kottapalli udayababu

Drama

4  

kottapalli udayababu

Drama

రాగం ఎరుగని కోయిల

రాగం ఎరుగని కోయిల

8 mins
426


రాగం ఎరుగని కోయిల(కథ)!!

రాగం ఎరుగని కోయిల(కథ)


''నమస్తే అందరికీ.నేనే లేట్ అయినట్టున్నాను. అయాం వెరీ సారీ.'' అంటూ రిహార్సల్స్ రూమ్ లోకి అడుగు పెట్టాను.


''రండి రండి..ఇప్పటికి ఒక రీడింగ్ వేసాము. లీడ్ రోల్ మీరు లేకుండా ఎలా? బై ది బై ఈ నాటికలో మీ పక్కన హీరొయిన్ మనోరమ గారు. వీరిది కాకినాడ.మంచి సీనియర్ సిన్సియర్ నటీమణి. మీరిద్దరే నాటికకి జీవ పాత్రలు. విరగ దీసేయాలి మరి.'' అన్నాడు రచయిత కం డైరెక్టర్ సాయికృష్ణ.


''నమస్తే.'' అన్నాను చేతులు జోడించి ఖాళీగా ఉన్న ఫైబర్ చైర్ లో కూర్చుంటూ.


ఆమె టిఫిన్ పొట్లం లోంచి గారి ముక్క తుంచుకుని నోట్లో పెట్టుకోబోతూ నన్ను ఆత్మీయుడైన వ్యక్తిని చూసినట్టు తాదాత్మ్యం గా చూస్తూ ''నమస్తే'' అంది.ఒక్క క్షణం నేను ఆ చూపులకి విచలితుడినై చూపు మరల్చుకున్నాను.


టిఫిన్స్ పూర్తీ అయ్యాకా పాత్రధారులంతా రావడం తో ముందు రెండు సార్లు సిట్టింగ్ రీడింగ్ ఇచ్చాము నాటిక అంతా.సంభాషణలు ఎక్కడ మార్దవంగా చెప్పాలో, స్పష్టంగా ఎలా చెప్పాలో, హెచ్చుతగ్గులు, తీవ్రతలు, అన్నింటిని సాయికృష్ణ ఓపికగా చెబుతుంటే ఆయన ఓపికతనానికి నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఈ నాటిక సమాజం లో చేయడం మొదటిసారి.


మనోరమ సీనియర్ నటి కావడం తో ఎంతో అనుభవం తో అద్భుతంగా సంభాషణలు పలకడం చూసి స్పూర్తిగా తీసుకుని నేనూ ఆమెకు పోటీగా చెప్పాను.


సాయికృష్ణ ఆశ్చర్యపోయాడు.''సోనైస్ భగవాన్ గారు.మొన్న మీరు చేసిన నాటిక చూసే మీరైతేనే ఈ పాత్రకు న్యాయం చేస్తారనుకుని మిమ్మల్ని కాంటాక్ట్ చేసాను.నా అదృష్టం కొద్దీ మీరు ఒప్పుకున్నారు.. మీకు పోర్షన్ కూడా బాగా వచ్చేసినట్టుంది.నేను ఊహించిన దానికన్నా బాగా చెప్పారు. ఇక రిహార్సల్స్ కూడా బాగా చేస్తే తప్పక మనం నందికి సెలెక్ట్ అవుతాం '' ఆశాభావం గా అన్నాడు సాయి కృష్ణ.


''సర్.ఒక నాటిక ఒప్పుకున్నానూ అంటే ఆ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చెయ్యడానికి ప్రయత్నించడం నా అలవాటు సర్.అందుకోసం డైరెక్టర్ గా నన్ను మీ చేతుల్లో పెడుతున్నాను. నాలో ఉన్న నటుడిని పరిపూర్ణం గా వాడుకోండి.ఎన్ని సార్లు రిహార్సల్స్ చేయడానికైనా నేను రెడీ. డైరెక్టర్ గా మీరు నా నటనకు సంతృప్తి చెందాలి. మీరు సంతృప్తి చెందితే నా పాత్ర పండినట్లే. సరేనా సర్?'' నిజాయితీగా అన్నాను.


