్మ ఎదురు రావాలి కదా? శ్రీజా ,అమ్మలూ " అని గుండెల్లో ప్రేమంతా గొంతులో కనపరుస్తూ లోపలికి వచ్చాడు శ్రీధర్. తన కారు లోపలికి వచ్చిన శబ్ధం వినగానే లేడిలా చెంగున గెంతుతూ వచ్చి నాన్నా అంటూ తనని చుట్టుకుపోయే తన పదిహేనేళ్ల కూతురు శ్రీజ ఈ రోజు ఎదురు పడకపోవడంతో కాస్త కంగారుగానే అన్ని గదులు తిరిగి చూశాడు శ్రీధర్. భార్యా,కూతురు క్రింద ఎక్కడా కనపడకపోవడం తో పైకి పరిగెత్తుకు వెళ్ళాడు. పైన ఉన్న గదిలో తన కూతురు, వాళ్ళ అమ్మ ఒడిలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం చూసిన శ్రీధర్ కి పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది. ఒక్క ఉదుటున కూతుర్ని చేరుకుని భార్య ఒళ్ళో ఉన్న శ్రీజని గుండెలకు హత్తుకుని " ఏమైంది తల్లీ, ఎక్కువగా నవ్వినప్పుడు నీ కంట్లో నుంచి నీరు వస్తేనే తట్టుకోలేను నేను, అలాంటిది గుండెలవిసేలా ఈ ఏడుపు ఏంటి అమ్మలూ,నిన్ను ఇలా చూసి నా గుండె ఆగిపోయేలా ఉంది ఏమైంది చెప్పు" అని కళ్లలో నీరు సుడులు తిరుగుతుండగా కూతుర్ని దీనంగా అడిగాడు శ్రీధర్. ప్రతి చిన్న దానికీ "నాన్నా మరే" అంటూ పసిపాప లా తనని చుట్టేసే కూతురు తన వైపు తలెత్తి కూడా చూడకపోవడంతో హతాశుడయ్యాడు శ్రీధర్. భార్య ప్రణవి మెల్లిగా కళ్ళతోనే అక్కడి నుంచి వెళ్ళమని సైగ చేయడంతో , లేచి బయటకు వెళ్ళాడు.
కూతుర్ని పడుకోమని చెప్పి,బయటకు వచ్చిన భార్య ని చూడగానే అప్పటి వరకు కాలు కాలిన పిల్లిలా తిరిగిన శ్రీధర్ ఒక్క ఉదుటన భార్యని చేరుకొని " ఏమైంది ప్రణవి, నా గుండె పగిలిపోక ముందే నా చిన్నారి తల్లి ఎందుకు అంత బాధ అనుభవిస్తుందో చెప్పు దయ చేసి. ఇంక తట్టుకోవడం నా వల్ల కావడం లేదు" అన్న శ్రీధర్ మాటలకు మాములుగా అయితే ప్రణవి " అవును మరి ప్రపంచం లో మీకు మాత్రమే ఉంది రాజకుమారి, మరీ అంత అపురూపం పనికిరాదు" అని ముద్దుగానే కసురుకునేది, కానీ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి క్రిందకి రమ్మన్నట్టుగా చూసి మెట్లు దిగిపోయింది, చేసేదేమి లేక భార్యని అనుకరించి వెళ్ళాడు శ్రీధర్ కూడా . కిచెన్ లోకి వెళ్లి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి ఇచ్చిన ప్రణవి, శ్రీధర్ తో " మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది మెల్లిగా వినండి, పరిష్కారం ఇద్దరం కలిసి ఆలోచిద్దాము . శ్రీజ 2 రోజులు తన స్నేహితురాలు పూర్వి తో వాళ్ళ ఇంట్లో సరదాగా ఉండి వస్తాను అని వెళ్ళింది కదా, ఉదయం వచ్చినప్పటి నుంచి చాలా డల్ గా, ఏదో చెప్పుకోలేని బాధ పడుతున్నట్టు అనిపించింది. ఎప్పుడు పూర్వి తో సరదాగా గడిపి వచ్చినా చాలా సంతోషంతో బోల్డన్ని కబుర్లు