నా పయనం....ఎటు వైపు?5
నా పయనం....ఎటు వైపు?5


"శీను...రేయ్ శీను.లేవర."
ఎవరో నన్ను పట్టి కుదిపేస్తుంటే...ఆలోచనలతో సతమతమై...ఎప్పుడో తెల్లవారుజామున మగతగా నిద్రలోకి జారుకున్న నేను బద్ధకంగా కళ్ళు తెరిచాను.
ఎదురుగా అనీల్ వెలిగిపోతున్న మొహంతో...పళ్ళన్ని కనిపించేలా నవ్వుతూ ఉన్నాడు.
మెల్లగా లేచి కూర్చోని.."ఏంట్రా,పడుకోనీవా...?"విసుగ్గా అంటున్న నన్ను గట్టిగా హత్తుకున్నాడు వాడు.
నాకేం అర్ధంకాక చూస్తుంటే....నన్ను వదిలి..
"నీ ఇంటర్వ్యూ టైం అయిపోలేదురా...ఇదిగో లెటర్."అని చూపించాడు.
గబుక్కున లెటర్ లాక్కుని....చదివిన నాకు ఒక పక్క ఆనందం....మరో పక్క చిన్నపాటి భయం మొదలయింది.
నన్ను చూస్తూ ఉన్న అనీల్ ని చూసి.."ఎక్కడ దొరికిందిరా లెటర్?"అని అడిగా.
"లోపల రూంలో అటక మీద కొన్ని బాక్సులు ఉన్నాయ్.అన్ని దించి వెతికా....దొరికింది."
"అంటే నువ్వు పడుకోకుండా చేసిన పని ఇదా?"
"హ్మ్....నువ్వు ఓడిపోకూడదు శీను.నావల్ల ప్రేమలో ఓడిపోయావ్....జీవితంలో ఓడిపోతే,నన్ను నేను క్షమించుకోలేనురా."అంటూ నా ఎడమ కాలు పట్టుకున్నాడు.
వాడు ఎంతలా కుమిలిపోతున్నాడో అర్ధం అవుతోంది.నిజానికి వాడి తప్పు ఎంత మాత్రము లేదు.....కానీ తన వల్లే జరిగింది అని బాధపడుతున్నాడు.
తొడబుట్టిన వారి మధ్య ఎంత అనుబంధం ఉంటుందో కానీ.....మా మధ్య అంతకు మించిన ప్రేమనుబంధం ఏర్పడింది.
@@@@@@
"గుడ్ శీను.చూశావా....దేవుడు నీకోసం...ఒక దారి చూపించాడు."
అమ్మ ఇచ్చిన దోసెలు తింటూ...నవ్వుతూ అంటున్న హాసినాని చూసి నేను నవ్వాను.
"కానీ కొంచెం భయంగా ఉంది.ఇంటర్వ్యూ ఎల్లుండే."
"హా అయితే ఏంటి."
"ఇంత తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలా అని ఆలోచిస్తున్నాడు హసి."అంటున్నాడు అనీల్.
"శీను...ఇలా భయపడితే ఏది సాధించలేవ్.ముందు కాన్ఫిడెంట్ గా ఉండాలి.సరైన సమాధానాలు ఇచ్చామా....లేదా అనేది తరువాత విషయం.అయినా...రెండు నెలలకే అన్ని మర్చిపోవుగా."
"ఎల్లుండి కదా....ఈరోజు,రేపు ఉంది.మెయిన్ పాయింట్స్ చూసుకో....కాన్ఫిడెంట్ గా ఉండు.నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావ్.నిన్ను నువ్వు నమ్ము శీను."అని ప్లేట్ కిచెన్ లో పెట్టడానికి వెళ్ళింది హసీనా
"రేయ్ అనీల్.హసీనా ఇలా మాట్లాడి ఎన్నాలైందిరా.ఈమధ్య మూడీగా ఉంటోంది అని ఎన్నిసార్లు అనుకున్నానో."ఆశ్చర్యంగా,ఆనందంగా అంది సింధు.
"హ సింధు.మనం ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడినా.....తన మాటలతో బాగా మోటివేట్ చేస్తుంది.మళ్ళీ పాత హసినాని చూస్తున్నట్టు ఉంది.హసీనా ఇస్ బ్యాక్."అన్నాడు అనీల్.
రెండు రోజులు మరో పని పెట్టుకోకుండా చదివాను.
అనీల్,సింధు సాయంతో....ఇంటర్వ్యూ కి ప్రిపేరయ్యాను.
ఆరోజు రానే వచ్చింది.అమ్మ కంగారు....నాచేత పూజచేయించింది.పిన్ని పెరుగులో చెక్కర వేసి తినిపించింది.
ఉదయమే వచ్చిన హసీనా,సింధు అల్ థి బెస్ట్ చెప్తే...
అనీల్ నన్ను ఇంటర్వ్యూ కి తీసుకెళ్లాడు.
కొంత బేరుకుగానే ఉన్నా....అది బైటికి కనిపించనీకుండా,చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు...నటించాను.
నా పేరు పిలవగానే వెళ్లి...వాళ్ళు అడిగిన వాటికి, నాకు తెలిసిన సమాధానాలు ఇచ్చి...వారు వెయిట్ చేయమనడంతో బైటికి వచ్చి కూర్చున్నాను.
గంట తరువాత....దేవుడు ఉన్నాడు అనిపించేలా....నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు.
నోటమాటరాలేదు నాకు....చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను.ఇది నా కష్టానికి ఫలితమా,లేక.....అనీల్ తాపత్రయానికి దక్కిన అవకాశమా....లేక అమ్మ మొక్కుల ఫలమా...
ఏది ఏమైనా....నేను అనుకున్నది సాధించాను.మధ్యలో కొన్ని ఆటుపోట్లు ఎదురైన....అలసిపోతున్నా,మధ్యలో ఆపకుండా.....అన్నిటిని తట్టుకుని ఎదురీదాలని.... అప్పుడే ఒడ్డుకు చేరగలమని అర్ధమైంది నాకు.
@@@@@@
కొన్నిరోజుల ట్రైనింగ్ తరువాత....నాకు sbi లో జాబ్ వచ్చింది.అదీ భువనేశ్వర్ లో.....అంత దూరమా అని అమ్మ కంగారు పడుతుంటే....నాన్న సర్దిచెప్తున్నాడు.
నా గాయాలు పూర్తిగా మానిపోయాయి.ఎక్కడా నొప్పి కూడా లేదు.కానీ నడిచెప్పుడే ఇబ్బంది....ఎడమ వైపు కొద్దిగా వొంగి నడవాలి.
రేపు సాయంత్రం ప్రయాణం అనగా....ఇంటికి వచ్చింది హసీనా.అనీల్,సింధు షాపింగ్ కి వెళ్లారు.నాకోసం ఏవో కొనుకోస్తాం అని.
