Divya Pandeti

Drama

4.4  

Divya Pandeti

Drama

రాజీవం

రాజీవం

5 mins
650


ఎప్పటిలాగే ఉదయాన్నే తను పని చేసే...రిటైర్డ్ జడ్జి రాజారాం గారి ఇంటికి వచ్చింది లక్ష్మీ.వస్తూనే...వాకిలి ఊడ్చి...ముగ్గు పెట్టి.....ఇంటి వెనుక అంతా శుభ్రం చేసి.....ఇంట్లోకి నడిచింది.

వంట గదిలో టీ పెడుతున్న శారదాంబ గారు...లక్ష్మిని చూసి పలకరింపుగా నవ్వి....టీ వడగడుతూ...

షింక్ లోని ఎంగిలి పాత్రలను తీసుకుని....పెరటి వైపు ఉన్న కుళాయి దగ్గరికి వెళ్తున్న......లక్ష్మిని తేరిపారా చూసి....ఒక నీటూర్పు విడిచింది.

@@@@@

లక్ష్మీ పాత్రలు కడుగుతున్న శబ్దానికి.....మెలకువ వచ్చి.....చిరాకుగా కళ్ళు తెరిచి....టైం చూసి....మళ్ళీ ముసుగుతన్ని పడుకుంది రాజారామ్ గారి ఏకైక పుత్రుని.... ఏకైక పుత్రిక జీవని.

ఇక నిద్రపట్టక లేచి మొహం కడుక్కుని.....నాన్నమ్మ ఇచ్చిన టీ పట్టుకుని....పెరటిలో వేసిన మంచంపై కూర్చొని....తాగుతూ.....యధాలాపంగా లక్ష్మిని చూసింది.

చెంపల మీద నాలుగు వేళ్ల గుర్తులు.నుదుటిపై కట్టిన బొప్పి....చేతుల మీద గోళ్ళ గాట్ల ఆనవాళ్లు.ఉబ్బిన కళ్ళు...కళ లేని ఎర్రగా కందిన మొహం.

రోజు గలగలమంటూ మాట కలిపి....తనకు తెలిసిన విషయాలు చెప్పి.....తెలియనివి తెలుసుకునిగాని వదలని లక్ష్మీ......ఈరోజు అంత మౌనంగా ఉండటానికి కారణం తెలిసి.....తను మౌనం వహించింది జీవని.

'నేను ఇక్కడికి వచ్చిన ఈ రెండు వారాల్లో ఇది....పదవసారేమో!'అని నిటూర్చింది.

లక్ష్మీ ఇంట్లో పనంతా ముగించుకుని.....సాయంత్రం రాలేనని....వెళ్ళిపోయింది ఇంకో ఇంట్లో పని చేయడానికి.

లక్ష్మీ వెళ్ళాకా ఇంట్లోకి వెళ్లి...కూరగాయలు తరుగుతున్న నాన్నమ్మని ఉద్దేశించి...

"ఏంటమ్మా ఇది.ఈ లక్ష్మికి బుద్దిలేదా.ఎందుకు ఆ వెంకట్ తో ఇలా తన్నులు తినడం.నువ్వైనా చెప్పచ్చు కదమ్మ."అంది.

"చెప్పానే.....పోలీసులకు చెప్పవే.కనీసం అదిలిస్తారు అంటే వినదు.మొన్న మీ తాతగారు...దాన్ని కూర్చోబెట్టి.'విడాకులు తీసుకోవే.రోజు వాడి చేతిలో దెబ్బలు తిని చచ్చేలా ఉన్నావ్.'అంటే,విని ఊరుకుందేగాని....ఎం మాట్లాడలేదు.ఇంక మేము ఎం చేయం చెప్పు."

లక్ష్మీ మీద కోపం కూరగాయల మీద చూపిస్తోంది శారదాంబ.

"దానికి పిచ్చి బాగా ముదిరిపోయింది.ఆ వెంకట్ తో ఎం సుఖపడుతోంది.....ఎం ఉపయోగం వాడు దానికి.దాని కష్టం కూడా వాడే లాకెళ్లిపోతాడు.దాన్ని కనీసం ఒక మనిషిలా కూడా చూడడు.విడాకులు తీసుకుంటే దాని బ్రతుకు అది బ్రతకచ్చు...హాయిగా."అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది జీవని.