'' మీ కమిట్మెంట్ నాకు తెలుసు సర్. నేను ప్రత్యక్షంగా చూసాను. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం.మంచి ఫలితం సాధిద్దాం.అపుడు ''నాటిక'' బతుకుతుంది.మనం పదికాలాలపాటు బతుకుతాం.సరే.మొదటి దృశ్యం స్టాండింగ్ రిహార్సల్స్ చేద్దాం.ఓకే నా.'' అందరమూ ఎలర్ట్ అయ్యాము.


మొదటి దృశ్యం లో మా అబ్బాయి పాత్రధారిని వాడి పెళ్లి శుభలేఖలు ఇచ్చి పొరుగూరికి సాగనంపాకా నాకు, నా భార్య పాత్రదారిణికి మా అబ్బాయి పెళ్లి ఏవిధంగా చెయ్యాలో పకడ్బందీ ప్లాన్ వేసుకునే దృశ్యం.


ఆ దృశ్యం లో నేను ఆమెను ఎలా వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్నానో ఒక్కసారిగా ఇరవై ఏళ్ళు వెనక్కి ఆ అనుభూతుల్లోకి వెళ్ళిపోయి. దంపతులుగా ఆనాడు మామధ్య అనురాగాన్ని, ప్రేమను గుర్తు చేసుకుని మళ్ళీ వాస్తవ పరిస్తితికి వస్తాం.


మనోరమకు సుమారుగా నలభై ఏళ్ళు తక్కువ ఉండవు. ఆయినా బింకంగా ఉన్న శరీరం, పొట్టి, కొంచెం బొద్దు అయినా అచ్చమైన గృహిణిలా చలాకీగా చేసిన నటన నన్ను ముగ్ధుణ్ణి చేసింది.నేనూ పోటీ పడి నటించాను.మేమిద్దరం కౌగలించుకుని ప్రేమను వ్యక్తపరుచుకుని విడిపోయే సమయం లో ఆమె నన్ను అతుక్కుపోయి డైరెక్టర్ 'ఓకే' చెప్పినా నన్ను విధిలేక వదిలి మామూలు మనిషవ్వడం నేను గమనించాను.


సాయికృష్ణ సంతృప్తి చెందాడు.


మనోరమ నా సెల్ నంబర్ తీసుకుంది. రాత్రివేళ నాకు ఖాళీ సమయం లో ఫోన్ లో మా ఇద్దరి సంభాషణలు రీడింగ్ రిహార్సల్స్ వేసుకునేవాళ్ళం.


రెండోవారం జరిగిన రిహార్సల్స్ లో -


రెండవ దృశ్యం లో నా కొడుకు పాత్రధారి పెళ్లి శుభలేఖలు పంచిపెట్టిన అనంతరం రెండురోజులైనా తిరిగి రాకపోయేసరికి తల్లి తండ్రులుగా మేము పడిన ఆవేదన, ఒక్కగా నొక్క కొడుకైన అతన్ని ఎంత ప్రేమగా పెంచి పెద్దచేసి ప్రయోజకుడిని చేసామో ఒకరికొకరం వాడిమీద తమకున్న అత్యధిక ప్రేమను వ్యక్తం చేసే దృశ్యం.


ఆ దృశ్యం లో అయితే ఆమె చాలా సహజంగా రిహార్సల్స్ లోనే వెక్కి వెక్కి ఏడ్చేసింది.నా గుండెలమీద తలవాల్చి నన్ను కౌగలించుకున్న సమయంలో కూడా ఆమె తన్మయత్మంగా ఉండిపోవడం సాయి కృష్ణ కూడా గమనించినట్టున్నాడు.


''మేడం.ఇది రిహార్సల్స్ మాత్రమే..'' అన్నాడు అర్దోక్తి గా.ఆమె కళ్ళతో జవాబిచ్చింది అతనికి.


'' భగవాన్ మంచి కవి తెలుసా.మంచి ఆధునిక కవిత్వం రాస్తారు.'' అని నా గురించి చెప్పాడు సాయి కృష్ణ .


''కోయిలను నన్ను సాదృశ్యంగ తీసుకుని మీరు నామీద ఒక కవిత రాయాలి''అడిగింది మనోరమ మేమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు.