చెప్పే మన కూతురు ఆలా ఎందుకు ఉందో అర్ధం కాక నాకు కూడా ఉదయం నుంచి మనసు మనసులో లేదండీ . ఇంక తట్టుకోలేక మీరు వచ్చే ముందే బలవంతంగా రూమ్ లోకి తీసుకు వెళ్లి అడిగాను" అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న భార్య మాటలకు మధ్యలోనే అడ్డుపడ్డాడు శ్రీధర్. మొహం అంతా చిరాకు నింపుకుని. "ఏముందీ బయట ఎండలు మండిపోతున్నాయి కదా, కనీసం ఆ కొంపలో చల్ల గాలి వీచే మంచి ఫ్యాన్ కూడా ఉండి ఉండదు, ఎప్పుడూ ఏసీ లో ఉండే నా చిట్టి తల్లి ఆ వేడికి నీరసించిపోయి ఉంటుంది. అసలు నా కూతురు ఆ ఇంట్లో అడుగుపెట్టడమే నాకు ససేమిరా నచ్చదు, కానీ నా కర్మ కొద్దీ, ఇంత మంది డబ్బు ఉన్న పిల్లలు ఉన్నా శ్రీజ కి ఆ పూర్వి అంటేనే చిన్నప్పటి నుంచీ పిచ్చి ఇష్టం, తాను చదివే స్కూల్ లో ఎంత ధనవంతుల పిల్లలు ఉన్నా వాళ్ళతో స్నేహానికి ఇష్టపడదు, తనని బాధ పెట్టడం ఇష్టం లేక తప్పదని ఊరుకుంటున్నాను, నేనే ఒక ఏసీ కొని వాళ్ళ ఇంట్లో పడేస్తాను " అని ఆవేశంగా అంటున్న భర్త ని కోపంగా చూసింది ప్రణవి.
శ్రీధర్, కిషోర్ చిన్నప్పటి నుంచీ ప్రక్క ప్రక్క ఇళ్లల్లో పెరిగారు. ఇద్దరూ కలిసి చదువుకునే వాళ్లు, డిగ్రీ చదువుతుండగా హఠాత్తుగా కిషోర్ తండ్రి మరణించడంతో ఇంటి భాద్యతలు నెత్తిమీద పడడంతో డిగ్రీ తో చదువు ఆపేసి చిన్న ఉద్యోగం లో చేరిపోయాడు. స్వతహాగా తెలివైన శ్రీధర్ పై చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం శ్రీధర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉన్నత పదవిలో ఉన్నాడు.సమాజం లో తన స్థితిగతులు మారే కొద్దీ అతనిలో అహం కూడా పెరుగుతూ రావడంతో కిషోర్ లాంటి స్నేహితులని దూరం పెట్టసాగాడు. కానీ చిన్నప్పటి నుంచీ పూర్వీ , శ్రీజ కలిసి మెలిసి పెరగడంతో వాళ్ళ స్నేహాన్ని దూరం చేయడం మాత్రం శ్రీధర్ వల్ల కాలేదు. శ్రీజ కన్నా పూర్వి చాలా తెలివైన పిల్ల కావడంతో శ్రీజ ఆ అమ్మాయిని చాలా ఇష్టపడుతుంది, ఇద్దరూ వేరే వేరే స్కూల్ లో చదువుతున్నా తన ఖాళీ సమయం పూర్వి తో గడపడానికే ఇష్టపడే కూతురిని గట్టిగా మందలించలేక, చేసేదేమి లేక ఊరుకుంటున్నాడు శ్రీధర్ కూడా. భార్య మాటలు సగమే విన్న శ్రీధర్ మనసులో" పోనీ ఈ విధంగా అయినా ఆ కొంపకి దూరం అయితే అదే చాలు, అసలు వాళ్ళ అంతస్థు ఏమిటి నా అంతస్థు ఏమిటీ , నా కూతురు అక్కడికి వెళ్లిన ప్రతి సారీ నా తల కొట్టేసినట్టే ఉంటుంది" అని ఆనందంగా అనుకున్నాడు. భర్త మొహం లో ఆ మెరుపుని గమనించిన ప్రణవి "ఏమైంది ఆలా నవ్వుకుంటున్నారు నేను చెప్పాలనుకున్నది ఇంకా పూర్తి కాలేదు " అనడంతో నువ్వు చెప్పేది నాకు ముందే తెలుసు అన్నట్టు గర్వంగా చూశాడు భార్యని శ్రీధర్.
