Divya Pandeti

Drama

4.6  

Divya Pandeti

Drama

నా పయనం...ఎటు వైపు..?

నా పయనం...ఎటు వైపు..?

17 mins
1.1K



రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక ఆటో ఆగి ఆగి ముందుకు వెళ్తోంది.ముందున్న బండ్లు ఎంతకీ కదలకపోవడంతో....అదే పనిగా హారన్ కొడుతూనే ఉన్నాడు ఆటో డ్రైవర్.

ఆ ట్రాఫిక్ తో,ఆ హారన్ ల మోతతో, చుట్టూ ఉన్న జనాలతో.....అసలు ఈ ప్రపంచంతోనే తనకి సంబంధం లేదు అన్నట్టు తల వెన్నకి వాల్చి.....బైట శూన్యం లోకి చూస్తూ ఆటో లో ఉంది ఒక అమ్మాయి.

బుర్ర వేడెక్కించే ఆలోచనలు.....హృదయం తట్టుకోలేని బాధ.... ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి,వెరసి ఆమె మనసుకి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయ్.

"నేను చచ్చిపోతే అన్నా అర్ధం అవుతుందేమో.నేను లేకపోతేనన్నా నా విలువ తెలుస్తుందేమో.అసలు ఈ ఆటోకి ఆక్సిడెంట్ అయితే బాగ్గున్ను. ఇక్కడికిక్కడే భూకంపం వచ్చి నేను పోతే బాగ్గున్ను"... ఇలా సాగుతున్న ఆమె విపరీత ఆలోచనాలకి బ్రేక్ వేస్తూ... ఆటో ఆగింది.

వెంటనే ఆటో దిగి డబ్బులిచ్చి లోపలికి నడిచింది ఆ అమ్మాయి.

"అమ్మా...."

అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది... "ఏంటయ్యా?"

"చేంజ్ తీస్కోండి...."

"నువ్వే ఉంచుకో"....అని వడివడిగా ఇంటిలోకి నడిచింది.

ఆటో వాడు కొంత ఆశ్చర్యంగా,కొంత అయోమయంగా... చాలా సంబరపడిపోయాడు.ఎందుకంటే ఆమె ఇచ్చింది.....ఐదు వందల నోటు.ఇవ్వాల్సింది డెబ్భై రూపాయలే.

ఇంటిలోకి వస్తున్న కూతురిని చూసి,"పింకీ... ఆటోలో వచ్చావ్?స్కూటి ఏదీ?"ప్రశ్నించింది ఆమె తల్లి.

తల్లిని ఒకసారి చూసి,సమాధానం చెప్పకుండా తన గదికి వెళ్ళిపోయింది.

తలుపు గడియపెట్టి,బ్యాగ్ విసిరికొట్టి...తను బెడ్ పైకి చేరింది.అరగంటగా అనుచుకున్న,ఆపుకున్న కన్నీళ్లు.....కట్ట తెగినా గోదారిలా,అలుపెరగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయ్.

సముద్రంలోని నీళ్లు ఎప్పటి ఇంకిపోనట్టు...తన కళ్ళల్లో కన్నీళ్ళకి కూడా కరువు లేదేమో అన్నట్టు ఆగకుండా వస్తూనే ఉన్నాయి....

వాటిని ఆపాలని అనుకోవడం లేదు,కనీసం చెంపలపై కన్నీటి చారికలని తుడిచే ప్రయత్నం కూడా చేయడంలేదు.

"ఐదేళ్ల నా నిరీక్షణకి తనిచ్చిన జవాబు విని నేను ఎలా.....ఎలా.....తట్టుకోగలనని అనుకున్నాడు.నా మనసుని ఇంతలా కష్టపెట్టాలని ఎందుకు అనుకుంటున్నాడు.ఇంత కఠినంగా ఎలా...ఎప్పుడు మారాడు".

అతన్ని నిందించాలో....తన మీద తాను జాలిపడాలో అర్ధం కావడం లేదు.బాధ కాస్త కోపంగా మారుతోంది....కోపం పంతంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు....

"ఆటోలో వచ్చిన ఆలోచనే కరెక్ట్,అలా చేస్తేనే తనకి అర్ధం అవుతుంది.తన కోసం ఇన్నాళ్లుగా ఎంత పరితపించానో తనకి తెలియాలి....అంటే,నేను....."

అనుకున్నదే తడవుగా,లేచి టేబుల్ పైన ఉన్న పేపర్ కటర్ చేతిలోకి తీస్కుంది....

దాన్ని తీక్షణంగా చూస్తూ....ఆవేశంగా ఊపిరి బలంగా తీసికుంటూ, చేతి మణికట్టు మీద కటర్ ఉంచి....కళ్ళు మూసుకుంది.

తన నిర్ణయం ఎన్ని విపరీతాలకి దారి తీస్తుందో అన్న ఆలోచనలేదు.తనకి ఏమైనా అయితే తల్లిదండ్రుల బాధ గుర్తురావడం లేదు.అతని మాటలే పదేపదే చెవిలో జోరీగలా ఇబ్బంది పెడుతుంటే.....

మూసి ఉంచిన కళ్ళని మరింత గట్టిగా ముసుకుంటు...కుడి చేతిలోని కటర్ పై తన పట్టు బిగించి...ఒక్కసారిగా...........

@@@@@@

ఇక్కడ ఒక ప్రాణం గాలిలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంటే.....ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సాధారణ ఇంట్లోని ఒక వ్యక్తి నిద్రపట్టకా మంచంపై దొర్లుతున్నాడు.

"ఇన్నాళ్లు ఎంతో ప్రశాంతంగా ఉన్నా... అనవసరంగా ఇక్కడికి వచ్చి నా మనఃశాంతిని నేనే దూరం చేసుకున్నా".

"చా...అసలు తను ఎందుకిలా ఆలోచిస్తోంది.నా పరిస్థితి తెలిసి కూడా ఎందుకు తను ఇంత పంతంగా ఉంది."

"తనకి అర్ధం అయ్యేలా ఎలా చెప్పనూ.ఇంతకు ముందు ఇలా లేదు తను.అందరిని బాగా అర్ధం చేస్కునేది....ఆలోచించి నిర్ణయం తీసుకునేది.కానీ ఇప్పుడు మొండిగా తయారైంది".

ఆమె గురించి ఆలోచిస్తూనే,తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల వల్ల,ఎం పొగొట్టుకున్నాడో...ఎం చేజారిపోయిందో.ఒక్క రాత్రి తను చేసిన తప్పు వల్ల తను ఎం కోల్పోయాడో తలుచుకున్నాడు....

అతని ఆలోచనలు ఆరేళ్ళు వెనక్కి వెళ్లాయి...

అతని మాటల్లోనే...అతని కథ ని విందాం... సారీ చదువుదాం

అప్పుడే బస్ దిగి,నా కోసం వెయిట్ చేస్తా అన్న బాబాయ్ కోసం వెతికాను.

"ఎరా శీను ఎలా ఉన్నావ్?"అంటూ పలకరించాడు మూర్తి బాబాయ్.

"బాగున్నా బాబాయ్."

"రా పోదాం.ఇంట్లో నికోసమే చూస్తున్నారు."అంటూ ముందుకు దారి తీసాడు.