హసీనా గుడికి వెళ్దామ్ అంటే.....ఇద్దరం వెళ్లి దర్శనం చేసుకుని.....పక్కన ఉన్న పార్క్ లో కూర్చున్నాం.
"శీను...ఇది...నికోసం చిన్న గిఫ్ట్."అని ఒక బాక్స్ ఇచ్చింది.
"ఏంటిది?"
"తీసి చూడు."
ఓపెన్ చేస్తే అందులో షూ ఉంది.థాంక్యూ హసి.అని మళ్ళీ లోపల పెట్టేస్తుంటే.....ఒకసారి వేసుకోమని అనేసరికి...వేసుకున్నాను.
ఎందుకో ఎడమ వైపుది కొంచెం బరువుగా అనిపించింది.
"సైజ్ సరిపోయిందా.ఏది ఒకసారి నడువ్."అంది నా కాళ్ళ వంకే చూస్తూ.
లేచి నిలబడ్డాను.కొత్తగా అనిపించింది మొదట.అడుగు ముందుకు వేయగానే తేడా తెలిసింది.నేను నడిచేప్పుడు....వొంగలేదు.నిటారుగానే ఉన్నాను...అర్ధం కాలేదు నాకు.
ప్రశ్నార్థకంగా చూస్తున్న నన్ను ఉద్దేశించి...."నువ్వు ఇబ్బంది పడుతున్నావ్ అని.నీకోసం ప్రత్యేకంగా చేయించాను."అంది హసీనా.
ఇంట్లో వారి ముందు ఎం అనిపించలేదుగాని.మొన్న ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు..అక్కడ అందరూ నన్ను వింతగా,పట్టి పట్టి చూస్తుంటే...ఇబ్బందిగా అనిపించింది.
థాంక్యూ అనేది ఎంత చిన్న పదం.ఎందుకు వీళ్ళందరు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు.పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను...అందుకే ఈ జన్మలో ఇంత మంది ఆదరణ పొందుతున్న అనిపించింది.
వచ్చి బెంచ్ పైన కూర్చుని..షూ బాక్స్ లో పెడుతుంటే...
"సైజ్ కరెక్టుగానే ఉందిగా శీను.లూస్ అవ్వలేదుగా?"అని అడిగింది.
"లేదు పర్ఫెక్ట్ గా ఉంది."అన్నాను తనని చూడకుండానే.
తను గొంతు సవరించుకుని.."శీను,నీతో ఒక విషయం చెప్పాలి?"అంది కొంత బేరుగ్గా.
"అంకిత పెళ్లి విషయమా?"చాలా నార్మల్ గా అడుగుతుంటే,ఆశ్చర్యంగా చూస్తోంది తను.
"నీకెలా తెలుసు..అంకిత పెళ్లి గురించి?"
"నువ్వు సింధు మాట్లాడుకోవడం విన్నాను."
"తెలిసి ఇంత నార్మల్ గా ఎలా ఉన్నావ్ శీను?"
చిన్నగా నవ్వుతూ...."ఇంకేం చేయమంటావ్.గడ్డం పెంచుకుని,ఒకసారీ తాగి కాళ్ళు విరగొట్టుకున్నా బుద్దిరాకా.....మళ్ళీ మందుకొడుతూ,అంకితని తలుచుకుని బాధపడుతూ...అమ్మ వాళ్ళని కూడా బాధపెట్టమంటావా?"అన్నాను.
"ప్రేమించావ్ కదా.అంత తేలిగ్గా మర్చిపోయావా?"
"హ్మ్... ప్రేమించాను.అందుకే...మర్చిపోలేను.జీవితాంతం తన జ్ఞాపకాలు....నా మనసులో పదిలంగా ఉంటాయ్.ఒక ప్రేమ దక్కలేదని.....కన్న ప్రేమని తక్కువ చేసి,వారికి మనఃశాంతిని దూరం చేయడం కరెక్ట్ కాదుగా హసి."
"పైగా ఇప్పుడు అంకిత మరొకరి భార్య.తన గురించి అలా ఆలోచించడం కూడా తప్పే.నాకోసం ప్రాణాలు తీసుకోవాలని చూసింది.తనకేమైన అయ్యుంటే....నేనూ...."
ఆగిపోయాను,మాటలు రాలేదు..."తను ఎక్కడున్న,ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకుంటా."
"అంకిత....నా గతం.తొలిప్రేమని ఎవరు మర్చిపోలేరు హసినా.అది మధురమైన,మరలిరాని....తీపి జ్ఞాపకంగా హృదయాంతరాల్లో నిలిచి ఉంటుంది.కానీ వర్తమానం,భవిష్యత్తు మన చేతిలోనే ఉంటాయ్.దాన్ని మనమే మలుచుకోవాలి...అది ఎలా అనేది కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది."
అలా హసినకి చెప్తున్నానా...లేక నాకే చెప్పుకుంటున్నానా....ఏ దేవుడికే ఎరుక.
"అంటే లైఫ్ లో మూవ్ ఆన్ అవుతా అంటున్నావా?జాబ్ వచ్చింది,అమ్మ వాళ్లు హ్యాపీ.తొందర్లో....మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అవుతావ్ అన్నమాట.గుడ్ శీను."
హసీనా అలా నవ్వుతూ అంటూ ఉంటే....మనసుకి కష్టంగా అనిపించింది.చెప్పడం తేలిక...ఆచరించడం ఎంత కష్టమో కదా అనిపించింది.
నన్ను చూసి..."ఏమైంది శీను?"అంది.
"ఆ ఒక్క పని మాత్రం నేను చేయలేను హసి."
"అంటే?"
"బైట షూ వేసుకుతిరినట్టు...ఇంట్లోనూ తిరగలేను కదా."
నేను అన్నది విని కాసేపు సైలెంట్గా ఉండిపోయింది హసీనా.
"లోపం అనేది దేహానికి కానీ మనసుకి ఉండదుగా శీను.నీ ఆలోచన తప్పేమో."
"ఏ ఆడపిళ్ళైనా తన భర్త గురించి నలుగురిలో గొప్పగా చెప్పుకుని..వాళ్ళు మెచ్చుకుంటు ఉంటే గర్వపడలని అనుకుంటుంది.ఆ ఆశ నావల్ల ఏ అమ్మాయికి తీరదు."
"అంటే ఒంటరిగానే ఉండిపోతావా ఎప్పటికి?"
"హ్మ్..."
"నిన్ను అర్ధం చేసుకుని,నిన్ను నిన్నుగా స్వీకరించే అమ్మాయి దొరికితే..?"
"అలాంటి అమ్మాయిలు ఉంటారంటావా.అయినా నాకంత ఆశ లేదులే హసి."నవ్వేసా..నవ్వు రాకపోయినా.
"నువ్వు నిజంగా అంటున్నావా లేక అంకితని మర్చిపోలేకా ఇలా,లో...లోపాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడుతున్నావా శీను."