మరుసటి వారం వెళ్ళినప్పుడు నేను రాసిన కవితను ఇచ్చాను. ఆమె దాన్ని చదివి ముద్దు పెట్టుకుని అపురూపమైన వస్తువులా భద్రం గా తన పర్సులో దాచుకుంది.


మూడోవారం జరిగిన రిహార్సల్స్ సంగీతంతో జరిగింది.మ్యూజిక్ డైరెక్టర్ ''భగవంతం'' గారట. ఎన్నో పరిషత్ లలో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు పొందాడట.ఆయన అందించిన సంగీతం తో నాటిక పోటీకి నిలబడే స్థాయికి చేరినట్టే అనిపించింది మా యూనిట్ అందరికీ.


''భగవంతం'' గారిని పరిచయం చేస్తూ ఆమె అంది." సర్ నేను సాంఘిక నాటికల కంటే పౌరాణిక నాటకాలు ఎక్కువ నటిస్తుంటాను. అవైతే దసరా, దీపావళి, వినాయక చవితి,పరిషత్తులు నిర్వహించే పౌరాణిక నాటకాలు మాకు ఎక్కువ రోజులు పని దొరుకుంతుంది.మీరు కూడా మాతో వచ్చేయకూడదు.'వెంకటేశ్వరస్వామిగా ' మీరు ఎంత బాగుంటారో.మీ పెర్సనాలిటీ సూపర్.''


''నాకు పద్యాలు పాడటం రాదండీ.అయినా నేను చేసేది.ఆర్.ఎం.పి. డాక్టర్ గా. నాటకాలు నా జీవనాధారం కాదు.నాకు అత్యంత ఇష్టమైన ప్రవ్రుత్తి మాత్రమే. అందువల్ల అటువైపు రాలేను.మీరిచ్చిన ఆఫర్ కి కృతజ్ఞతలు.'' అని తేల్చేసాను.


మూడో దృశ్యం లో మా అబ్బాయి పాత్రధారి కనపడటం లేదని పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడం, అతన్ని నక్సలైట్ గా అనుమానించి పోలీసులు బంధిచడం, వారి ఎన్-కౌంటర్ లో అతను మరణించడం, తల్లితండ్రులమైన మా మాటలు కూడా నమ్మని పోలీసులు మమ్మల్ని కూడా అరెస్ట్ చేద్దామని చేసేప్రయత్నం లో నాటకీయంగా ఎస్.ఐ.రివాల్వర్ ను నా భార్య తీసుకుని వారిని బెదిరిస్తూండగా...మాకు న్యాయం జరగడం కోసం జనం లోకి వెళ్తామని నా పాత్ర చెప్పడంతో నాటిక ముగుస్తుంది.


మా ఇద్దరి నటన పరాకాష్టకు చేరింది.అయితే నాకన్నా ఆమె నటన నాకు చాలా నచ్చింది. సహజంగా ఏడుపు సన్నివేశం లో గ్లిజరిన్ వాడతారు. అదేమీ అవసరం లేకుండా ఆమె కళ్ళనుండి అలవోకగా ధారాపాతం గా కన్నీళ్లు రావడం నాకు చాల ఆశ్చర్యమేసింది.


ఆ సహజ నటనకే ఆమె పది పరిషత్తులలో ''ఉత్తమ నటి'' అవార్డ్ పొందిందని సాయికృష్ణ చెప్పాడు.


మూడు వారాల్లో మొత్తం నాటిక ఫైనలైజ్ అయింది.ఒక పరిపూర్ణత వచ్చింది నాటికకు.


*****


సరిగ్గా నెల రోజుల తర్వాత నేను నివాసం ఉంటున్న పట్టణానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరులో మా నాటిక మొదటి ప్రదర్శన.


నా మేకప్ పూర్తయి నేను మొదటి దృశ్యపు దుస్తులు వేసుకోగానే మనోరమ నన్ను కళ్ళార్పకుండా అలా చూస్తూనే ఉండిపోయింది.ఆ చూడటం లో కోరిక లేదు. ఏదో అసంతృప్తి. ఆమే కనుల నీలి నీడలలో ఏదో ఆవేదన దోబూచులాడుతున్నట్టు అనిపించింది నాకు.