ఇంటికి వెళ్లగానే ఎదురైంది శారదా పిన్ని, మా అమ్మ కి స్వయానా చెల్లెలు.

"ఎరా శీను బాగున్నావా.ఇలా చిక్కిపోయావెంట్రా?"

నన్ను ఆప్యాయంగా తడుముతూ....చాలా కాలం తరువాత చూడడం వల్ల.... కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అడిగింది పిన్ని.

"హ.....చిక్కిపోయా.నీమీద బెంగపెట్టుకుని.వచ్చాగా....నాకు కడుపు నిండా పెట్టు మరి."పిన్నిని తేలికపరుస్తూ అన్నాను.

"హ..హ..బాగా పెట్టు.చీపురు పుల్లలా ఉన్న వాడిని...చీపురు కట్టల మార్చేయ్."

గదిలో ఉండి వస్తు అంది సింధు...నా చెల్లెలు.అదే పిన్ని కూతురు.

"రేయ్ సింధు.ఎలా ఉన్నావ్ రా.బాగా చదువుకుంటున్నావా?"

"ఫస్ట్ క్లాస్ రా అన్నయ్య.కానీ ఇంట్లోనే ఫుల్ బోర్ గా ఉంటుంది.నువ్వు వచ్చావ్ గా...ఇక నాకు బొరె కొట్టదులే."

"వాడు వచ్చింది నిన్ను ఎంటర్టైన్ చేయడానికి కాదు.పని చూసుకోడానికి.రేయ్ శీను....నూవ్వు రెస్ట్ తీసుకో.సాయంత్రం త్వరగా వస్తాను... షాప్ దగ్గరికి వెళ్దామ్."అని నాతో అని....

"ఏంటి ఇంకా చూస్తున్నావ్.త్వరగా తెములు.... కాలేజ్ కి టైం అవ్వట్లా...రా."అని సింధు ని తీసుకుని వెళ్లిపోయాడు బాబాయ్.

నేను ఫ్రెష్ అయ్యి...పిన్ని పెట్టిన టిఫిన్ తిని,తనతో ఊరి విశేషాలు మాట్లాడతా.....తనకి సాయం చేస్తూ గడిపేసాను.

సాయంత్రం సింధుతో పాటు వచ్చాడు బాబాయ్....టీ తాగిన తరువాత...ఇద్దరం బయల్దేరాం.

"నమస్తే సేతు..."

"హ రండి మాస్టారు.కూర్చోండి."

బాబాయ్,నేను కూర్చున్నాం.

"రేయ్ రెండు టీ చెప్పండ్రా."

"వద్దు సేతు తాగామ్.ఇదిగో నేను చెప్పానే వీడే."

"హ...ఎందాకా చదువుకున్నావ్?"

నన్ను ఎగాదీగా చూస్తూ అడిగాడు అతను.

"డిగ్రీ మధ్యలో ఆపేసాను."అన్నాను.

"హ్మ్....పిల్లొడు బుద్దిమంతుడిలానే ఉన్నాడు.మాస్టరు....అబ్బాయికి పనైతే ఇస్తా.కానీ త్వరగా పని నేర్చుకోవాలి.చుర్రుగ్గ ఉంటే సరే...లేదంటే మొహమాటం లేకుండా తీసేస్తా.మళ్ళీ మీరు నొచ్చుకోకూడదు.ముందే చెప్తున్నా."

"వీడు మహా చురుకైనోడు సేతు.ఈ కరెంట్ పనిలో కొద్దిగా అవగాహన ఉంది వీడికి.చిన్న చిన్న రిపేర్లు అవి చేస్తూ ఉంటాడు.నువ్వే చూస్తావ్ గా."

నా గొప్పలు చెప్తున్నాడు బాబాయ్.కానీ అందులో అబద్ధం ఏమి లేదు.నాకు కొంత పనైతే నిజంగానే వచ్చు.

బాబాయ్ మాట మీద నమ్మకంతో ఇంకేం మాట్లాడకుండా...నెలకి ఐదు వేల జీతంతో నన్ను పనిలో పెట్టుకున్నాడు సేతు.

ఇంతకీ ఇదేం షాపో చెప్పలేదు కాదు.....అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ చేసే వర్క్ షాప్. పెద్దదే...ఏసీ సర్వీసింగ్ కూడా చేస్తుంటారు.రిపేర్లు మాత్రమే కాకుండా స్పెర్ పార్ట్శ్ కూడా అమ్ముతుంటారు.

ఊరిలో ఎక్కడ దొరకని పార్ట్శ్ కూడా ఇక్కడ కచ్చితంగా దొరుకుతాయి అని పేరు.కొత్తగా చేరిన వారికే ఐదు వేల జీతం ఇస్తున్నారంటే...ఆ వర్క్ షాప్ ఎంత పెద్దదో ఊహించుకోండి.

@@@@@@

ఇంటికొచ్చి బోజనమ్ చేసి మేడ మీదకి వెళ్లను.కాసేపు అటు ఇటు తిరిగి....మంచం వాల్చుకుని పడుకున్నాను.

ఇంతలో సింధు వచ్చి...కబుర్లు చెప్తూ కూర్చుంది.తన కాలేజి విషయాలు....చదువు గురించి మాట్లాడుతూ....

"అబ్బా నాన్న కూడా అక్కడే ఉండటంతో ...సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నా అన్నయ్య."అంది బాధగా.

"బాబాయ్ ఉన్నాడు కాబట్టే నువ్వు ఈమాత్రం కుదురుగా అన్నా ఉన్నావ్.లేదంటే అందరికి చుక్కలు చూపించి ఉంటావ్."

"అన్నయ్యా....."బుంగమూతి పెట్టింది.

"సరేలే వెళ్లి పడుకో.లేట్ అయింది."అని పంపించేసాను తనని.

మూర్తి బాబాయ్...సింధు చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ లోనే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు.

బాబాయ్ వాళ్లకి సింధు ఒక్కత్తే కూతురు.మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కడ్నే కొడుకుని. కొడుకు లేడనే లోటు....నన్ను చూసి మర్చిపోతారు వీళ్లు. నన్ను బాగా చదివిస్తాం మాతో పంపించండి అని బాబాయ్ ఎన్నిసార్లు అడిగినా....నన్ను దూరం పంపడం ఇష్టం లేక కుదరదని అనేవారు మా వాళ్లు.

నేనూ మా ఊరు,అమ్మ వాళ్ళని వదిలి రాలేక...వద్దనేవాడ్ని. కానీ ఇప్పుడు అనిపిస్తోంది....నేను ఎంత తప్పు చేశానో.బాబాయ్ పిలిచినప్పుడే ఇక్కడికి వచ్చి ఉంటే...ఈపాటికి నేను ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండేవాడిని.

మాది తిరుపతి పక్కన చిన్న పల్లె.మాకు ఐదు ఎకరాల భూమి ఉంది.అది సాగు చేసుకుంటూ మా నాన్న...ఆయనకి పొలంలో సాయం చేస్తూ, ఇంటి దగ్గర....అగరత్తులు,విస్తారాకులు చేస్తూ ఉండేది అమ్మ.ఇంటి దగ్గరే కూరగాయలు కూడా పండించి అమ్మేది.