తన సూటి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు.నేను నా లోపాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడితే.....నన్ను నేను తక్కువ చేసుకున్నట్టే.అదే అంకిత ని దృష్టిలో పెట్టుకునా అంటే...నా సంస్కారాన్ని నేనే వదులుకున్నట్టు.
"శీను...లైఫ్ ఎప్పుడు ఒకరితోనే మొదలవ్వదు.ఒకరితోనే అంతం అవ్వదు.జీవితం చాలా చిన్నది శీను.మన జీవితప్రయాణంలో...ఎంతో మంది మనకు తారసపడుతూ ఉంటారు.కొందరు మనతో పాటే ఉంటే....కొందరు మధ్యలోనే వెళ్లిపోతారు."
"వెళ్లిపోయిన వారి గురించి....ఆలోచిస్తూ ఆగిపోకూడదు.అలా ఆగిపోతే మనతో ఉన్న వాళ్ళు కూడా ఆగిపోతారు.అంకితకి మర్చిపోవడం కష్టమే.....కానీ అసాధ్యం అయితే కాదుగా."
"ఇందాక నువ్వే అన్నావ్...ప్రేమ కోసం కన్నవాళ్ళని బాధపెట్టాలేను అని.ఆ మాట నిజంగా నీ గుండెల నుండే వచ్చినటైతే....ఆలోచించు."
ఎం ఆలోచించను.ఏ అమ్మాయ్ నాలాంటి కుంటికులాసంని భర్తగా కోరుకుంటుంది.జీవితాంతం నా బరువు మోయలనుకునే పిల్ల కచ్చితంగా పిచ్చిదే అవుతుంది.
లేదు...నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది.పెళ్లి అనే ఆలోచన చేసి....ఒక ఆడపిల్లని కష్టపెట్టలేను.ఈ జన్మకి పెళ్లి చేసుకునే యోగంలేదు.ఇది అమ్మ వాళ్ళకి కష్టగానే ఉంటుంది.కానీ తప్పదు.ఎవరెన్ని చెప్పినా సరే నా నిర్ణయంలో మార్పు రాదు....రానివ్వను.
"ఓయ్ శీను.ఏంటి ఆలోచించు అంటే....ఎక్కడికో వెళ్లిపోయావ్."అంటూ నవ్వుతూ హసీనా పిలిచేసరికి...ఆలోచనల నుండి తేరుకుని చూసాను తనని.
"ఎంలేదు హసీనా.అవునూ నువ్వెంటి వచ్చి ఇన్నిరోజులైంది.....ఎప్పుడు వెళ్తావ్ చెన్నై కి."
"రేపే శీను.నువ్వో వైపు....నేనో వైపు ప్రయాణం చేయాలి.పదా వెళ్దామ్...లేట్ అయ్యింది."
నన్ను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయింది హసీనా.
@@@@@@@
సింధు,అనీల్ నాకోసం ఏవేవో తెచ్చారు షాపింగ్ చేసి.వారి అభిమానానికి విలువకట్టగలనా అనిపించింది.
ఆ రాత్రే అమ్మ నాకోసం నిద్ర మాని....ఏవో పిండి వంటలు సిద్ధం చేసింది.సింధు చాలావరకు నా ప్యాక్కింగ్ పూర్తిచేసింది.
భువనేశ్వర్ బ్రాంచ్ లో ఎవరో తెలుగు వారు ఉన్నారని తెలిసి.....వారికి కాల్ చేసి మాట్లాడాను.తానూ బ్యాచ్లర్ నని,అభ్యంతరం లేకపోతే తనతో రూమ్ షేర్ చేసుకోవచ్చని అనడంతో ఒప్పుకున్నాను.
నాగురించి తెలిసి స్టేషన్ కి వస్తా....అని అన్నాడు అతను.దాంతో ఒంటరిగా వెళ్తున్నా,అక్కడ ఎలా మ్యానేజ్ చేస్తానో అని అమ్మ బెంగ తీరింది.
అదే విషయం ఇంట్లో వాళ్లకి చెప్పి....సింధుకి ఇంకా కొన్ని వస్తువులు బ్యాగ్ లో పెట్టమని ఇస్తూ ఉంటే వచ్చాడు నాన్న.
"అయ్యా."
"హ నాన్న."
"పన్లో ఉండావా?"
"లేదు నాన్న చెప్పు."అనగానే కూర్చున్నాడు బెడ్ మీద.
నాన్న అదోలా ఉండటం చూసి....నాతో ఏదో మాట్లాడాలనో,లేక అడగాలనో సంశయిస్తున్నాడని అర్థమై....సింధుని బైటికి వెళ్ళమని సైగ చేసాను.
"ఏంటి నాన్న.ఏదైనా చెప్పాలా?"
"లేదయ్య."అంటున్నాడేగాని ఏదో ఉందని తెలుస్తోంది.
"ఏంటి నాన్న.దూరం వెళ్తున్నాను.మళ్ళీ తాగి ప్రాణం మీదికి తెచ్చుకుంటానేమో అని అనుమానమా."
"అయ్యా.అదేం మాటల్రా.నా బిడ్డ ఎప్పుడు తప్పు జేయాడు.నాకా నమ్మకం ఉండాది."
"చేసాను కదా నాన్న."
"ఒకసారి తప్పు జేసినా....దాన్ని నుండి పాఠం నేర్చుకునే తెలివి,గుణం నీకుండాదయ్యా."
నాన్న నామీద పెంచుకున్న నమ్మకం ఎంత..... నేను నేర్చుకున్న పాఠం ఎంత.
"నాతో ఏమైనా చెప్పాలా నాన్న?"
"హ్మ్.ఈడా ఎన్ని దినాలు ఉంటాం.ఊరెళ్ళి పోదాం అనుకుంటున్నాం."
"అక్కడ ఎం చేస్తారు నాన్న?"అని నేను అంటుండగానే బాబాయ్ వచ్చాడు.
"ఎందుకు ఊరికి.ఇక్కడేం అయ్యింది?"అంటూ.
"అది కాదు మూర్తి.ఈడేం తోచడంలేదు.ఎప్పుడు పొలం గట్లేమ్బడి తిరిగేటోడిని.కష్టపెడేటోడిని కదా.అది కాకుండా ఊరిని ఇడిచి ఉండ బుద్ది కావట్లేదు.అందుకే...."
నాన్న చెప్తున్నా కారణాలు ఒక పక్క సబాబుగా అనిపిస్తున్నా....ఆయన మనసులో ఇంకేదో విషయం ఉందని అర్ధం అయింది.అది ఎంటో కూడా తెలుస్తోంది.
నాన్న కష్టజీవి.మట్టి మనిషి.చిన్నతనం నుండి సేద్యంలోనే ఉన్న మనిషి.ఒకరి కింద పనిచేయడం తెలియని మనిషి.ఒకరి సాయం కోసం ఎదురు చూడని మనిషి.