నాటిక చాలా బాగా వచ్చింది.వూరు ఊరంతా ప్రశంసించింది.మహిళలు అయితే ఆనందభాష్పాలు రాలుస్తూ అభినందించారు.నన్ను, మనోరమని,సాయికృష్ణ ను సన్మానించారు సర్పంచిగారు.


నాటిక పూర్తీ అయాక మేకప్ తీసేసిన అనంతరం సాయికృష్ణ ఎవరి పేమెంట్ వాళ్ళకు ఇచ్చేసాడు.


మనోరమ డబ్బు లెక్కపెట్టుకుని ''ఇదేంటి సర్? మూడువేలు కదా ...రెండు వేలు ఇచ్చారేమిటి?'' అడిగింది సాయికృష్ణ ను.


''ఈ ప్రదర్శనకు వాళ్ళు ఇచ్చిందే తక్కువ. ఈసారికి సద్దుకో.అయినా నాకెప్పుడు వచ్చినా రెండు వేలకే వస్తున్నావ్ కదా ..'' అడిగాడు సాయికృష్ణ


''మీకు లాస్ట్ టైం వచినప్పుడే చెప్పాను.మూడువేలకు పైసా తగ్గనని.మేమూ ఈ కరువు రోజుల్లో బతకాలి సర్.''


''ఈసారికి ఇంతే.మళ్ళీసారి చూద్దాం లే." మొండిగా అనేసాడు సాయికృష్ణ.


''మీకు నిజాయితీగా పనిచేసేవాళ్ళు పనికిరారు. పనిచేయించుకుని డబ్బు ఇవ్వడానికి బాధ పడతారు.మా ఉసురు మీకు తగలకపోదు.'' అంది బాధగా.


భగవంతం ''వదిలేయ్ మనూ..'' అన్నాడు.ఆమె మళ్ళీ మాట్లాడలేదు.ఆటోలు వచ్చాయి. వచ్చి టౌన్ లో పడ్డాము. సాయి కృష్ణ తో సహా అందరూ నాకు వీడ్కోలు చెప్పి ఎలాగోలా తమ గమ్యం చేరే ప్రయత్నంలో వెళ్లిపోయారు.


అర్ధరాత్రి పన్నెండు గంటలైంది. నేను బయల్దేరబోయాను.


''రేపు గుంటూర్ లో నాటకం ఉంది కదా. ఇలాగే బస్సు స్టాండ్ కే వెళ్ళిపోదామా?'' అడిగాడు భగవంతం మనోరమను.


''బస్సు స్టాన్డ్ కా... ఈ టైం లోనా...ఆ దోమలు కొట్టుకుంటూ అక్కడే పడి ఉండాలా.ఏదైనా రూమ్ తీసుకోండి.రేపు మధ్యాహ్నానికి కాదు మనం వెళ్ళాల్సింది.'' అంది మనోరమ.


''మళ్ళీ ఆ ఇన్స్టాల్మెంట్ కట్టాలి,ఇంటిపన్ను కట్టాలి అంటే కుదరదు. వచ్చిన డబ్బులు లాడ్జ్ కి తగలేస్తే ఎలా...ఆలోచించు. అయినా మనకు ఇదేమీ కొత్తకాదు కదా.'' విసుక్కున్నాడు భగవంతం.


నేను ఆలోచించాను. శ్రీమతి అమ్మాయిగారింటికి వెళ్ళింది. రావడానికి మరో అయిదు రోజులు పడుతుంది. ఆమె ఒక్కరికి ఆశ్రయం ఇస్తే తప్పు. ఇద్దరూ ఉన్నారు కదా. ఆమాటే అన్నాను.


''మీకు అభ్యంతరం లేకపోతె ఈ నాలుగైదు గంటలూ మా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి.ఉదయమే లేచి వెళ్లిపోదురుగాని.''


''మీకెందుకు సార్ శ్రమ. మాకు ఇది అలవాటే." అన్నాడు భగవంతం.


''లేదు. మనం వాళ్ళ ఇంటికి వెళదాం. పదండి సర్.'' అంది మనోరమ.