నేను పది వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో చదివి.....ఇంటర్ కి తిరుపతి లో చేరాను.ఆ తరువాత డిగ్రీలో చేరాను.నాకు ఇంగ్లీష్ రాదు,మొదటి నుండి తెలుగు మీడియామే......ఇంకో నాలుగు నెల్లలో నా చివరి సంవత్సరం పూర్తవుతుంది అనగా.....అర్ధరాత్రి కరెంటు పుణ్యమా అని నాన్నని కరెంట్ కాటేసింది.

ఎవరు గమనించకపోవడంతో....తెల్లవార్లు అక్కడే పడి ఉన్నాడు నాన్న.మోటార్ వేయడానికి వెళ్లి......కొన్నిసార్లు మళ్ళీ తిరిగేమ్ వెళ్తామ్ అని అక్కడే పడుకుని వేకువజామున వచ్చేవాడు.దాంతో అమ్మ కూడా అక్కడే ఉన్నాడేమోలే అని ఊరుకుంది.ఉదయం ఏడైన నాన్న రాకపోవడంతో ఆధారబాధర పొలం వైపు పరుగుతీస్తే....మోటార్ స్విచ్ బోర్డ్ దగ్గర పడి ఉన్నాడు.

చూస్తే శ్వాస ఆడుతోంది....హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తే బ్రతికిబట్టకట్టాడు.నాన్న పని చేయలేడని...చేతికి పక్షవాతం వచ్చిందని తేల్చేశారు డాక్టర్లు.

దాంతో పొలం బాధ్యత నామీద పడింది.అది నేను బరువుగా భావించలేదు.బాధ్యతగా స్వీకరించాను.చూస్తూ...చూస్తూ...నేల తల్లిని వదిలేయలేం కదా.కానీ నాకు వ్యవసాయం అంతగా తెలియదు.ఎన్నిసార్లు నేర్పించమని అడిగినా..

"నీకెందుకురా అయ్యా.నువ్వు చక్కా సదువుకుని... మీ బాబాయ్ లెక్క ఆఫీసులో ఉజ్జోగం సేయాలా."అని కనీసం గట్టు దిగనేచ్చేవాడు కాదు నాన్న.

మా నాన్న దృష్టిలో బాబాయ్ చేసే పనే చాలా గొప్పది.అవసరం మనిషికి అన్ని నేర్పుతుంది అని...ఇప్పుడు నేను గట్టు దిగక తప్పలేదు.నాన్న నాకు సాయంగా వచ్చేవాడు.....అన్ని దగ్గరుండి నేర్పించాడు.

నేనడిగే తిక్క ప్రశ్నలకి ఒప్పిగ్గా జవాబు చెప్పేవాడు.కొత్త విషయాలు తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం...అందుకేనేమో వ్యవసాయం నాలో ఉన్న జిజ్ఞాశాని ఇంకా పెంచింది.

శ్రద్ధగా నా పని నేను చేసుకుపోతుంటే....పక్కవాళ్లు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు.వీడెం చేస్తాడు...అసలు వీడికేం వచ్చు.అని నా వెనుక మాటలు...మా నాన్న ముందు,ఈ ఏడూ నీకు దిగుబడి వచ్చినట్టే అని పరాచీకాలు.

అన్ని వింటూ మా నాన్న చిరునవ్వు నవ్వి ఊరుకునే వాడు.వాళ్ళ మాటలే నాలో పంతాన్ని పెంచాయి...నాకేం వచ్చు,నేను చేయలేను అన్న వాళ్లే నోరెళ్ళబెట్టేలా చేయాలని....రాత్రిమ్బవళ్ళు కష్టపడ్డాను.

నీకు చేతకాదు అని ఎవరైనా అంటే....నాకు నచ్చదు.అలా అన్న వాళ్లకి నేనేంటో తెలిసేలా చేసేవరకు...నాకు మనఃశాంతిగా ఉండదు.

నా కష్టానికి ఫలితం దక్కింది.ఎవరికి రాన్నంత దిగుబడి వచ్చింది.కానీ రాబడి మాత్రం రాలేదు.ఎంత పండించినా....దళారుల చేతిలోకి వెళ్లిన పంటకు గిట్టుబాటు ధర పలకదుగా.అదే జరిగింది....వచ్చిన డబ్బు,చేసిన అప్పుకి జమ అయ్యింది.

మళ్ళీ పొలం లోకి దిగలంటే.....మరో అప్పు చేయకతప్పని పరిస్థితి.రంగులరాట్నం ఎక్కితే....ఒకసారి పైకి వెళ్తామ్....అబ్బా పైకి వచ్చాం అని ఆనందించేలోపే....కిందకి వచ్చేస్తాం.

ఈ వ్యవసాయ కూడా నాకు అలాగే కనిపించింది.పంటని చూసి పొంగిపోయే లోపే...చేతికి వచ్చిన పైకం చూసి నీరుగారిపోయా.ఎదుగుదలలేని  

పని ఎంతకాలం చేసిన ఎం లాభం....ఈ నైరాశ్యంలో కూరుకుపోయాను.

ప్రతి ఏడూ ఇదే పరిస్థితి.బయట ఎరువులు కొనకుండా...సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకుని....కొంత ఖర్చు తగ్గిచాను.దాంతో కొంత మిగిలింది.వస్తున్న డబ్బుని అలాగే అప్పు కట్టడం...మళ్ళీ కొంత చేయడం.రంగుల రాట్నం.....ఎక్కువ సేపు తీరిగితే కళ్ళు తిరుగుతాయ్.

దిగితేగాని లోతు తెలియదు అన్నట్టు.....సంపాదనలోకి దిగిన తరువాతే బరువు బాధ్యతలు చాలా భారంగా తోచాయ్.

వ్యవసాయం....పండించే రైతుకు సంతృప్తిని కలిగిస్తోంది గాని.....కడుపు నింపడంలేదు.అన్ని వ్యాపారం అయిపోతున్న ఈరోజుల్లో...వ్యవసాయం మాత్రం రైతు చేయవలసిన పనిగానే చూస్తు,రైతుని కూలివాడిని చేసేసారు.మా శ్రమని అందరూ దోచుకుంటు....డబ్బు దండుకుంటున్నారు.

ఊరిలో చాలా మంది పరిస్థితి ఇదే.అయినాసరే...ఎవరు పంట వేయడం ఆపడంలేదు.పైరు పెడుతూనే ఉన్నారు...కష్టపడుతూనే ఉన్నారు.

ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురుచూడలేము.ఇదేం సినిమా కాదు...ఎవడో మహానుభావుడు వచ్చి అదుకుంటాడు అనుకోవడానికి.

ఇక్కడ ఎవడి కష్టం వాడు పడాలి.....పడ్డా,ఒక ఊతం కోసం చూడకుండా.....స్వయంగా పైకి లేచే సామర్ధ్యాన్ని అలవరచుకోవాలి.

@@@@@

ఊరిలో చాలా మంది నా ఈడూ కుర్రాళ్లు...సిటీలో ఏదో ఒక పనిచేసుకుంటూ బ్రతుకుతున్నారు.కొంతమంది ఇంటర్ వరకే చదివినా....ఈ ఊళ్ళో ఉండలేకా పట్నం బాటపట్టారు.

సాయంత్రం పొలం పనులు చూసుకుని,ఇంటికొచ్చి స్నానం చేసి,తిని అలా రచ్చబండ దగ్గరికి వెళ్లాను.