ఇప్పుడు ఇలా బాబాయ్ మీద ఆధారపడటం చిన్నతనంగానో....లేదా ఆయనకి భారం అవుతున్నాం అన్న భావంతోనో నాన్న ఇలా మాట్లాడుతున్నాడు.
బాబాయ్ కి అర్ధం అయ్యింది.నాన్న ఆత్మభిమానంగల వ్యక్తి అని తెలిసి....ఎం మాట్లాడలేకా కాంగా ఉన్నాడు.
ఇప్పుడీ పరిస్థితికి కారణం నేను.పొలం ఉంటే....దిగుబడి వచ్చినా రాకపోయినా...నాన్న తృప్తిగా అదే ఊళ్ళో,చేతి నిండా పనితో ఉండేవాడు.నాన్నని చూస్తుంటే....నేను చేసిన పని తలుచుకుని సిగ్గుతో చచ్చిపోయాను.
"నాన్నా..."అంటూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను.
"నేను తప్పు చేసినా....ఎవరు ఏమి అనలేదు నన్ను.ఎందుకు నాన్న?కనీసం క్షమించమని అడగలేదు నేను.మొహం చెల్లక."
"బాబాయ్.....మీ అందరి నమ్మకాన్ని,అభిమానాన్ని పోగొట్టుకున్నాను.నన్ను....నన్ను క్షమించండి బాబాయ్."
ఇద్దరి కాళ్ళు పట్టుకున్నాను....ఏడుస్తూ...
నన్ను దహించివేస్తున్న అపరాధ భావాన్ని.....తొలగించుకుని,మళ్ళీ వారి అభిమానాన్ని పొందాలనే ఆరాటం నాలో.
"రేయ్ శీను.ఊరుకోరా.తప్పు చేయని మనిషి ఉండడురా.ఏదో అలా జరిగిపోయింది.వదిలేయ్.జరిగింది తలుచుకుని బాధపడటం వల్ల ప్రయోజణం లేదు.నువ్వు గొప్పోడివి కావలనేది నా కోరిక.అవుతావ్....కచ్చితంగా అవుతావ్."
"అప్పుడు నా కొడుకు అని నేను గర్వంగా అందరికి చెప్పుకుంటా.ఎం సూరి.వీడు నా కొడుకు....ఇప్పుడే చెప్తున్నా."
"ఆ....హ...నీ కొడుకేలే.ఎవరు కాదన్నది."అని నవ్వాడు నాన్న.
మా మాటలు,మా నవ్వులు విన్న ఇంట్లోని వాళ్ళు నవ్వుకున్నారు.
కొండంత భారం తల నుండి దిగినంత హాయిగా అనిపించింది.చాలా తేలికగా ఉంది మనసు.క్షమించమని అడగడంతోనే మన పని పూర్తవదు....మన ప్రవర్తన మార్చుకుని....మళ్ళీ ఆ తప్పు చేయము అని ఎదుటివారికి నమ్మకం కలిగించాలి.
ఆ నమ్మకం నాపై వీరందరికి ఉన్నందుకు.....ఆ నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకోడానికి....నేను ఎప్పుడు అలెర్ట్ ఉండాలి.
@@@@@
మరుసటిరోజు సాయంత్రం స్టేషన్ కి చేరుకున్నాం.హసీనా కూడా వచ్చింది.....తన ట్రైన్ అరగంట తరువాత ఉంది.
అందరికి వీడ్కోలు చెప్పి ట్రైన ఎక్కాను.కనుచూపుమేర నా వాళ్ళు కనిపిస్తున్నంతసేపు డోర్ దగ్గర ఉండి....వెళ్లి నా బెర్త్ లో కూర్చున్నాను.
ఆలోచనలు.....ఎన్నిచేసినా.....జరిగింది మార్చలేం..... జరగబోయేది తెలుసుకోలేం.
ఊరిలో ఉన్నవాడిని.....సిటీకి వచ్చాను.....అక్కడ ఉన్న వాడిని...ఈరోజు రాష్ట్రం దాటి,నా వాళ్ళని వదిలి దూరంగా వెళుతున్నాను.
ఒకసారి గత స్పృతులను నెమరవేసుకున్నాను ....నా బాల్యం,ఊరు.....చదువుకున్న బడి.మొదటిసారి చింతచెట్టు ఎక్కి....కిందపడి దెబ్బతగిలించుకున్నప్పుడు అమ్మ పెట్టుకున్న కన్నీరు.
పొలం పనులు చేసి....కందిన చేతులతో అన్నం తినలేక అవస్థాపడుతున్న నాన్నకి....నా చిట్టిచేతులతో బువ్వా పెడుతుంటే.....ఎప్పటికి తినాలిరా....అని నాన్న నవ్విన నవ్వు.
నాకొడుకుగా పెంచుతా బాగా చదివిస్తా అని నాన్నని....ఎంతో బ్రతిమాలిన బాబాయ్.నన్ను సొంత అన్నల ఆదరించిన సింధు,అనీల్.
స్నేహితులు.....కొందరు నన్ను ప్రోత్సహించినవారు.మరికొందరు నన్ను తక్కువ చేసినవారు.కొందరు అర్థం చేసుకుని ప్రేమ....ప్రేమ పంచినవారు.
మేడం....మేడం లేకుంటే ఈ ప్రయణమే లేదు.ఆవిడ లేకుంటే నాకు భవిష్యత్తే లేదు.ఆరోజు కోపంగా వెళ్లిపోయారు మేడం.మళ్ళీ నేను ఫోన్ కూడా చేయలేదు.ఆవిడకి చెప్పాలి.....అని ఫోన్ చేసాను,రింగ్ అవుతోందిగాని ఎత్తడంలేదు.
నామీద ఇంకా కోపం తగ్గలేదని....నా జాబ్ విషయం అంత మెసేజ్ చేసాను.చూసిందిగాని...రిప్లై ఇవ్వలేదు.సరేలే ఇవ్వకపోయినా పర్లేదు....ఒకసారి తప్పు చేశాను.ఇకపై చేయను అని ఆవిడకి నమ్మకం కలిగితే చాలు అనుకుని.....మళ్ళీ మేడంని డిస్టర్బ్ చేయలేదు.
జాబ్ లో జాయిన్ అయ్యాను.బ్రాంచ్ లో మంచి పేరు తెచ్చుకున్నాను.ఏ పని చేసినా వందశాతం న్యాయం చేయాలన్న మేడం మాటలు నామీద చాలా గట్టి ప్రభావమే చూపాయ్.
అందరితో కలిసిపోయాను నేను.నా ఓపిక,సహనం కూడా అందరికన్నా ఒక అడుగు ముందు నిలబెట్టాయ్ నన్ను.
చూస్తూ ఉండగానే కాలచక్రం ఒక ఏడాది ముందుకు వెళ్ళింది.