"నాణానికి ఒక్కవైపు మాత్రమే చూడకూడదే.వెంకట్...లక్ష్మికి స్వయానా మేనమామ కొడుకు.చిన్నతనం నుండి...వాడే నీ మొగుడు అని చెప్తూ పెంచారు...పెద్దవాళ్ళు.అది కూడా బావే నా మొగుడని కలలు కంటూ పెరిగింది."

"ఒక వయసొచ్చాకా....బావని చేసుకుంటా అంటే......ఒక ఎకరం భూమి కూడా లేనోడిని చేసుకుని ఎం సుఖపడతావ్ అని....పెద్దలు ససేమిరా అన్నా.....అందరిని ఒప్పించి వాడిని పెళ్లి చేసుకుంది."

"మొదట్లో ఇద్దరు అన్యోన్యంగా బానే ఉన్నారు.ఒక సంవత్సరంగా వెంకట్ లో చాలా మార్పొచ్చింది.తాగుడికి అలవాటుపడ్డాడు.లక్ష్మిని తిట్టడం కొట్టడం చేస్తున్నాడు.దాన్ని ఒకప్పుడు ఎంత అపురూపంగా చూసుకున్నాడో......ఇప్పుడంత నరకం చూపిస్తున్నాడు."

"వాడేం చేసినా.......అది మాత్రం వాడి మీద మాటపడనీదు.ఎవరైనా వాడిని ప్రశ్నిస్తే......మా సంసారం మా ఇష్టం అని ఖరాకండిగా చెప్తుంది."

"అదే నాన్నమ్మ ఎందుకలా.ఎందుకని వాడి తప్పుల్ని కప్పిపుచ్చేస్తోందది."

"వాడి మీద లక్ష్మీ పెంచుకున్న ప్రేమే అది.ప్రేమిస్తునప్పుడు ఆ మనిషిలోని మంచిని మాత్రమే చూస్తాం.ఒక్కసారి ఆ మనిషి మన సొంతమైయ్యాకా......వారిలోని తప్పులు ఎంచుతాం.అప్పుడు అది ప్రేమేల అవుతుందే."

"లక్ష్మీ .....వాడిలోని మంచిని మాత్రమే కాదు,చెడుని కూడా ప్రేమించింది.అందుకే....వాడు ఎంత ఇబ్బంది పెడుతున్న,అందరూ వదిలేయ్ అంటున్న.....వినటంలేదు.చూద్దాం...ఇది ఎంత దూరం పోతుందో."

అని కూరగాయాలు తీసుకొని వంటింటిలోకి వెళ్ళింది శారదాంబ.

@@@@@@

మధ్యాహ్నం భోజనం చేసి....రిలాక్స్ అయిన జీవని...ఇక కాసేపు కునుకేద్దాం అనుకుని.....కళ్ళు మూసుకుందో లేదో.....

దబదబమని ముఖద్వారం కొడుతున్న శబ్దానికి.....'ఎవరది తలుపు పగలకొట్టేస్తారా ఏంటి.'అనుకుంటూ బైటికొచ్చింది.

రొప్పుతూ వచ్చిన పాలేరు....శారదాంబ గారికి ఏదో చెప్తున్నాడు.ఆవిడ విని....సరే.అని అతన్ని పంపించి వచ్చి....కింద కూలబడి....కొయ్య స్థంబానికి ఆనుకుని కూర్చుంది.

ఆవిడ దీన వదనం చూసి......ఏమైందో ఎంటో అన్న కంగారుతో.....వడివడిగా ఆవిడని చేరి..

"ఏమైంది నాన్నమ్మ?"అడిగింది ఆవిడ భుజం మీద చెయ్యేసి.

"వెంకట్ పురుగుల మందు తాగేసాడటే.కష్టం అంటున్నారట."

అంది శారదాంబ ఆ షాక్ నుండి తేరుకుంటూ.....ఎలాగో గొంతు పెగుల్చుకుని.

అది వింటూనే జీవని మనసు అదోలా అయిపోయింది.ఎం మాట్లాడలేక నాన్నమ్మ పక్కన కూర్చుని.....ఆవిడ చెయ్ పట్టుకుంది...'ఏమ్ కాదులే,కంగారు పడకు.'అని ధైర్యం చెప్తున్నట్టు.

"ఉదయం నేనో మాట అన్నానుకదే జీవా. నాణేనికి ఒక వైపు మాత్రమే చూడకూడదని.అది వెంకట్ విషయంలో నిజమైందే.లక్ష్మిని ఎంతో ప్రేమగా చూసుకున్న వాడు...ఇప్పుడెందుకు అలా ప్రవర్తించేవాడో తెలుసా?"