"ఎరా శీను. ఎట్లున్నావ్?"

పలకరించాడు నా స్నేహితుడు శివ.వాడు నాతో ఇంటర్ వరకు చదివి...ఇప్పుడు సిటీలోని ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు.

"బాగున్నారా.ఎప్పుడొచ్చావ్?"

"ఈవెనింగ్ వచ్చారా."అన్నాడు ఫోన్ వంక చూస్తూ.

చాలారోజుల తరువాత వచ్చి...ఊరిలో వాళ్ళతో మాట్లాడకుండా...ఫోన్ లో తల దూర్చిన వాడిని చూస్తుంటే ఒక పక్క కోపంగా ఉన్నా...మరోపక్క ఆ ఫోన్ లో ఏముందో తెలుసుకోవాలని ఆరాటం.

"ఎరా ఎలా ఉంది సిటీలో?"

"హ్మ్...గుడ్ రా.బిందాస్ లైఫ్ అనుకో.నువ్వూ వచ్చేయ్ కూడదు.అక్కడే ఏదో ఒక పని చేసుకోవచ్చు."అన్నాడు ఫోన్ ని బోగరంలా తిప్పుతూ.

"వస్తే ఇక్కడ పొలం ఎవరు చూసుకుంటార్రా.నాన్న సంగతి తెలుసుగా."

"హ విన్నా.అయిన ఇక్కడ పైరు పెడితే ఎం మిగులుతోందని చెప్పు.ఊరికే డబ్బు దండగ.అదీ కాకుండా......ఎదుగుబొదుగు ఎం ఉండదు.అదే ఏదైన పని చూసుకుంటే....ఉన్న స్థాయి ఉండి, పైకి వెల్లచు.నా మాట విని పొలం అమ్మేసి.....సిటీకి వచ్చేయండి."

వాడి మాటలు వింటుంటే నిజమేనేమో అనిపించింది.ఇన్నిరోజులు నా ప్రయత్నాలని వృథాగా పోతుంటే....వాడి గీతోపదేసమే మేలనిపిస్తోంది.

"చూడూ..... నేను వెళ్లి ఒక్క సంవత్సరం అయింది.ఇంటికి చాలా డబ్బు పంపించాను.ఆ సుబ్బిశెట్టి అప్పు మొత్తం తీర్చేసాను.బ్యాంక్ లో ఇంకా కొంత డబ్బు దాచాను...రేపు చెల్లి పెళ్లికి కూడా కావాలిగా.ఇదో కొత్త ఫోన్ కూడా కొన్నారా."

అని ఆ ఫోన్ ని అలా పైకెత్తి చూపించి....చేతిలో గట్టిగా ఇముడ్చుకున్నాడు.

"అవునా ఎంత పడిందిరా ఈ ఫోను."అని వాడి చేతిలో నుండి తీసుకోబోయను చొరవగా.

వెంటనే వాడు....ఫోన్ ని మరో చేతిలోకి మార్చుకుంటూ...

"ఆ....ఎంత పది వేలు."అన్నాడు తేలిగ్గా.

"పది వేలా. "నోరెళ్ళబెట్టడం నా వంతయ్యింది.

'ఆ పది వేలే ఉంటే....సుబ్బి శెట్టి అప్పు సగానికి సగం తీర్చేయచ్చు.ఆ డబ్బు పెట్టి వీడు ఫోన్ కొన్నాడా.'ఆశ్చర్యంగా చూస్తున్నా వాడిని.

నా దృష్టంతా ఆ ఫోన్ పైనే ఉంది.అంత ఖరీదైన దాంట్లో ఏముందో తెలుసుకోవలని అత్సుకతతో..... దాన్నే చూస్తూ.....

"ఒకసారి చూపించారా..."అని అడిగా.దానికి వాడు...

"ఇది నీకు అర్థం కాదులేరా.చాలా కష్టం."అని ఫోన్ మోగడంతో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు.

మళ్ళీ కలుస్తా అని కూడా చెప్పకుండా.....కనీసం నా వైపు చూడకుండా వెళ్తున్నా వాడిని చూస్తుంటే....సిటీకి వెళ్తే,స్నేహితులని,బంధువులని కూడా మర్చిపోతారా అనిపించింది.

నాన్నకి అలా అయింది కదరా అంటే.హ విన్నా... అన్నాడే గాని.ఇప్పుడెలా ఉంది.పదా ఇంటికెళ్దామని ఒక్క మాట అనలేదు వాడు.చిన్నప్పటినుండి కలిసి పెరిగిన వాళ్ళం...అమ్మ వాళ్ళని పిన్ని,బాబాయ్ అని పిలిచేవాడు.....ఇప్పుడిలా...ఛా.తల విదిలించి ఇంటికి వెళ్లి పడుకున్నాను.

పడుకున్నా అన్న మాటేగానీ.....నిద్ర మాత్రం పట్టడంలేదు.పదే పదే వాడి మాటలే గుర్తొస్తున్నాయ్.

సిటీకి వెళ్తే కష్టాలు తీరుతాయ్.అప్పులు కట్టేయచ్చు.వాడిలా డబ్బు కూడబెట్టచ్చు.అమ్మకి మంచి చీరలు కొనచ్చు.నాన్నకి సరైన మందులు కొనచ్చు.వాడికి మల్లె నేను ఒక ఫోన్ కొనుకోవచ్చు.

వాడు ఎలా చూసాడు నన్ను...నాకు అర్థం కాదులే అని ఎంత తేలిగ్గా తీసిపారేశాడు నన్ను.కనీసం ఆ ఫోన్ ని ముట్టుకొనివ్వలేదు వాడు.అసలు నాకా అర్హతే లేదు అన్నట్టు ప్రవర్తించాడు.ఏ...ఆ మాత్రం ఫోన్ నేను కొనలేనా....వాడలేనా.కొంటా కచ్చితంగా కొంటా.కానీ ఎలా?ఎలా కొనగలను అలాంటి ఫోన్.పది వేలంటే మాటలా.పోనీ...నేను సిటీకి వెళ్తే?

చా...నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా.ఈ ఊరిని,ఏటి ని.....గట్టు మీద ఉన్న చింతచెట్టుని.అమ్మ,నాన్నలని.....వీధిలో నడుస్తుంటే ఆప్యాయంగా పలకరించే ఊరి జనాలని...వదిలి ఎలా వెళ్తా.వెళ్లి ఎం సాధిష్ఠా......వాడిలా మరబొమ్మల తయారవ్వడం కన్నా.ఇక్కడే నేల తల్లిని నమ్ముకుని...కష్టించడం మేలు.

ముందు చేసిన ఆలోచనలో తప్పు ఎంత ఉందో గాని....తరువాత వచ్చిన పరివర్తనలో ఏదో మానసికసంతృప్తి కలిగింది.హాయిగా నిద్రపోయాను.

@@@@@@

ప్రశాంతంగా నిద్రపోయానే గాని....ఉదయాన్నే ఇంటి ముందు వినిపిస్తున్న గోలకి...విసుగ్గా లేచాను.

ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో...పూరిగుడిసేని మిద్దె చేసాం.స్లాబ్ అయితే వేయగలిగాం గాని....ఇంకా మొండి గోడలు వెక్కిరిస్తున్నాయ్.కనీసం.... మిద్దెకి పిట్టగోడ కట్టలేదు...ఆఖరికి మెట్లు కూడా లేవు.రోజు రాత్రి నిచ్చెన ఎక్కి పైన పడుకోవడం...ఉదయం అలాగే దిగడం.