ఈ ఏడాది కాలంలో నాకు తారసపడిన వ్యక్తులు,నేను ఎదుర్కొన్న పరిస్థితులు.....అన్ని నన్ను మానసికంగా మరింత దృడంగా మార్చాయి.
సింధూకి కొడుకు పుట్టాడు.పుట్టినప్పుడు వెళ్లలేకపోయాను.ఐదో నెలలో నామకరణం చేస్తుంటే..... నా మేనల్లుడిని చూడటానికి సంవత్సరం తరువాత మళ్ళీ హైదరాబాద్ కి బయల్దేరాను.
చాలా రోజుల తరువాత అందరిని చూసిన ఆనందంలో నేను.నన్ను చూసిన సంతోషంలో వాళ్ళు.
బాబుకి మేనమామగా నా లాంఛనాలు అందించాను.మొదటిసారి మా బావగారిని చూసాను.
ఫంక్షన్ కి హసీనా,మేఘన కూడా వచ్చారు.అందరం మళ్ళీ కలవడంతో మా మాటలకు హద్దులేకుండాపోయింది.
బాగా పొద్దుపోవడంతో....."హసి వెళదామా.లేట్ అయ్యింది."అని లేచింది మేఘా.
"నువ్వు వెళ్లిపో మేఘా.నాన్న వస్తానన్నారు."
"ఓకే అయితే.బాయ్.శీను ఉంటావుగా?"అడిగింది నన్ను చూసి.
"హ....త్రి డేస్ ఉంటాను."
"సరే నీకు తరువాత కాల్ చేస్తా.బాయ్ ఎవరీ వన్."అని వెళ్ళిపోయింది మేఘా.
హసీనా లేచి సింధు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే...అనీల్ ఆత్రంగా నా దగ్గరికి చైర్ లాక్కుని..
"ఏంట్రా మేఘా తరువాత కాల్ చేస్తా అని ప్రత్యేకంగా చెప్పి వెళ్ళింది."
"ఇందులో అంత ప్రత్యేకం ఎం కనిపించింది నీకు.నార్మల్ గానే అందిగా."
"అబ్బా చా...నేను ఇక్కడే ఉన్నా కదా.మరి నాతో అనలేదే."
"ఏంట్రా నీ నస."విసుగ్గా అన్నా.
"నస కాదురా.....మేఘాకి ఏమైనా నీ మీదా..."
"ఆపేయ్...ఆపేయ్ ఇంక.అది నోరా ఇంకేమైనానా.కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవరా."అని తిట్టి వెళ్ళాను.
అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా హసీనా పక్కన కూర్చున్నాను.
"ఏంటి శీను ఫేస్ అలా పెట్టావ్ ఏమైంది?"
"ఎం లేదు హసి."
తన ఫోన్ రింగ్ అవ్వడంతో చూసి...."ఓకే నాన్న వచ్చారు.నేను బయల్దేరతాను."అని అందరికి చెప్పి వెళ్తున్నా హసీనా వెనక నేను బైటకి వెళ్తుంటే పిలిచాడు బాబాయ్.
ఆయనతో మాట్లాడుతూనే వెళ్తున్నా హాసినాని చూస్తూ ఉన్న నాకు....అప్పుడే కార్ రివర్స్ చేస్తున్న వాళ్ళ నాన్న కనికనిపించకుండా కనిపించారు.
ఆయన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది.అక్కడ కాస్త చీకటిగా ఉండటంతో ఆయన మొహం సరిగ్గా కనిపించలేదు నాకు.కానీ బాగా తెలిసిన మనిషిలా అనిపించారు.
ఫంక్షన్ హాల్ నుండి అందరం ఇంటికి చేరుకున్నాం.
"అయ్యా...ఇంకో ఇడ్లి ఏసుకో."అని రెండు ఇడ్లీలు ప్లేట్ లో వడ్డించింది అమ్మ.
"అబ్బా అమ్మ.ఎంత తినను.కడుపులో ఖాళీ లేదే బాబు."
"తిన్నారా అయ్యా.ఎట్టా సిక్కిపోయినావో సూడు."
"అమ్మ నేను బాగానే ఉన్నాను.తల్లి కంటికి బిడ్డ ఎప్పుడు చిక్కిపోయినట్టే కనిపిస్తాడు."
అమ్మ నా పక్కన కూర్చుని నా తల నిమురుతూ..
"అయ్యా.ఓ ఇశయం జెబుతా.కోప్పడవుగా."
"అదేంటమ్మా ఎందుకు కోప్పడతా.ఎంటో చెప్పు."
"మనుళ్ళో రమానాథం అన్నయ్య లేడూ."
"లేడా....ఎలా పోయాడు."
"అబ్బా అది గాదురా.ఆయానకేంటి దుక్కల ఉంటేనీ.సెప్పేది ఇను ముందర."
"హ చెప్పు."
"ఆయన ఆ మజ్య ఫోన్ జెసాండ్రా.వోళ్ళ పాపని నీకు ఇస్తానని అన్నాడు.ఉన్నది ఒకే బిడ్డ కదా వోళ్ళకి.రేపు ఉన్నదంతా మీకే కదా.ఏమంటావ్...సరే అని జెప్పేయమా."
అమ్మ మాటలు విని ప్లేట్ లో ఇంకో ఇడ్లీ ఉండగానే చెయ్ కడుక్కుని గదిలోకి వెళ్ళిపోయాను.
ఈ విషయం అందరూ ముందుగా మాట్లాడుకుని ఉన్నట్టున్నారు.బైట హాల్ లో ఎవరు నోరు తెరవలేదు.
"రేయ్ శీను ఏంట్రా అలా వచ్చేశావ్.పెద్దమ్మ అడుగుతోందిగా ఎంటో చెప్పు."అన్నాడు అనీల్ నా వెనకే వచ్చి.
"సరే నీకు చెప్తా విను.నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.ఎప్పటికి....నాకు ఇలాగే బాగుంది."అసహనంగా అన్నాను.
"ఎందుకురా.....ఇంకా అంకితకి మర్చిపోలేదా.రేయ్....తనకి పెళ్లైంది,పిల్లలు కూడా ట్విన్స్...తను హ్యాపీగా ఉంది అన్ని మర్చిపోయ్. కానీ నువ్వు మాత్రం ఇంకా తననే తలుచుకుంటూ...ఎంతకాలమిలా."
"అంకిత గురించి కాదు..."అరిచా కొంచెం గట్టిగా.
"మరింకేంటి నీ ప్రాబ్లెమ్?"
ఆ డిస్కషన్ చాలా ఇర్రిటేటింగ్ గా ఉంది నాకు...వాడి ప్రశ్నకి...చేతిలోని ఫోన్ ని విసిరికొట్టి...కాలు చూపిస్తూ..
"ఇదీ..ఇదీ..నా ప్రాబ్లెమ్ చాలా."అని చాలా గట్టిగా అరిచి....బయటకి వెళ్ళిపోయాను.