ఏమనుకున్నాడో ఆటను తన లగేజీ తో పాటు ఆమె లగేజీ కూడా తీసుకున్నాడు. ముంగ్గురం ఆటో లో ఇంటికి చేరాము.


ఇంటి హాల్లో వారికి కావలసిన పక్క బట్టలు ఇచ్చి పడక ఏర్పాటు చేసాను. భగవంతం దీవాన్ కాట్ మీద నడుం వాల్చాడు. ఆమె దీవాన్ కాట్ పక్కన తివాచీమీద స్థిరపడింది.


ఫ్రిడ్జ్ లో పాలు తీసి వెచ్చబెట్టి మంచి కాఫీ ఇచ్చాను. ''నాటకం లో పడిన శ్రమంతా ఉఫ్ అని ఎగరకొట్టేశారు మీ కాఫీతో. మీకు చాలా శ్రమ ఇచ్చాను. '' అంది మనోరమ. భగవంతం కూడా సంతృప్తి ఫీల్ అయ్యాడు.


''మీకు అభ్యంతరం లేకపోతే ఓ రెండు తెల్లకాగితాలు, పెన్ను ఇస్తారా?'' అడిగింది ఆమె.


'' అర్ధరాత్రి అంకాలమ్మ శివాలని ఇపుడు ఏంటి పడుకోక.'' విసుక్కున్నాడు భగవంతం.


''ఎప్పటి లెక్కలు అప్పుడు రాసుకోకపోతే మర్చిపోతాను. తరువాటా నా కొడుక్కి సమాధానం చెప్పుకోవాలి. మీకేం? మగ మహారాజులు. మీరు పడుకోండి." అంది గారంగా అతనితో. మూసుకు పడుకున్నాడు భగవంతం.


'' మీరు వెళ్లి పడుకోండి సర్. ప్లీజ్.''


'' ఏమన్నా అవసరమైతే లేపండి. మొహమాట పడవద్దు.'' అని నేను నా మాస్టర్ బెడ్ రూమ్ లోకి వఛ్చి బెడ్ మీద నడుము వాల్చాను.


నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఆమెతో సజీవంగా నటిస్తున్న దృశ్యాలే గుర్తుకురాసాగాయి. అరగంట పైనే హాల్లో లైట్ వెలుగుతూనే ఉంది. మరో పది నిముషాల తర్వాత నా బెడ్ దగ్గరగా ఏదో ఆకారం. ఆమె మనోరమ అని గుర్తుపట్టడానికి నాకు క్షణం సేపు పట్టలేదు. నేను కదలలేదు.


ఆమె రెండుచేతులతో నా ముఖాన్ని సున్నితంగా పట్టుకుని నుదుటిమీద, కళ్ళమీదా రెండు బుగ్గలమీద సున్నితంగా ముద్దాడింది. ఆమె వెచ్చని కన్నీటి బిందువులు నా బుగ్గలమీద. ..అప్రతిభుడనైపోయాను ఆమె చర్యకి.


"థాంక్యూ సర్. థాంక్యూ సోమచ్.'' అని గుసగుసగా అనేసి తన పక్కదగ్గరకు వెళ్ళిపోయింది.


తరువాత ఎపుడు నిద్రపట్టిందో నాకు తెలీదు. అలవాటుగా అయిదు గంటలకు ఠక్కున మెలకువ వచ్చింది. దేవునికి నమస్కరించుకుని కళ్ళు తెరిచాను. నిద్ర లేమితో కళ్ళు ఒకటే మంటలు.నెమ్మదిగా కళ్ళువిప్పాను. హాల్లో నేలమీద అప్పటివరకు మమేకమైన రెండు దేహాలు అలారం గంటకు ఉలిక్కి పడి విడివడ్డాయి.


భగవంతం ఆమె మీదినుంచి లేచి పక్కన కూర్చుంటూ '' తొందరగా తెములు. ఎంత తొందరగా అక్కడకి చేరుకుంటే అంత మంచిది. ''


ఆమె వెంటనే కామన్ బాత్రూములోకి వెళ్ళిపోయింది. మరో గంటలో వాళ్ళు బయలుదేరిపోయారు.


కనీసం వందసార్లయినా నాకు కృతజ్ఞతలు చెప్పారు. నేను నా పారితోషకంగా తీసుకున్న రెండువేలూ ఆమెకు ఇచ్చాను.