అంటూ జీవనిని చూసి ఆగింది.ఆమె మొహంలో ఎందుకో తెలుసుకోవాలన్న ఆత్రుత కనిపించింది.

"పెళ్లై రెండేళ్లు గడిచినా ఇంకా పిల్లలు కలగలేదని....డాక్టర్ దగ్గరికి వెళ్తే.వెంకట్ కి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారంట."

"తన వల్ల లక్ష్మీ జీవితం పాడవ్వడం ఇష్టంలేక.తనని వదిలేయమని...ఇంకో పెళ్లి చేసుకొని...పిల్లాపాపలతో సుఖంగా ఉండమని దాంతో చెప్పాడట."

"కానీ అది వెంకట్ ని వదులుకోడానికి సిద్ధపడలేదు.వాడు నచ్చజెప్పాడు,రేపు తన పరిస్థితిని వివరించాడు.అయినా అది ససేమిరా అందట."

"లక్ష్మీ మాట వినడంలేదని...తనని తాను దిగజార్చుకున్నాడు.దానికి ఇష్టంలేదని మానేసిన మందుని..మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు.చీటికిమాటికి దానితో గోడవపడటం.....తిట్టడం,కొట్టడం చేసినా......అది మాత్రం వాడి మాట వినలేదు"

"అందరూ వాడిని తప్పుపడుతున్నా......ఒక్కమాట కూడా ఎందుకు అని చెప్పలేదు.చెప్తే నలుగురూ వాడి...లోపాన్ని ఎత్తిచూపి చులకన చేసి పరువుతీస్తారని."

"లక్ష్మిది స్వచ్ఛమైన ప్రేమ....వెంకట్ లోని లోపాన్ని కూడా అది ప్రేమించింది.ఆ పిచ్చిదాని కోసమైనా వాడికేం కాకూడదు.భగవంతుడా....వాడిని నువ్వే కాపాడాలి."

అని దేవుడిని వేడుకుంటు....లేచి పూజ గదిలోకి వెళ్ళింది శారదాంబ.

జీవని కూడా నెమ్మదిగా తన గదికి చేరి....గడియ పెట్టి...మంచంపై వాలింది.

@@@@@

"లక్ష్మిది స్వచ్ఛమైన ప్రేమ....వెంకట్ లోని లోపాన్నీ కూడా అది ప్రేమించింది."

శారదాంబ అన్న ఆ మాటలు పదే పదే గుర్తుకోస్తూ..... జీవనిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్.

లక్ష్మీని తలుచుకుంటుంటే....ఎవరో తనని చాచిపెట్టి కొట్టినట్టు.....తన మూర్ఖత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నట్టు అనిపిస్తోంది ఆమెకు.

లక్ష్మికి పెళ్లి జరిగిన ఏడాదే జీవనికి పెళ్లి జరిగింది.తను పని చేస్తున్న ఆఫీసులోనే,తన సహద్యోగి రాజీవ్ ని చూసి.....ఇష్టపడి......అతనూ తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని.....ఇరుకుటుంబాలను ఒప్పించి....పెళ్లి చేసుకున్నారు.

రాజీవ్ ఎంత మెతక మనిషో....జీవని అంత చూరుకైనది.ప్రతి విషయంలోనూ తనదే పై చేయి కావాలి అనుకునే మనఃస్థత్వం.మొదట్లో రాజీవ్ మాట జవదాటేది కాదు.మెల్లగా అతని సౌమ్యమైన..మెతక వైఖరిని ఆసరాగా తీసుకుని......తను ఆడిందే ఆట పాడిందే పాటగా మార్చుకుంది.

మొదట్లో 'ఇలా చేస్తే ఎలా ఉంటుంది?...'అని సలహా అడిగేది,ఆ తరువాత 'ఇలా చేద్దామా?'అనేది......ఇంకొన్నాళ్ళకి 'ఇలా చెయ్' అని శాసించడం మొదలుపెట్టింది.

జీవని ఎం చెప్పినా.....ఎం అడిగినా కాదనేవాడు కాదు రాజీవ్.తన మనసు కష్టపెట్టకుండా......ప్రేమగా చూసుకునేవాడు.