బైక్ లో ఎంత దూరం వెళ్తున్నానో...అసలెక్కడికి వెళ్తున్నానో...నాకే అర్థం కాలేదు.మధ్యలో పెట్రోల్ పట్టించుకున్న......తిరిగి,తిరిగి....గుడికి వెళ్లి కూర్చున్నా....చీకటి పడుతోంది.చాలాసేపు అక్కడే ఉండిపోయా.
ఎనిమిదవుతుండగా...లేచి...నేరుగా మొబైల్ షాప్ కి వెళ్లి కొత్త ఫోన్,కొత్త సిమ్ కొన్నాను.నేను కోపంలో విసిరిన ఫోన్ అనీల్ ఇచ్చిందే.....దానికి బాధగా ఉంది నాకు.నేను వాడిన మొదటి ఫోన్ అది....
ఇంటికి వెళ్లి ఎవరితో ఎం మాట్లాడకుండా....కాంగా గదిలో పడుకున్నాను.
"ఏరా రేపు కదా వెళ్తా అన్నావ్?మరి ఈరోజే బయల్దేరుతున్నావ్?"
"పని ఉంది వెళ్ళాలి."బ్యాగ్ సర్దుతూనే అనీల్ కి జవాబు ఇచ్చాను.
"శీను.... ఏంట్రా ఇది.ఇప్పుడేమైందని?నువ్విలా చేయడం బాలేదుర.పెద్దమ్మ నిన్నంతా ఏడుస్తూనే ఉంది.నీకు ఇంత కోపం ఎప్పటినుండి వచ్చిందిరా.కనీసం అమ్మతో మాట్లాడను కూడా లేదు."
అమ్మని తలుచుకోగానే బాధగా అనిపించి కూర్చున్నా......
"శీను నీ గురించే కదరా చెప్పేది.ఎందుకురా ఇంత పంతం."
"పంతం కాదురా.ఈ జన్మకి నాకు రాసిపెట్టి లేదు అంతే."
"అలా ఎందుకనుకుంటున్నావ్?"
"రేయ్....నిన్న నేను విసిరిన ఫోన్ టచ్ పనిచేయడంలేదు.రిపేర్ చేయిస్తే పనిచేస్తుంది.....కానీ డిఫెక్టీవ్ పీస్ ఏ కదరా.దాని విలువ తగ్గుతుందిగా.కొత్త ఫోన్ పై చూపించినంత శ్రద్ధ.....పగిలిన ఆ ఫోన్ మీద చూపించలేం.నేను అంతేరా."
"శీను....నిజం చెప్పు.నిజంగానే దాని విలువ తగ్గిందా నీ దృష్టిలో.మరి ఎందుకురా దాన్ని జాగర్తగా కప్ బోర్డ్ లో పెట్టుకున్నావ్."
మాట్లాడలేదు నేను...మళ్ళీ వాడే...
"పోనీ నేను చెప్పనా....ఎందుకంటే అది నేను నీకు ఇచ్చిన ఫోన్ అని,నువ్వు వాడిన మొదటి ఫోన్ అని....నా మీద అభిమానంతో,దాని మీద ఉన్న ఇష్టంతో జాగర్త చేశావ్."
"దేని విలువ దానికి ఉంటుంది శీను.అది మనం చూసే దాని బట్టి ఉంటుంది.నువ్వు కూడా అంతే.నిన్ను నువ్వు తక్కువ చేసుకోకురా.నిన్ను ఇష్టపడే అమ్మాయిని.....తప్పకుండా ఆ దేవుడు చూపిస్తాడు.నా మాట వినరా."
"ప్లీస్ అనీల్.నన్ను బలవంతం చేయకండి.మీరు ఇలాగే మాట్లాడితే అసలు ఇక్కడికి రానేరాను."
"ఏంట్రా బెదిరిస్తున్నావా.కొత్త ఫోన్ కొన్నావ్ బానే ఉంది కొత్త సిమ్ ఎందుకురా.అంటే కనీసం మాతో కాంటాక్ట్ కూడా వద్దనుకున్నావా.బాగుందిరా....చాలా బాగుంది.సరే కానీ....ఎం చేస్తావో చెయ్."అని తిట్టి వెళ్ళాడు.
నేను తిరిగి భువనేశ్వర్ వెళ్ళిపోయాను.నా కొత్త కాంటాక్ట్ ఇంట్లో వాళ్ళకి....బ్యాంక్ లో వాళ్ళకి తప్ప ఎవరికి ఇవ్వలేదు.
జాబ్ చేసుకుంటూనే ఎం.సి.ఏ చేయాలనుకున్న నేను....ఇప్పుడు బ్యాంక్ లోనే హైయెర్ పోస్ట్ కి వెళ్ళడానికి ఎం చేయాలో అది చేసే పనిలో పడ్డా.
క్షణం తీరిక కూడా ఉండకుండా...ప్రతిక్షణం నన్ను నేను బిజీగా ఉంచుకుంటు...గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను.
కాలచక్రం ఈసారీ ఐదేళ్లు ముందుకు వెళ్ళింది.ఇప్పుడు నేను బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ ని.....భువనేశ్వర్ నుండి మరో బ్రాంచ్ లో పని చేసి....అక్కడి నుండి అరకు బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను.
అక్కడ గిరిజన తెగతో మమేకమై.....అడవిలో,వన్యప్రాణులతో చాలా ప్రశాంత వాతావరణంలో.....జీవితం అంతకన్నా ప్రశాంతంగా సాగిపోతోంది.
పగలంతా పనిలో పడి.....ఎం తెలియకపోయినా.రాత్రి ఇంటికి చేరుకోగానే మనసుని ఒంటరితనం...శూన్యంలోకి నెట్టేస్తోంది.
ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా హైదరాబాద్ వెళ్లలేదు.అమ్మ వాళ్ళు రెండు మూడు సార్లు వచ్చి వారం ఉండి వెళ్లేవారు.అలా వచ్చిన ప్రతిసారి పెళ్లి గురించి ఏదో ఒక గొడవ.
దాంతో అరకు కు వచ్చాకా మళ్ళీ అమ్మ వాళ్ళని ఇక్కడికి రానివ్వలేదు.అసలిప్పుడు నేను ఎక్కడ ఉంటున్నానో కూడా సరిగ్గా అమ్మ వాళ్లకి తెలియదు.అనీల్ కి తెలిసినా.....వాడి ఉద్యోగరీత్యా రాలేకపోయాడు.
కానీ ఒకరోజు....బ్యాంక్ నుండి ఇంటికి వచ్చేసరికి బైట మెట్ల మీద కూర్చొని ఉన్నాడు అనీల్.
చాలాకాలం తరువాత కలిసాం కదా.....ఎన్నో కబుర్లు మా మధ్య.
"ఏంట్రా సడెన్గా...అదీ చెప్పకుండా వచ్చేశావ్?"