ఆ గోల ఏంటో అని మెల్లగా నిచ్చెన దిగి వచ్చాను.సుబ్బిశెట్టి...మా నాన్నని నిలేసి కడిగేస్తున్నాడు.రెండు నెలలుగా వడ్డీ ఇవ్వలేదని.ఎప్పుడూ.....లేదు అలా.పై సంపాదన కోసం.....నేను కరెంట్ పనికి వెళ్తూ,ఆ వచ్చిన దాన్ని వడ్డికి జమ కడుతూ వచ్చా.

కానీ రెండు నెలలుగా నాన్న ఆరోగ్యం అంత బాగోకపోవడంతో.....ఆస్పత్రికి ఖర్చయింది.ఇది విషయం అని చెప్తే ఎవరు వింటారు...ఎవరి గోల వారిదే.అరిచినంతసేపు అరిచి....వెళ్ళాడు శెట్టి.

ఇలా జరగడం ఊరిలో మాములే....చేతిలో డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అని.ఎం మాట్లాడినా నోరు మూసుకొని ఉండాలి తప్పదు.కానీ...ఎందుకో నాన్న చాలా దిగులుగా అయిపోయాడు అప్పటినుండి.

వారం రోజులబట్టి సరిగ్గా తిండి తినక....చిక్కి సాగమయ్యాడు.

"ఏంటి నాన్న?ఇప్పుడేమైంది.వడ్డీనే కదా...నేను ఎలాగోలా కట్టేస్తాలే."సర్దిచెప్పబోయాను.

"ఎలారా అయ్యా.ఆ శెట్టి పీకల మింద కూకున్నాడు.మాసంలోగా కట్టకపోతే...పొలం సప్తు చేసేసుకుంటా అంటన్నాడు."

"అలా ఎలా చేస్తాడు.రెండు నెలలు కట్టనంతమాత్రానా...పొలం మీదికి వస్తాడా.నువ్వు భయపడకు.ఊరిలో ఎవరు దీన్ని సమర్ధించరు.ఒప్పుకోరు."

"ఒప్పుకోక ఎం జెస్తార్రా.శెట్టికి భయపడని వాళ్లు ఉండారా ఈ ఊళ్ళో.అయ్యా....నేనోటి జెప్తా సేస్తావా?"

"చెప్పు నాన్న."

"నువ్వూ పట్నం పో అయ్యా.ఆడ.....నీకు తెలిసిన పని చేసుకో,ఈడ్నే ఉంటే...ఇట్టాగే ఉండిపోతావ్.మమ్మల్ని ఇడిసేయ్.నువ్వు బాగుండాలా......జెప్పరా అయ్యా.పోతావా?"

"ఏంటి నాన్న అలా అంటావ్.మిమ్మల్ని వదిలేయాలా... మతుండే మాట్లాడుతున్నావా.అక్కడికి వెళ్లి నేనేం చేస్తా నేను పోను."

"నా మాట విన్నారా అయ్యా.మా బతుకులు ఇంతే...కనీసం నువ్వన్నా బాగుపడు."

"లేదు నాన్న.నేను పోను.ఈ విషయం ఇక్కడితో వదిలేయ్."

అలా ఎన్నిసార్లు అడిగినా...వెళ్లానని పంతం పెట్టాను.ఇంకో వారం గడిస్తే పంట చేతికొస్తుంది.శెట్టి అప్పు వడ్డీతో కలిపి సగం అన్న జమ చేయగలను అనుకుని....గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకుంటే....వడగండ్లు....నా గుండెల్లో కడకండ్లను మిగిల్చాయ్.

అసలు కాదు కదా....కనీసం వడ్డిలో పావు వంతు కూడా జమ చేయలేకపోయాను.పాతది కట్టందే...కొత్తది ఇచ్చే ప్రసక్తే లేదని భీష్మించు కూర్చున్నాడు శెట్టి.

దాంతో మళ్ళీ మా నాన్న పాతపాటే పడటం మొదలు పెట్టాడు.మా నాన్న ఆరాటం ముందు నా పంతం ఓడిపోయింది.ఒప్పుకోక తప్పలేదు నాకు.

"సంతోషంరా అయ్యా...నువ్వు సక్కగా ఉండాలా.ఇక్కడ వివరం ఇడిసేయ్....నువ్వు బాగుండు ఆడా."

నాన్న ఆనందపడుతున్నాడు. ఎవరైనా....బిడ్డని పంపించి,వాడు తెచ్చే డబ్బుతో అప్పు తీర్చుకుందాం అనుకుంటారు.కానీ వీళ్ళు....సంపాదన లేకుండా ఇక్కడే ఉంటే..రేపు నా భవిష్యత్తు ఏమవుతుందో..ఎవరైనా నాకు పిల్లనిస్తారా అని భయపడుతున్నారు.

వాళ్ళు నా గురించి ఇంత ఆలోచిస్తుంటే...మరి నేను ఆలోచించాలి కదా.అందుకే...

"సిటీకి వెల్లమంటావా వెళ్తాను.కానీ మిమ్మల్ని వదిలేసి కాదు...శెట్టి అప్పు తీరే వరకు ఉండి. వచ్చేస్తాను.కానీ నాకు మాటీ.... మన పొలం ఎప్పుడు పచ్చగా కళకళ లాడుతూ ఉండాలి.నేను పంపే పైకం లో సగం శెట్టికి ఇస్తూ.....మిగిలింది పంట మీద పెడతా అంటేనే పోతా." అని గట్టిగా చెప్తే....సరే అని ఒప్పుకున్నాడు నాన్న.

అలా నేను సిటీకి వచ్చాను....నాకు తెలిసింది కరెంట్ పని...అదే ఇప్పించాడు బాబాయ్.ఐదువేల జీతంని ఎలా ఉపయోగించాలి అని అప్పుడే ప్రణాళికలు వేసేసుకున్నా.....

రేపటి నుండి నా జీవితం కొత్తగా మారబోతోంది.ఎక్కడ ఉన్న వాడిని...ఈరోజు ఇక్కడికొచ్చాను.ఇంకా ఎక్కడికి పోతానో తెలియదు.నాకంటూ ఒక లక్ష్యం ఉంటే... ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా,ముందుకు వెళ్లే తెగింపు ఉంటుంది.గమ్యం తెలియని ప్రయాణం ఎప్పటికైనా చప్పగానే సాగుతుంది.

అందుకే ఒక లక్ష్యం పెట్టుకున్నా...శెట్టి అప్పు తీర్చి,నాన్నకి మెరుగైన వైద్యం చేయించి.....ఆయన చెయ్ బాగ్గైఎలా చేయాలి.ఒకసారి అమ్మకి కూడా అన్ని టెస్టులు చేయించాలి.ఇవన్నీ అయిన తరువాత ఫోన్ కొనుకోవాలి.ఇలా ఆలోచిస్తూనే నిద్రపోయాను.

@@@@@

రాత్రి ఎప్పటికో నిద్రపోవడంతో.....ఊళ్ళో ఐదు గంటలకు నిద్రలేచే నేను....సింధు వచ్చి లేపే వరకు లేవలేకపోయాను.