కానీ ప్రణవి జరిగినది చెప్పడం నా బాధ్యత అన్నటుగా తిరిగి చెప్పడం మొదలు పెట్టింది. "ఈ మధ్య శ్రీజ తరచుగా కిషోర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళుతుంది మాథ్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి పూర్వి తో చెప్పించుకుంటాను అని. నాకు ఎదిగిన ఆడపిల్ల అలా పరాయి ఇంటికి వెళ్లి ఉండడం ఇష్టం లేకపోయినా మీరు దాన్ని ఏమి అననివ్వరు , పైగా అన్నయ్య వాళ్ళు మీకు చిన్నప్పటి నుంచీ తెలుసు అనే ధైర్యం తో నేను కూడా ఊరుకుంటున్నాను. ఈ మధ్య ఒకటి రెండు సార్లు అక్కడికి వెళ్లొచ్చాక శ్రీజ ముభావంగా ఉండడం గమనించాను నేను కానీ పెద్దగా ఆలోచించలేదు. నిన్న కూడా వదిన ఊరికి వెళ్ళింది అనీ, పూర్వీ కిషోర్ అన్నయ్య ఇద్దరే ఉన్నారని వెళతానని గొడవ పెట్టడంతో సరే అని పంపించాను. ఉదయం తిరిగి వచ్చిన శ్రీజ ఎప్పటిలాగా లేదు, చాలా బెరుకుగా ఊహించనిది ఎదో జరిగినట్టు భయం భయంగా కనిపించింది, సరిగా భోజనం కూడా చేయలేదు. సాయంత్రం వరకూ ఎంత అడిగినా చెప్పకపోయేసరికి ఇంక నేనే కాస్త కోప్పడి దగ్గరకు తీసుకుని లాలించి అడిగాను తల్లిని కదా నా మనసు ఎందుకో కీడు శంకించింది. చాలా సేపు బ్రతిమాలిన తర్వాత శ్రీజ చెప్పిన మాటలు విన్న నాకు కాళ్ళ క్రింద భూమి కదిలినట్టు అనిపించింది అండీ. మీరు స్త్రీ శిశు సంక్షేమశాఖ లో పని చేస్తున్నారు, ఆడపిల్ల జీవితం ఆత్మ గౌరవం ఎంత విలువైనవో ఎంతో తెలుసుకుని ఉంటారు కదా. పిల్లలు ఇద్దరూ మీ ఇద్దరినీ ఎంతో ఆప్యాయంగా మామయ్య అనే పిలుస్తారు . ఈ మధ్య కిషోర్ అన్నయ్య ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది అంట అండీ, శ్రీజ ని ఇబ్బందికరం గా అనిపించే చూపులతో చూస్తున్నాడు అంట, కావాలని చేతులు తాకించడం లాంటివి కూడా గమనించింది అంట, చిన్న పిల్ల కదా పెద్దగా పట్టించుకోలేదు అంట. కానీ నిన్న రాత్రి పిల్లలు ఇద్దరూ పడుకుని ఉండగా వాళ్ళ గదిలోకి వెళ్లిన అన్నయ్య గాఢ నిద్ర లో ఉన్న శ్రీజ మీద చెయ్యి వేసేసరికి ఉలిక్కిపడి లేచిన పిల్ల గట్టిగా అరవబోతుంటే నోరు నొక్కి గట్టిగా ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడంట. చిన్నప్పటి నుంచి తండ్రిలా భావించే అతను ఆలా ప్రవర్తించడంతో చిగురుటాకులా వణిపోయిన మన పాప, పూర్వి ఏమైందని ఎంత అడిగినా ఏమి చెప్పకుండా వచ్చేసింది" అంటున్న భార్య మాటలు పూర్తి కాకపో ముందే శ్రీధర్ పిచ్చిపట్టిన వాడిలా ఊగిపోసాగాడు.