"నా పెళ్ళిరా."అని పత్రిక ఇచ్చాడు.
చాలా సంతోషన్గా అనిపించింది.వాడిని గట్టిగా హత్తుకున్నాను.పత్రిక చూసి షాక్ అయ్యాను.
"రేయ్ ఏంట్రా ఇది?మేఘా తోనా నీ పెళ్లి?"
"హ్మ్....మేఘాతోనే.తను నన్ను ప్రేమించింది."
"అసలెప్పుడు జరిగింది ఇదంతా."
"ఎప్పుడా....ఐదేళ్ల క్రితం.సింధు కొడుకు నామకరణానికి వచ్చావ్ కదా.అప్పుడు మేఘా నీతో తరువాత మాట్లాడతా అందిగా.నా గురించే.నిన్ను రాయబారం చేయమని అడుగుదాం అనుకుందట."
"తమరు ఫోన్ పగులగొట్టి వెళ్లారుగా ఆరోజు....దాన్ని సెట్ చేయగానే మేఘా నుండి ఫోన్.అది పనిచేయడంలేదని....నా ఫోన్ నుండి కాల్ చేస్తే....నాతో మాట్లాడాలి రమ్మంది."
"వెళ్తే.....నువ్వంటే నాకు చాలా ఇష్టం.బాగా ఆలోచించుకొని చెప్పు అంది.అప్పుడు నువ్వున్న సిట్యుయేషన్ లో నీకు చెప్పాలో లేదో కూడా అర్థం కాలేదు."
ఆరోజు జరిగింది గుర్తుచేసుకున్నాను.....నేను ఆలోచిస్తు ఉంటే మళ్ళీ వాడే...
"మేఘా గురించి నేనెప్పుడూ అలా ఆలోచించలేదురా.తను చెప్పే వరకు నాకూ తెలియదు అసలు.తను అంత ఓపెన్ గా చెప్తుంటే....తనని వదులుకోవడం కరెక్ట్ కాదనిపించింది."
"మనం ప్రేమించేవారికన్నా..మనల్ని ప్రేమించేవారితో జీవితం బాగుంటుంది కదా...అందుకే మరేం ఆలోచించకుండా ఒప్పుకున్నాను."
అనీల్ చెప్తోంది నిజమే కదా అనిపించింది.నిజంగా వాడు చాలా లక్కీ అనిపించింది.
"మేఘా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి....మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడించి....అందరిని ఒప్పించేసింది."
"కంగ్రాట్స్ రా అనీల్.చాలా హ్యాపీ గా ఉంది."
"కానీ బాబాయ్ నాకన్నా పెద్దవాడివి.....నీకు జరిగాకే నాకు చేయాలని అన్నాడు రా ముందు."
"నాతో ఎందుకురా.మధ్యలో."
"హ్మ్....మేఘా వాళ్ళు అలా ఎందుకు ఓకే ఫ్యామిలీ కాదు కదా అని....చిన్నపాటి ఆర్గ్యు తరువాత బాబాయ్ కూడా సరే అనడంతో.....ముహుర్తాలు పెట్టించేశారు."
"ఇంకో రెండు రోజుల్లో నిర్శ్చితార్ధం.వారం రోజుల్లో పెళ్లి.....లీవ్ పెట్టి బయల్దేరు.వెళ్దామ్."
"రేయ్ వారం రోజులుందిగా పెళ్లికి.నేను ఇప్పుడే ఎందుకు?మూడు రోజుల ముందోస్తాలే."
"అంతలేదు.నిన్ను వెంటబెట్టుకొస్తా అని పెద్దమ్మకి మాటిచ్చా."అని నేను చెప్పేది వినకుండా బ్యాగ్ పాక్ చేసి.....మరుసటి రోజు బ్యాంక్ లో లీవ్ పెట్టించేసి....నన్ను తీసుకుపోయాడు.
నిర్శ్చితార్ధం సాయంసంధ్య వేళా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేశారు.చాలా గ్రాండ్ గా ఉన్నాయ్ అరైజ్మెంట్స్.
ఒకరిద్దరు అమ్మ వాళ్ళని మీ అబ్బాయికి చూస్తున్నారా అని అడుగుతున్నా మాటలు....నా చెవినా పడ్డాయ్.
అవేం పట్టించుకోకుండా నేను అనీల్,సింధు వాళ్ళ తోనే ఉండిపోయాను.
"సింధు...హసీనా రాలేదా?"
"అది ఇప్పుడు డాక్టర్ కదా అన్నయ్య.ఫుల్ బిజీ ఉంటోంది.ఏదో ఏమర్జెన్సీయ్ అంది.వీలైతే వస్తా అని చెప్పింది."
బంధువులు చాలామంది వచ్చారు.....దూరప్రాంతల నుండి....మళ్ళీ ఆ రాత్రి పూట తిరిగి వెళ్లలేకా....ఉదయాన్నే వెళ్లాలని అందరూ హాల్ లోనే ఉన్నారు.ఎలాగూ హాల్ కూడా మేఘా వాళ్లదే కాబట్టి ప్రాబ్లెమ్ లేదు.
నేను ఒక్కడినే ఇంటికి వచ్చేసాను.పడుకొని....ఫంక్షన్లలో తీసుకున్న పీక్స్ చూస్తూ ఉంటే....ఎవరో బెల్ కొట్టారు.
"ఎలా ఉన్నావ్ శీను?"
"చాలా బాగున్నాను.నువ్వెలా ఉన్నావ్?"
"హ్మ్..."
"కూర్చో.ఎం తీసుకుంటావ్....టీ పెట్టనా?"
"వద్దు శీను.నీతో...నీతో మాట్లాడాలని వచ్చాను.ఇలా కూర్చో ప్లీస్."
తనలా కంగారుగా,బేరుగ్గా....కొంచెం కోపంగా చూస్తూ ఆడిగేసరికి ఏమైందో అని వచ్చి తన ముందు కూర్చున్నాను.
"ఏంటి ఏమైంది?"
"అదే నేనూ అడుగుతున్నా శీను.ఏమైంది నీకు...ఎందుకిలా చేస్తున్నావ్?"
"నాకేం అయింది.నేనేం చేశా?"
"నేనొక విషయం చెప్పాను.దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు నువ్వు."
"నాకేం చెప్పావ్.నేనేం రిప్లై ఇవ్వలేదు.అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు."
"ఆపు శీను.దేనికైనా ఒక హద్దు ఉంటుంది.నువ్వు ఎదో ఒకటి చెప్తే కదా నాకు తెలిసేది.అవుననో....కాదనో.."
"ఎహే ఆపు.అసలేం చెప్పావ్.అది చెప్పు ముందు."