"ఎంటన్నయ్య.నిద్రలేవకుండా..."నాకు టీ ఇచ్చి,నా పక్క మడుస్తోంది.

"సరిగ్గా నిద్రపట్టలేదురా."అంటూ టీ తాగుతూ...చుట్టు చూస్తూ ఉన్నాను.

"నాన్న ఇప్పటికే రెండుసార్లు అడిగారు.త్వరగా రెడి అయ్యి షాప్ కి వెళ్లు. లేకపోతే....అంతే సంగతులు."అని కాలి గ్లాస్ తీసుకుని కిందకి వెళ్ళిపోయింది.

గబగబా రెడి అయ్యి....షాప్ కి బయల్దేరుతూ ఉంటే.....పిలిచాడు బాబాయ్.

"రేయ్ ఇందా....అక్కడే పక్కన ఒక కేఫ్ ఉంది.మధ్యాహ్నం తినేసేయ్."అని డబ్బు ఇచ్చాడు.

"బైట ఎందుకండి.నేను క్యారి కట్టిస్తాను వాడికి."అంటూ వచ్చిన పిన్నిని వారించాడు బాబాయ్.

"చల్లారిపోయిన అన్నమేం తింటాడులే.ఆ కేఫ్ లో ఫుడ్ బాగుంటుంది...చవక కూడా."అని నా జేబులో డబ్బు పెట్టి....సింధుని తీసుకుని వెళ్ళిపోయాడు బాబాయ్.

ఎంత అయిన వాలైనా....చొరవగా కొన్ని అడగలేం.అందులో ముఖ్యమైనది డబ్బు....నా ఇబ్బందిని కూడా గుర్తించిన బాబాయ్ మీద గౌరవం ఇంకా పెరిగింది.

ఇంటి నుండి షాప్ కి వెళ్లాలంటే.....బస్ ఎక్కాల్సిందే.బాబాయ్ చెప్పిన బస్ నంబర్ గుర్తుపెట్టుకొని...బస్ స్టాప్ లో నా నిరీక్షణ మొదలుపెట్టాను.

నాతో పాటు అక్కడ చాలా మంది ఉన్నారు.ఇంతలో ఒక అమ్మాయి స్కూటీ మీద....ఒక చిన్న పాపతో వచ్చింది.

ఆ పాప చాలా ముద్దుగా ఉంది.....కానీ ఆ అమ్మాయి మాత్రం కనిపించడంలేదు.కారణం తను బుర్కాలో ఉంది మరి.అమ్మాయిలని చొంగకార్చుకుంటు చూసే అలవాటు నాకు లేదు.కాబట్టి నేను ఆ అమ్మయిని కాదు,బస్ ఎంతకీ రాకపోవడంతో.....ఆ పాపని చూస్తూ కూర్చున్నా.

ఆ అమ్మాయి....ఫోన్ చూస్తూ...ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేక....వచ్చి నా పక్కన కూర్చోని.పాపని వొళ్ళో పెట్టుకుంది.

నేను ఆ పాపతో మాటలు కలిపాను....తన గురించి అడుగుతూ....మధ్యలో ఆ అమ్మాయి ఫోన్ని చూస్తూ ఉన్నాను...సభ్యత కాదు అని తెలిసినా....

అది ఆ అమ్మాయి గమనించినట్టు ఉంది....చిరాగ్గా చూసింది నా వంక.ఆ చూపుతో నా మీద నాకే అసహ్యం వేసింది...అక్కడి నుండి లేచి,బస్ కోసం చూస్తూ నిల్చున్నాను.

ఛా.....ఏంటిలా ప్రవర్తిస్తున్నా.మరీ నాకు ఫోన్ పిచ్చి బాగా పెట్టినట్టు ఉంది.ముందు చేయాల్సిన పని మీద శ్రద్దపెట్టాలి. అంతకన్నా ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పాలి అని వెనక్కి తిరిగి చూస్తే...

ఆ పాపని స్కూల్ బస్ ఎక్కించి,ఆ అమ్మాయ్ స్కూటీలో వెళ్లిపోతు కనిపించింది.చేసింది చిన్న తప్పే అయినా.....క్షమించమని అడగలేకపోయానే అనే ఎక్కువ బాధపడ్డాను.

నా బస్ వస్తే ఎక్కి..వర్క్ షాప్ కి చేరుకున్నాను.అక్కడ చందు,గిరి,రాజు అని ముందు నుండి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు.

చందు,గిరి నా ఈడూ వాళ్లే.రాజు అన్న నాకన్నా ఐదేళ్లు పెద్దవాడు.పనిమంతుడు కూడా.సేతు నా బాధ్యత రాజు అన్నకి అప్పగించాడు.తను చేసి ప్రతి పని నన్ను పక్కన పెట్టుకుని చేసేవాడు అన్న. రాజన్నతో త్వరగా కలిసిపోయాను....పనిలో మెళకువలు చాలా త్వరగా తెలుసుకుంటు,కష్టపడుతున్నా అని నా మీద అభిమానం చూపేవాడు అన్న కూడా.

బైట సర్వీసులకు వెళ్లిన నన్నే అసిస్టెంట్ గా తీసుకెళ్లేవాడు.దాంతో చాలా తక్కువ సమయంలోనే....సొంతంగా దేనైనా బాగుచేసే నేర్పరితనం వచ్చింది నాకు.

రోజులు చాలా ప్రశాంతంగా,చాలా హాయిగా గడిచిపోతున్నాయ్.ఇంట్లో సింధుతో సరదాగా గడుపుతూ....పనిలో శ్రద్ధ చూపుతూ,సేతు దగ్గరా కూడా మంచి మార్కులు కోట్టేసాను.ఇంటికి కావాల్సిన సరుకులు తెస్తూ నా బాధ్యత తీర్చుకుంటున్నాను.

ఊరిలో అమ్మ వాళ్లకి డబ్బు పంపుతూ,అప్పు తీర్చే పని కూడా మొదలుపెట్టాను.కొంత పైకం బ్యాంక్ లో వేస్తూ...కూడబెతూ ఉన్నాను.

సింధు ప్రతి సెలవులకు వాళ్ళ బాబాయ్ ఊరు విజయవాడ వెళ్తుంది.లేదా అక్కడి నుండి బాబాయ్ వాళ్ళ తమ్ముడి కొడుకు అనీల్ వస్తాడు.

ఈసారి సింధుని విజయవాడ వెళ్ళింది.దాంతో నేను చాలా స్తుబ్ధగా అయిపోయాను ఇంట్లో.

ఎక్కువ సమయం షాప్ లోనే గడిపేస్తున్నా.అలా ఒకరోజు...

హోరున గాలి...ఆకాశం మెఘావృతమైంది.ఏ క్షణానైనా వర్షం మొదలవచ్చు.షాప్ లో చందు,గిరి ఇద్దరు లేరు.ఏదో పని ఉంటే చూసుకుంటూ ఉన్నాను.పనిలో ఉంటే నన్ను నేనే మర్చిపోయే నేను...

ఒక అమ్మాయి షాప్ లోకి రావడం.....టేబుల్ డ్రా తెరవడం కూడా గమనించలేదు.