కానీ జీవని.....చిటికిమాటికి,చిన్న విషయానికి కూడా రాజీవ్ తో గోడవపడటం....తన స్నేహితురాళ్ళ ముందు అతన్ని చులకన చేయడం.తాను ముందుకు అడుగు వేయకపోతే...తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం అతనికి లేదని.....హేళన చేసి....నలుగురి ముందు అతన్ని తక్కువ చేసేది.

జీవని మనఃస్థత్వం పూర్తిగా అర్థమైన రాజీవ్.....ఆమె మాటలను ఏనాడు పట్టించుకోలేదు.అతని తల్లిదండ్రులు....భార్యని అదుపులో పెట్టుకో అని సలహా ఇచ్చినా.....తనని శాసించడం కాదు,ప్రేమగా లాలించి దారికి తెచ్చుకోవాలని అనుకునేవాడు.

అటు అతని తల్లిదండ్రుల ముందు తనని తక్కువ చేయకుండా,వాళ్ళకి సర్దిచెప్తు....ఇటు ఆమె ఇంట్లోనూ ఆమె గురించి ఎటువంటి ఫిర్యాదు చేసేవాడుకాదు రాజీవ్.

జీవని ఎలా ఉన్నా,ఎం చేసినా కాదనని,ప్రశ్నించని రాజీవ్.....తమ రెండో పెళ్లిరోజున.....ఇక పిల్లల గురించి ఆలోచిద్దామని మొదటిసారి...తన మనసులో కోరికని బయటపెట్టాడు.

అతని కోరికలో న్యాయమున్నా....అది జీవనికి రుచించలేదు.ఇప్పుడే కాదు...ఇంకో రెండేళ్లు పోనీ అంటూ...అతని ఆశ మీద నీళ్లు జల్లెసింది.కారణం తన స్నేహితురాల్లాకు పిల్లలు లేరు.తను కంటే...వాళ్ళు తనని ఆటపట్టిస్తారని.ముఖ్యన్గా తన అందం తగ్గిపోతుందని.

రాజీవ్ ఎంతగా బ్రతిమాలినా......ఆమె తన మంకుపట్టు వీడలేదు.ఈసారి రాజీవ్ సహనం కూడా నశించింది.జీవనితో వాదనకు దిగాడు.జీవని దిగిరాకపోగా.......అతనితో గొడవపడి,తన మాటని లక్ష్యపెట్టడంలేదని,తన మీద ప్రేమ తగ్గిందని అలిగి....పుట్టింటికి చేరింది.

అక్కడికీ వచ్చి,తనని విసిగిస్తున్నాడని.....జాబ్ కి లాంగ్ లీవ్ పెట్టి.....రెండు వారాల క్రితం.....తాతగారి ఊరు వచ్చింది.ఫోన్ స్విచ్చాఫ్ చేసింది.....రాజీవ్ నుండి కాల్ వస్తుందేమో అని.

తనకూ,లక్ష్మికి ఎంత తేడా.పల్లెటూరులో పుట్టి,పెద్దగా చదువుకొని లక్ష్మీ ఎంత ఉన్నతంగా ఆలోచించింది....తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఎవరు చులకన చేయకూడదని....అతనిలోని లోపాన్ని ఏనాడు గుర్తుచేయకుండా,ఎంత కష్టమైనా అతనితోనే జీవితం అనుకుంది తను.

కానీ తాను....సిటీలో పుట్టి,పెరిగి...పెద్ద చదువులు చదివి.....ఉద్యోగం చేసుకుంటూ.....సంస్కారం లేకుండా...తన భర్త పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించింది.

రాజీవ్ ని ప్రేమిస్తున్న రోజుల్లో......ఎప్పుడైనా అతను తనతో మాట్లాడినా,కనీసం చూసినా ఎంత పొంగిపోయెది.కొన్నాళ్ళకి అతనూ తనని ఇష్టపడుతున్నాడని తెలిసి....తన అదృష్టానికి మురిసిపోయింది.

ఇద్దరికి పెళ్లి జరిగిన తరువాత రాజీవ్ తననెంత బాగా చూసుకున్నాడు.తనేం చెప్పినా తూచా తప్పకుండా పాటించేవాడు.అది అతను తన మీద పెంచుకున్న ప్రేమ.కానీ తనూ... అతని ప్రేమని చేతకానితనంగా భావించి.....తన ఇష్టారాజ్యం చేసుకుంది.