"సరే....చెప్తా.లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడే, నీతో నేరుగా మాట్లాడి నా మనసులో మాట చెప్పాలని అనుకున్నాను.కానీ నువ్వు ముందుగా వెళ్లిపోయావ్.కానీ నీకు ఎలాగైన చెప్పాలని మెసేజ్ చేసాను.కానీ నువ్వు ఎం చెప్పలేదు.ఇప్పుడు నీ ఎదురుగా నిలబడి అడుగుతున్నా....."
"శీను.....నువ్వంటే నాకు చాలా ఇష్టం.నీతో లైఫ్ పంచుకోవాలని ఆశ పడుతున్నాను.చెప్పు...."
తను అలా అడుగుతూ ఉంటే....నా కోపం కట్టలు తెంచుకుంది.విసురుగా తన చెంప మీద కొట్టాను.అయిన నా కోపం తగ్గడంలేదు.
"ఎం మాట్లాడుతున్నావో అర్ధం అవుతోందా హసీనా."అరిచా.
నేను కొట్టిన దెబ్బకి తన చెంప కంది ఎర్రబడింది.కానీ తన కళ్ళ నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా కారలేదు.అసలు తన మొహంలో కోపం కానీ,ఏడుపు కానీ లేవు.
అసహనంగా కూర్చున్నా....తను అలా నన్ను చూస్తూనే ఉంది.
"హసీనా నువ్వు బయల్దేరు."
"ఎక్కడికి?"
"ఏట్లోకి....ఛా....ఇంటికెళ్లు.పో."
"నేను అడిగిన దానికి సమాధానం చెప్పందే ఇక్కడి నుండి వెళ్లను."
తను అంత మొండిగా అంటూ ఉంటే....నేను కొంచెం శాంతించి....నచ్చజెప్పాలని....
"నీకేమైన పిచ్చా హసీనా.ఎందుకిలా ఆలోచిస్తున్నావ్.మనం మంచి ఫ్రెండ్స్ కదా.
"అవును...నేను కాదనడంలేదే.ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోకూడదా శీను."
"ఏనాఫ్ హసీనా.డిస్కషన్ వద్దు.వెళ్లు."
"సరే వెళ్తా నా ప్రపోసాల్ ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావో ఒక్క రిసన్...ఒక్క ప్రాపర్ రిసన్ చెప్పు వెళ్లిపోతా."
"హసీనా.నేను...నేను హ్యాండికాప్పేడ్ ని...నాతో లైఫ్ ఏంటి."
"శీను....ప్లీస్....అలా అనకు.నాకది సమస్యే కాదు."
"కానీ ఇది కచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి సమస్యే హసీనా."
"లేదూ శీను...నేను.."
"హసీనా ప్లీస్....వద్దు."
"ఐదేళ్లు శీను.ఐదేళ్లుగా నీ మాట కోసం ఎదురుచూస్తున్నాను.నా మెసేజ్ చూసి కూడా నువ్వేం చెప్పకపోతే....ఆలోచిస్తున్నావ్ అనుకున్నా.నిన్ను తొందరపెట్టడం ఇష్టంలేక మళ్ళీ అడగలేదు."
"ఇంట్లో వాళ్ళు పెళ్లి అని పోరు పెడుతుంటే.....నీతో నేరుగా మాట్లాడాలని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కేలేదు."
"ఇన్నిరోజులు తరువాత వచ్చావ్...నీతో నేరుగా నా మనసేంటో చెప్తుండే కాదంటున్నావ్ ఎందుకు శీను?ఈ ఐదేళ్లలో నీ నిర్ణయంలో ఏ మార్పు రాలేదా."
"హసీనా.....అసలేం మాట్లాడుతున్నావ్.ఎం మెసేజ్?"
"నటించకు....నా మెసేజ్ నువ్వు చూశావ్.నీకు ఇష్టం లేకపోతే ఎందుకు ఇన్నాళ్లు చెప్పకుండా నన్ను వెయిట్ చేయించావ్.ముందే చెప్పేసి ఉండచ్చుగా.ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేశావ్."
"హసీనా.....నువ్వు చెప్తున్నా ఆ మెసేజ్ గురించి నాకేం తెలియదు.నిజం చెప్తున్నాను."
"ఓకే ఫైన్....వదిలేయ్.ఇప్పుడు అడిగానుగా...చెప్పు."అని చేతులు కట్టుకుని నిలబడింది...సూటిగా నన్నే చూస్తూ.
"ఇందాకే చెప్పాను హసీనా.నాకా ఉద్దేశం లేదు...రాదు."
నా మాట పూర్తి అవ్వడంతోనే...హసీనా అక్కడి నుండి బైటకి వెళ్ళిపోయింది...డోర్ గట్టిగా క్లోస్ చేస్తూ...
ఛా.....అసహనంగా సోఫాలో కూర్చున్నాను.మనసంతా గజిబిజిగా మారింది.హసీనా ఇలా ఆలోచిస్తుందని ఊహించలేదు నేను.
జ్ఞాపకాలు.....ఆలోచనలు..... వెంటాడుతున్నాయ్.గతం కళ్ళముందు కదలాడింది.
ఇప్పటివరకు జరిగిన కథ శీను దృష్టికోణం నుండి తెలుసుకున్నాం.ఇప్పుడు కథను రచయిత నడిపిస్తుంది.
ఇంతలో గడియారం పన్నెండు కొట్టడంతో....గతం నుండి బైటికొచ్చాడు శీను.మంచి నీళ్ళు తాగి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళాడు.
బెడ్ పైన వాలిన శీనుకి...హసీనా అన్న మాటలే గుర్తొస్తున్నాయ్.
'ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నా అంది.నాకేదో మెసేజ్ చేశా అంటోంది.ఎప్పుడు చేసింది....నాకేం రాలేదే.'అని ఆలోచిస్తున్నా శీనుకి...
ఉదయం తను రిపేర్ కి ఇచ్చిన పగిలిన ఫోన్ గుర్తొచ్చింది.ఇందాక ఫంక్షన్ హాల్ నుండి వస్తు..దాన్ని తీసుకొచ్చాడు.
ఫోన్ ఎక్కడ పెట్టాడో వెతికాడు....ఆతృతగా.హాల్ లో టీవీ దగ్గర ఉన్న ఫోన్ ని తీసుకుని....వాట్సాప్,నార్మల్ మెసేజెస్ చెక్ చేసాడు.అంతా చెక్ చేసిన శీను....సోఫాలో కూలబడ్డాడు.
అతని తల పగిలిపోతోంది.నెమ్మదిగా లేచి.....చల్లటి నీళ్లు తాగి.....వెళ్లి పడుకున్నాడు.ఏదో నిర్ణయానికి వచ్చినట్టు...బలంగా ఊపిరి పీల్చుకుని....కాసేపటికే ప్రశాంతంగా నిద్రపోయాడు.
ఇంకా ఉంది.
YOU CAN SAY APOLOGIZE OVER AND OVER, BUT IF YOUR ACTION DON'T CHANGE, THE WORDS BECAME MEANINGLESS