సడెన్గా ఎక్కడో ట్రాన్స్ఫార్మ పేలిన శబ్దం....ఉలిక్కిపడ్డాను.వెంటనే ఫ్యాన్ ఆగిపోవడంతో కరెంట్ పొయిందేమోలే అనుకున్నా....అయిన నా పని మాత్రం ఆపలేదు.....చిరు చెమట్లు పోస్తుంటే....నుదిటి నుండి కారుతున్న చెమట తుడుచుకుంటూ......టేబుల్ వైపు చూసి షాక్ అయ్యాను.

బుర్కాలో ఉన్న ఒక అమ్మాయి....టేబుల్ మీద ఏదో పుస్తకాలు పెట్టుకుని రాస్తోంది.

అసలెవరీ అమ్మాయి.ఎప్పుడొచ్చింది.నేను గమనించనే లేదే.అయిన అంత ఇదిగా సేతు సార్ చైర్ లో కూర్చుంది.ఎవరో ఏంటో..... ముందు కనుకొవ్వాలి.అనుకుని తన దగ్గరికి వెళ్లను.

"మేడం ఎవరు మీరు?"

నా ప్రశ్నకి తన నుండి ఎలాంటి సమాధానం రాలేదు.....కాసేపటికి తల ఎత్తి నన్ను చూసి....మళ్ళీ పనిలో పడింది.

ఆ చూపుకు అర్థం నీకెందుకు అన్నట్టు,కొంచెం కోపంగా ఉంది.కానీ ఆ కళ్ళు మాత్రం నేను ఇదివరకే చూసాను.ఎక్కడ చూశానబ్బా....అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయా.

పక్కనున్న కేఫ్ నుండి రోజు ఉదయం,సాయంత్రం,చీకటి పడిన తరువాత టీ వస్తుంది మా షాప్ కి...ఆ కుర్రాడు వచ్చి పిలిస్తే ఈ లోకంలోకి వచ్చాను.

నాకు టీ ఇచ్చి...ఆ అమ్మాయి ముందు ఇంకో గ్లాస్ పెట్టి...చక్కా పోయాడు వాడు.అప్పుడు కొంచెం అర్థం అయ్యింది.ఈ అమ్మయ్ కి సేతుకి ఎదో బంధుత్వం ఉంది అని.

తను అక్కడి రికార్డ్ బుక్ లు చూస్తోంది...తన ఫోన్ లో ఏదో లెక్కలు వేస్తోంది.పక్కన ఉన్న క్యాలుక్లేటర్ వాడకుండా.కాసేపటికి కేఫ్ కుర్రాడు మళ్ళీ వచ్చాడు....కాలి గ్లాసులు తీసుకెళ్లడానికి.

"రేయ్ ఇటు రారా."పిలిచా వాడ్ని.

"ఎంటన్నా?"

"ఎవర్రా ఆ అమ్మాయి?"

"ఆ అక్కా....సేతు సార్ కి చుట్టం.వరసకి కూతురు.బాబాయ్ అని పిలుస్తుంది.ఎప్పుడైనా వచ్చి...షాప్ లో లెక్కలు అవి చూసి.....తేడా వస్తే చెప్తుంది సేతు సార్ కి."

"రేయ్ కూతురి వరుస అంటున్నావ్.ఆ అమ్మాయేమో బుర్కా లో ఉంది.మన సేతు సార్ హిందూ కదరా."

"హ నిజమే నాకు ఈ డౌట్ చాలాసార్లు వచ్చింది.కానీ ఎవరిని అడగలేదు.నువ్వు తెలుసుకుని నాకు చెప్పు."అని పోయాడు వాడు.

హ్మ్...మనకి ఒక డౌట్ అంటూ రాకూడదు.వస్తే.....అలా వదిలేసి ఉండలేను.తెలుసుకునే వరకు నిద్రపట్టదు ఇంక.కానీ ఎలా తెలుసుకోవాలి.....రాజన్న ని అడగాలి.వచ్చేవరకు వెయిట్ చేద్దాం.అని పని చేసుకుంటూనే,మధ్యలో ఆ అమ్మాయిని గమనిస్తూ ఉన్నాను.

కాసేపటికి కరెంట్ వచ్చింది.ఆ అమ్మాయి ఫోన్ వస్తే మాట్లాడి.....ఒక బుక్ చేతిలో పట్టుకుని,రాక్ దగ్గరికి వచ్చి....మొన్న కొత్తగా తెచ్చిన కొన్ని స్పేర్ పార్ట్శ్న ని చూస్తూ.....లెక్కపెట్టి,బుక్ లో రాసుకుని...... టేబుల్ మీద ఉన్న కంప్యూటర్ సిస్టం ని ఆన్ చేసింది.

చాలాసేపు దాని ముందు గడిపిన తరువాత....దాని ఆపేసి,బ్యాగ్ ఎత్తుకుంది బయల్దేరుదామని కాబోలు.అంతసేపూ గాలితో హోరెత్తించి....వెంటనే వర్షం మొదలైంది.ఉసూరుమంటూ మళ్లి కూర్చుంది.

దట్టమైన మబ్బుల వలన మధ్యాహ్నం మూడు గంటలకు చీకటిగా ఉంది.ఎంతకీ వర్షం తగ్గడంలేదు....వర్షానికి,గాలి కూడా తోడవడంతో..... కరెంట్ పోయింది.

నేను ఛార్జబుల్ లైట్ ఆన్ చేసి....టేబుల్ మీద పెట్టాను.చీకట్లో ఎం పని చేస్తాం అని నేను కాంగా కూర్చున్నా.

టేబుల్ మీద ఉన్న లైట్ వెలుగు నేరుగా ఆ అమ్మయి మొహం మీద పడుతోంది.ఆమె తథేకంగా స్లాబ్ మీద నుండి పడుతున్న......వాన నీటినే చూస్తూ ఉంది.అలా చూస్తున్న తను ఆనందంగా నవ్వుతోంది,అది ఆమె కళ్లలల్లో స్వష్టంగా తెలుస్తోంది.

పైకి లేచి....ఆ నీటి ధారల కింద చెయ్ పెట్టి....పైకి కిందకి చెయ్ ఆడిస్తూ ఆడుకొంటోంది.చిన్నపిల్లలా కేరింతలు కొడుతునట్టు...దోసిట్లో నీటిని పట్టుకుని......పైకి ఎగరేసింది.

అవి ఆమె మొహాన్ని తడిపేశాయ్.కానీ ఆమె వేసుకున్న ముసుగు మాత్రం తీయలేదు తను.ఉధృతంగా కురుస్తున్న వాన....గంటకి గాని తన జోరు తగ్గించలేదు.అంతసేపు తను అలా ఆడుకుంటూనే ఉంది.

గంట తరువాత....తన హాండ్ బ్యాగ్ లోనుండి కర్చీఫ్ తీసుకుని,మొహం తుడుచుకుంది...నాకు అటు వైపు తిరిగి ఉండటంతో,తన మొహం కనిపించలేదు. టేబుల్ డ్రాలో ఉన్న గొడుగు తీసుకుని,బ్యాగ్ భుజానికి తగిలించుకుంది.

గొడుగు తెరుస్తూ...ముందున్న మెట్లు దిగుతున్న ఆమె,చెమ్మ వల్ల జారిపడబోయింది.ఐదు అడుగుల దూరంలో ఉన్న నేను......ఆమెని ఎలా చేరుకున్నానో,ఎలా పడకుండా చెయ్ పట్టుకున్నానో నాకే అర్థం కాలేదు.