tyle="background-color: rgba(255, 255, 255, 0);">"అడ్డంగా నరికేస్తాను వెధవను, డబ్బు లేని వెధవలు బుద్దులు ఇలాగే ఉంటాయి. ఎంత గుండె ధైర్యం వాడికి నా బంగారు తల్లి ని ఆ దృష్టితో చూడడానికి . గాజుబొమ్మలా పెంచుకుంటున్న నా రాజకుమారి మీద ఆ దిక్కుమాలిన వాడు చెయ్యి వేసే అంత ధైర్యం చేశాడా? ఇప్పుడే వెళ్లి ముక్కలు ముక్కలు చేసేస్తాను నా రక్తం సల సలా మరిగిపోతుంది . మురికి వాడల్లో బ్రతికే నాసిరకం జనాల ప్రవర్తన ఇలా ఉంటుందనే నేను మొదటి నుంచీ ఆ కుటుంబాన్ని దూరం పెట్టమని చెప్తూనే ఉన్నాను. నా కూతురి దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పు నేను ఇప్పుడే వాడి అంతు చూసి వస్తాను " అని ఆవేశంలో కళ్ళు నిప్పు కణికల్లా రగిలిపోతుండగా విసురుగా కారు తీసుకుని వెళ్ళిపోతున్న భర్త ని ఆపే ప్రయత్నం కూడా చెయ్యకుండా అలానే చూస్తూ నిలబడిపోయింది ప్రణవి నిట్టూరుస్తూ. వెళ్లిన పావు గంట కూడా గడవక ముందే గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చాడు శ్రీధర్, అంత ఆవేశం గా రగులుతూ వెళ్లిన అతని మొహం లో ఆవేశం లేకపోగా, ఎదో తెలియని సిగ్గు బిడియం కనపడడం గమనించింది ప్రణవి. ఏమీ మాట్లాడకుండా భర్త వైపే చూస్తూ లాన్ లోకి నడిచింది. భార్య వెళ్లిన 5 నిమిషాలకు అక్కడికి వెళ్లిన శ్రీధర్ దోషిలా సిగ్గుతో తలదించుకుని " క్షమించు ప్రణవీ , నీ ముందు నిలబడడానికి కూడా నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది, కూతురు ఏడ్చిందన్న బాధలో నువ్వు చెప్పిన విషయం విన్న నాలోని తండ్రి మనసు విచక్షణ కోల్పోయింది, అందుకే అంత ఆవేశంగా కిషోర్ అంతు చూడాలని బయలుదేరాను. కానీ సగం దూరం వెళ్ళాక జరిగినది ఆలోచించిన నాకు నువ్వు చెప్పిన విషయం అర్ధం అయింది, కిషోర్ స్థానం లో నన్ను నేను నిలబెట్టుకున్నాను. క్రిందటి నెల నువ్వు ఊరికి వెళ్ళినపుడు నేను పూర్వి విషయంలో చేసిన తప్పే ఇలా తెలియ చేశావని అర్ధం అయ్యాక నా మీద నాకే అసహ్యం వేసింది. ఏ క్షణంలో నాలో ఈ మృగం మేలుకుందో కూడా తెలియడం లేదు ప్రణవి . చిన్నప్పటి నుంచీ మామయ్యా అంటూ నా దగ్గర పెరిగిన కూతురు లాంటి ఆడపిల్ల గురించి ఎంత తప్పు ఆలోచన చేశానో తలుచుకుంటే ఈ క్షణమే చచ్చిపోవాలని ఉంది. ఇదంతా శ్రీజ కి తెలిసిపోయి ఆలా ఏడుస్తుంది కదా, ఇప్పుడు నా కూతురు ముందుకు నేను ఎలా వెళ్ళగలను, నిన్ను క్షమించమని ఎలా కోరగలను" అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ కుప్పకూలిపోయాడు శ్రీధర్. భర్తడి అంత దిగజారే వ్యక్తిత్వం కాదనీ, ప్రతి మనిషిలో ఎప్పుడో ఒక సారి తొంగి చూసే చెడు ఆలోచనల వల్ల ఆలా ప్రవర్తించి ఉంటాడని అర్ధం చేసుకున్న ప్రణవి , శ్రీధర్ ప్రక్కన కూర్చుని మెల్లిగా అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది.