ఏరోజు తనని పళ్ళెత్తిమాట అనని భర్త.....మొదటిసారి గోడవపడ్డాడంటే....అది తన మీద ప్రేమ తగ్గి కాదు.పిల్లలు కావాలనే ఆశతో.

అతని మనసు తను అర్ధం చేసుకోలేదు.....ఎప్పుడు తనకోసమే ఆలోచించే భర్తని భాధపెట్టింది.ఒక్కరోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేని రాజీవ్ పట్లా ఇన్నిరోజులు తాను ఎంత నిర్దాయగా ప్రవర్తించిందో తలుచుకుంటే.....తన మీద తనకే అసహ్యం వేస్తోంది.

ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు జీవని...వెంటనే ఫోన్ స్విచ్ ఆన్ చేసింది.రాజీవ్ నుండి వందకు పైగా మిస్సిడ్ కాల్స్.....

కళ్ళల్లో నిండిన నీళ్లు.....చిత్రం కనిపించనీకుండా చేస్తున్నా..... వణుకుతున్న చేతి వేళ్ళను అదుపుచేస్తు....రాజీవ్ కి కాల్ చేసింది.

మొదటి రింగుకే లిఫ్ట్ చేసాడు అతను....."జీవా.ఎలా ఉన్నావ్ రా?"

ఆర్తిగా,ఆతృతగా పలికిన అతని స్వరం వింటూనే....సిగ్గుతో చచ్చిపోయింది జీవని.

ఎప్పుడూ దెప్పిపొడవడానికి,నిష్ఠూరమాడటానికి,గోడవపడటానికి వచ్చినా నోరు.....ఇప్పుడు పలకలేక మూగబోయింది.

"ఏంట్రా నా మీద ఇంకా కోపం పోలేదా?జీవా... ఇంకెప్పుడు నీతో గోడవపడను.నీ ఇష్టం వచ్చిన్..."

అంటున్న అతని మాటకు అడ్డుపడుతూ..

"సారి రాజీవ్.నిన్ను చాలా బాధపెట్టను కదా."అంది ఏడుస్తూ.

"ఛ....ఛ....మనలో మనకు సారీలేంట్రా.భార్యాభర్తలిద్దరూ ఎప్పుడు ఒకే మాట మీద ఉండాలి.చెరో మాట మాట్లాడితే...ఇలాగే ఉంటుంది.నీకు ఇప్పుడే ఇష్టం లేనప్పుడు....నిన్ను ఇబ్బంది పెట్టి తప్పు చేశాను.నువ్వన్నట్టు ఇంకో రెండేళ్లు పోనీలే."

రాజీవ్ ఒకపక్క తనని మందలిస్తూనే....తన ఇష్టాన్ని సమ్మతిస్తున్నట్టు అంటున్నాడు.

"వద్దు రాజీవ్.మనం పిల్లల గురించి ఇప్పుడే ఆలోచిద్దాం.దేవుడు అందరికి ఆ అదృష్టం ఇవ్వడు.మనకి ఆ అవకాశం ఉన్నప్పుడు లేట్ చేయడం ఎందుకు."

"జీవా....నువ్వేనా.నీలో ఇంత మార్పేలా?"ఆశ్చర్యంగా అడిగాడు.

"మనిషికి మార్పు సహజం కదా రాజీవ్.అది మంచికోసమైతే ఇంకేం కావాలి."

ఈమధ్య కాలంలో జీవని తనతో అంత సౌమ్యంగా మాట్లాడ్డం ఇదే...అనుకున్నాడు రాజీవ్.తనలో వచ్చిన ఈ మార్పు వారి జీవితాన్ని సుఖమయం చేస్తుందని అర్ధమైంది అతనికి.

"రాజీవ్...నిన్ను చూడలనుంది."అంటున్న ఆమె మాటలకు చిన్నగా నవ్వుతూ.

"ఇప్పుడే బయల్దేరుతా.ఉదయం కల్లా నీ ముందుంటా.ఉండనా మరి."

"హ్మ్".అని కాల్ కట్ చేసి....ప్రశాంతంగా కూర్చుంది.

ఆమె మనసు ఏదో భారం దిగి ఎంతో తెలికైనట్టు అనిపిస్తుంటే...

వెంకట్ ప్రాణాపాయం నుండి బైటపడ్డాడని....శారదాంబ చెప్పడంతో ఆమెకు ఇంకా సంతోషంగా అనిపించింది.



Rate this content
Log in

Similar telugu story from Drama