మెట్టు కోసలో ఉన్న తనని గట్టిగా పట్టుకుని లాగాను.నేను పై మెట్టు మీద ఉండటంతో....ఆమె తల బలంగా నా ఛాతిని తాకింది.పడబోయన్నన భయం తనలో ఎంత ఉందో,అంత కంగారు నాకు కలిగింది.కలగదా మరి.....ఓనర్ గారి చుట్టం.ఇక్కడే ఉండి తనని ఎందుకు కాపాడలేకపోయావ్ అని తిడితే,పడాల్సింది నేనే కదా.

అలా భయంతోనే తల ఎత్తి నన్ను చూసింది తను.అప్పుడు గుర్తొచ్చింది నాకు.....ఆ కళ్ళని ఎక్కడ చూసానో.కొన్ని రోజుల క్రితం బస్ స్టాప్ లో చూసాను.

ఆ రోజు ఆ కళ్ళు నన్ను చిరాగ్గా చూశాయి,ఇందాక కోపంగా......కానీ ఇప్పుడు ఆ కళ్ళలో ఏదో మార్పు,అది ఎంటో నాకు అర్ధం కాలేదు.

ఎందుకో భయమేసింది.....చటుక్కున ఆమె చెయ్ వదిలి దూరం జరిగాను.ఆమె అలాగే నన్నే చూస్తూ నిలుచుంది.వాన తుంపర్లు ఆమెని తడిపేస్తున్న పట్టించుకోవడంలేదు.

కాసేపుచూసి...గొడుగు విప్పి,మెట్లు దిగుతూ....థాంక్స్..అని గట్టిగా చెప్పి చకచకా వెళ్తున్న తననే చూస్తూ ఉండిపోయాను.

@@@@@@

చూస్తుండగానే నేను వచ్చి రెండు నెలలు గడిచిపోయాయి.ఈ రెండు నెల్లలో,నా ఖర్చులకు పోను...ఇంటికి చాలా డబ్బు పంపించగలిగాను.నేను దుబారా మనిషిని కాను...ఏది, ఎంత వరకు ముఖ్యమో అంత వరకే ఖర్చుపెడతాను.

సింధు...కాలేజ్ రిఓపెన్ కి ఇంకా పది రోజులు ఉందనగా...ఊరి నుండి వచ్చేసింది.తనతో బాబాయ్ తమ్ముడి కొడుకు అనిల్ కూడా వచ్చాడు.ఇక్కడే ఒక కార్,బైక్ షో రూమ్ లో జాబ్ వస్తే చేరడానికి వచ్చాడు.

బైట రూమ్ తీసుకుంటా అంటే వద్దని...ఇక్కడే ఇంట్లోనే ఉండమని ఆర్డర్ వేసాడు బాబాయ్ అనీల్ ని.అనీల్ నాకు పరిచయమే గాని...అంత చెలిమి లేదు.

వచ్చిన పది రోజుల్లోనే నాకు చాలా దగ్గరైపోయాడు....అంత త్వరగా నేను ఎవరితో కలవలెను.కానీ అనీల్....నన్ను తనతో కలిపేసుకున్నాడు.ఎక్కడికి వెళ్లిన ఇద్దరం జంటగా వెల్లడం,రావడం.

తన పుణ్యమా అని....సంవత్సరానికి ఒక్క సినిమా చూసే నేను,ఇప్పుడు పది రోజులకో సినిమా చూస్తున్నా.డబ్బులు ఖర్చయిపోతాయ్ అనే దిగులు లేకుండా....ప్రతి చోట తనే పెట్టేవాడు.

నాకు తన ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించాడు.తన దగ్గర ఉన్న పాత ఫోన్ నాకు ఇచ్చి....వాడుకోమని చెప్పాడు.ఋణపడిపోతున్నానేమో అని డబ్బు ఇవ్వబోతే,తిట్టి వారించాడు.

అనీల్ నన్ను చాలా మార్చేశాడు,తను వేసుకునే లాంటి బట్టలు కొనిపించాడు నాతో.నేను ఎంతలా మారిపొయా అంటే....అప్పుడప్పుడు నా మాటల మధ్యలో ఇంగ్లీష్ వస్తోంది....నాకు తెలియకుండానే,అదీ చాలా స్పష్టంగా పలకగలుగుతున్నాను ఆ పదాలను.

సింధూకి కాలేజ్ తెరిచారు.అనీల్ జాబ్ కి వెళ్తున్నాడు...నేను నా పనిలో బిజీగా ఉంటున్నాను.ఒకరోజు షాప్ లో ఉన్న నాకు కాల్ చేసాడు అనీల్...

"చెప్పరా..."

"రేయ్ ఎంతసేపు షాప్ లోనే ఉండిపోతావా.కొంచెం మాతోను టైం స్పెండ్ చెయ్ బే."

"పనిలో ఉన్నా అనీల్.మళ్ళీ చేస్తా..."అని వాడి మాట వినకుండా కాల్ కట్ చేసాను.

మళ్ళీ చేసాడు.....కానీ నేను ఎత్తలేదు.నాకు పనే ముఖ్యం...పనిలో పడితే అది పూర్తయ్యేదాకా,వదలను.

అనీల్ చేసి..చేసి..విసుగొచ్చిందేమో.చాలాసేపు చేయలేదు.నా పని పూర్తయ్యి....అనీల్ కి కాల్ చేసాను.

ఇప్పుడు వాడు ఎత్తలేదు.నామీద రివెంజ్ కాబోలు.నవ్వుకుంటూ....సారీ అని మెసేజ్ పెట్టి.ఇంటికి వెళదాం అని....షార్ట్ మార్చుకుంటూ ఉంటే సింధు నుండి ఫోన్.

"చెప్పు సింధు."

"నువ్వు అర్జంట్ గా..మా కాలేజ్ దగ్గర ఉన్న కేఫ్ కి రా...."అని కట్ చేసింది.

ఏంటో అంత అర్జంట్.అనుకుంటూ....బైటికొచ్చి,షేర్ ఆటో పట్టుకుని....సింధు చెప్పిన కేఫ్ ముందు దిగాను.

"వచ్చావా.......ఏంటి లేట్?"బైటే కడిగేస్తోంది సింధు.

"ఏంటి అంత ఫైర్ మీద ఉన్నావ్.ఏమైంది?"

"ఎం లేదు రా."అని నన్ను లోపలికి లాకెళ్లింది.

అనీల్ ఒక టేబుల్ దగ్గర ఉన్నాడు...వాడి పక్కన,ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

సింధు నేరుగా ఆ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి,ఆగింది...

నన్ను చూసిన అనీల్..."వచ్చారా సార్.ఇప్పటికి తీరిక దొరికిందా మీకు."అన్నాడు వెటకారంగా.

"ఆపరా..."అంటూ వాడి పక్కన కూర్చుంటూ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి స్టన్ అయ్యాను.

ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయ్యింది.నోటి నుండి మాట రాలేదు...పక్కన అనీల్,సింధు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి....ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉన్న.

IF OPPORTUNITY DOESN'T KNOCK, BUILD A DOOR.

ఇంకా ఉంది....



Rate this content
Log in

Similar telugu story from Drama