" చూడండి, ఈ కాలం పిల్లలు వయసు కి మించి మానసికంగా ఎదిగిపోతున్నారు, అది గమనించి జాగ్రత్తగా ఉండవలిసిన బాధ్యత తల్లితండ్రుల మీద ఉంది. పూర్వి నిన్నటి వరకూ ఈ విషయాలు ఏమీ శ్రీజ తో అనలేదు పాపం , తెలిస్తే వాళ్ళ స్నేహం ఎక్కడ దూరం అవుతుందో అనే భయం తో. కానీ ఆ పసి మనసు ఎంత నలిగిపోయి ఉంటుందో ఆలోచించండి . శ్రీజ తరచూ మన ఇంటికి రమ్మని , రావడం లేదని అలగడంతో నిన్న రాత్రి తప్పని సరి పరిస్థితుల్లో జరిగినది చెప్పి ఏడ్చేసింది అంట. ఇప్పటి వరకూ శ్రీజ కి మీరు ఒక హీరో , తన తండ్రి కన్నా ప్రపంచం లో గొప్ప వాడు తెలివైన వాడు మంచి వాడు లేదు అనే భావన. ప్రతి కూతురు తన తండ్రి గురించి అలానే ఆలోచిస్తుంది దానికి ఆస్తులు అంతస్థులతో సంబంధం లేదు. ఒక్కసారిగా మీ గురుంచి అలాంటి మాటలు వినడంతో తట్టుకోలేకపాయింది, ఆ భయం లో నుంచి బయటకు రాలేకపోయింది. ఉదయం వచ్చినప్పటి నుంచీ నాకు చెప్పలేక, వయసుకి మించిన మానసిక మోయలేక చాలా నరక యాతన పడింది అండీ పాపం. కిషోర్ అన్నయ్య కి తెలిస్తే మన కుటుంబం వాళ్ళ స్నేహం ఎక్కడ దూరం అవుతాయో అని ఎంత మనోవేదన అనుభవించి ఉంటారో ఊహించండి బిడ్డలు. నేను మీకు చాలా సార్లు చెప్పాను , పిల్లల మీద మన ప్రేమ వాళ్ళని మంచి చెడులు తెలుసుకుని సరైన దారిలో వెళ్లేలా పెంచేలా ఉండాలి కానీ , తెలిసీ తెలియని అమాయకత్వం తో వాళ్లు అడిగిన ప్రతిదీ చేసేసి దానికి ప్రేమ అని పేరు పెట్టడం తప్పు అని. ఆడపిల్ల ఆరుగంటలకి ఇంటికి చేరిపోవాలనే మూర్ఖత్వంతో మాట్లాడే రోజులు పోయి, ఆడపిల్లలు అంతరిక్షం లో కూడా అడుగు పెట్టిన రోజులు వచ్చాయండి. ఆ మార్పు చాలా గొప్పదే అందరికీ గర్వకారణమే. కానీ ఒక్కసారి ఆలోచించండి ఇంకొక వైపు తండ్రి నుంచి, చుట్టూ ప్రక్కల వాళ్ళ నుంచీ ,నా అనుకున్న వాళ్ళ నుంచీ కూడా రక్షణ లేకుండా అరాచకాలకు బలి అయిపోతున్నారు అదే ఆడపిల్లలు. అటువంటప్పుడు ఆడపిల్లలకు ఎదగడానికి అవసరమైన స్వేచ్ఛ ఇస్తూనే , అనవసరమైన వాటికి దూరం పెట్టడం మన బాధ్యత కాదంటారా చెప్పండి? పాశ్చాత్య సంస్కృతి లో మంచిని మాత్రమే అనుకరించడం వల్ల మేలే జరుగుతుంది కానీ మనం అనవసరమైనవి కూడా చాలా పాటిస్తున్నాము.
వయసులో ఉన్న ఆడపిల్ల తల్లి తండ్రుల తో కాకుండా పరాయి ఇంటికి వెళ్లి ఉండవలసిన అవసరం ఏముంది అండీ, చిన్న పిల్ల నచ్చచెప్పండి అని మీకు ఎన్నో సార్లు చెప్పాను . పూర్వికి వాళ్ళ ఇంట్లో పంపండం ఇష్టం లేదని తెలిసి తాను రానన్నా, శ్రీజ మొండితనానికి మళ్ళీ అలుగుతుంది అని వస్తుంది పాపం. మీ ప్రవర్తనకి ఎంత నలిగిపోయి ఉంటుంది, మన చుట్టూ ఎంతో మంది ఆడవాళ్లు చిన్న వయసులో ఇలాంటివి భరించి జీవితాంతం మానసికంగా నలిగిపోతూ బ్రతుకుతున్నారు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని ఎలుగెత్తి అరిచే మహిళా సంఘాల లోని ఏ స్త్రీ అయినా ముందుకు వచ్చి అన్యాయం జరిగిన ఆడపిల్ల ని మా ఇంటి కోడలిని చేసుకుంటాను అని ప్రకటించడం చూశామా చెప్పండి? మీ తప్పు మీరు తెలుకోవాలనే నేను విషయాన్ని ఆ విధంగా చెప్పాను అండీ, శ్రీజ కి కూడా నచ్చచెప్పాను నాన్న అలాంటి మనిషి కాదమ్మా అని. వాళ్ళ ఇద్దరి భయం తమ స్నేహం పాడు కాకూడదు అని మాత్రమే వాళ్ళ వయసు లో ఆలోచనా పరిధి అంత మాత్రమే ఉంటుంది. జరిగినది మర్చిపోవడానికి పిల్లలకి కొంచెం సమయం పడుతుంది, ఇద్దరికీ నేను నచ్చచెప్పుతాను, మీరు బాధ పడకండి" అని అనునయంగా చెవుతున్న భార్య ని చూసి " నన్ను క్షమించు ప్రణవీ , పూర్వి నీ, శ్రీజ నీ క్షమాపణలు కోరతాను , ఈ క్షణం నుంచీ ఇద్దరినీ నా బిడ్డల్లా చూసుకుంటాను. నా కూతురు కళ్లలో ,తిరస్కారం నా మీద అసహ్యభావం నేను భరించలేను ప్రణవి , దయ చేసి పిల్లలకి అర్ధం అయ్యేలా చెప్పు. నా కన్నా ఎన్నో రెట్లు గొప్ప వ్యక్తిత్వం ఉన్న కిషోర్ కి న మనసులోనే పాదాభిషేకం చేస్తున్నాను వాడి బంగారు తల్లితో నేను ప్రవర్తించిన తీరుకి " అని చేతులు పట్టుకుని వేడుకుంటున్న భర్త ని" మీరు ఆందోళన పడకండి, నేను మాట్లాడతాను" అంటుండగానే , ఎప్పుడు వచ్చి తల్లి తండ్రుల మాటలు విన్నాదో శ్రీజ పరిగెత్తుకు వచ్చి శ్రీధర్ ని చుట్టేసింది. " నాన్నా, నేనూ పూర్వి బెస్ట్ ఫ్రెండ్స్ నాన్నా. నువ్వు అంటే తనకి చాలా ఇష్టం నాకు శ్రీధర్ మామయ్య దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ ఉంటుంది. మనం ఇద్దరం వెళ్లి దానికి సారీ చెప్దాము నాన్న , ఇంకెప్పుడూ నువ్వు పూర్వి ని బాధ పెట్టవని ఒట్టేసి చెప్దాము సరేనా" అంటున్న కూతురిని గుండెలకు హత్తుకుని, మనసు సిగ్గు తో కుంచించుకు పోతుండగా మౌనంగా ఏడుస్తూ ఉండిపోయాడు . ఇద్దరినీ దగ్గరకు తీసుకున్న ప్రణవి గుండెల్లో భారం దిగిపోగా ప్రశాంతంగా ఇంట్లోకి నడిపించుకు తీసుకు వెళ్ళింది.
గమనిక : ఈ కథ ఎవరినీ కించపరచాలని కానీ, ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని కానీ వ్రాసినది కాదు. మన చుట్టూ ఉన్న పరిస్థుతలకి అనుగుణంగా , మంచి చెడులు బేరీజు వేసుకుంటూ పిల్లలని పెంచాలనీ, ముఖ్యంగా ఆడపిల్లల విషయం లో మనం మరి కాస్త ఎక్కువ జాగ్రత్త వహించాలని చెప్పడమే నా ఈ కథ వెనుక భావం,