'' ఇదేమిటి సర్?'' అందామె ఆశ్చర్యపోతూ భగవంతం కేసి చూసింది. ''తీసుకో '' అన్నాడతను.


''మీలోని నటీమణికి నా బహుమతి. నిన్న రాత్రి మొదటి ప్రదర్శన లో మీ నటన నభూతోనభవిష్యతి. అంతబాగా చేశారు.మరోలా భావించకండి.అన్నట్టు మీరు పాటించగలిగితే ఒక్క మాట. ప్రతీ ప్రదర్శనకూ వచ్చే పారితోషకంలో ఒక అయిదువందలు ఒక అక్కౌంట్ లో వేయండి. మీ వృద్ధాప్యంలో మీకు సాయపడుతుంది ఆ డబ్బు. ఎవరిమీదా ఆధారపడక్కర్లేదు.ప్ర్రాణం మీదకు వస్తే తప్ప ఆ డబ్బు వాడకండి.ఇది నా అభ్యర్ధన. ''


ఆమె కృతజ్ఞత నిండిన కళ్ళతో చూసింది. ''ఇంతవరకు ఇటువంటి సలహా మరెవ్వరూ నాకు ఇవ్వలేదు సర్ .ఆ పొదుపు కార్యక్రమం మీరిచ్చిన ఈ బహుమానం తోనే ప్రారంభిస్తాను సర్. ''


''వెళ్లొస్తాం సర్.'' భగవంతం కదిలాడు. ఆమె బరువైన కళ్ళతో నాకు వీడ్కోలు చెప్పింది.


*****


వాళ్ళు వెళ్ళాకా పక్కబట్టలన్నీ వాషింగ్ మెషీన్ దగ్గర పడవేసాను. పనిమనిషి వచ్చి ఉతుకుతుంది.


నా బెడ్ రూమ్ లోకి వచ్చి పక్క దులిపి వేద్దామని దిండు తీశాను. దాని అడుగున నాలుగు మడతలుగా పెట్టిన తెల్లకాగితం.


నలిపి పడబోయిన వాడినల్లా అక్షారాలు కనిపించేసరికి దానిని విప్పాను.


"శ్రీ భగవాన్ గారికి.


మనోరమ హృదయపూర్వక నమస్కారాలు. జీవన ప్రయాణం లో ఎందరో పరిచయమౌతుంటారు. విడిపోతుంటారు. కానీ ఒకరిద్దరు మాత్రం ప్రపంచ వింతల్లా శాశ్వతంగా గుర్తుండిపోతారు.


మిమ్మల్ని చూసిన మొదటి క్షణమే మీ అందానికి అచ్చెరువొందాను. చూడగానే ఎంతటి ఆడదైనా ఈయన నా భర్త అయితే బాగుండును అనుకునే సౌందర్యం మీది. సహజంగా నాటక రంగంలో నటించే ఎందరో మగవాళ్ళను చూసాను. వీళ్ళకి లేని దుర్వ్యసనం ఉండదు. ముఖ్యంగా తమతో నటించే నటీమణులను ఖఛ్చితంగా ట్రాప్ చేస్తారు. నిజమైన కళాభిమానంతో నాటక సంస్థలను నడిపే మగవాళ్ళు నిబద్దతతో నిర్వహించడం నాకు తెలుసు. కానీ గత్యంతరం లేని పరిస్థితిలో ఈ రంగం లోకి వఛ్చిన స్రీలు మాత్రం వయసు ఉన్నంతవరకు సంపాదించుకుంటాం. ఆలా సంపాదించుకునే అవసరం లో ఎవరికో ఒకరిని నమ్ముకుని వారి అవసరాలు తీరుస్తూ బతకాల్సిందే.


నేను ఎందరో నటులను చూసాను. ఒక సీను రిహార్సల్స్ అవగానే సిగరెట్టుకో, మందుకో పోతారు. రాత్రికి అయితే సరేసరి. కానీ మీరు మీ ఆహారం మీరే తెచ్చుకోవడం, సీనుకు ముందు, తరువాత కూడా మీలో మీరు రిహార్సల్స్ చేసుకోవడం చూసాను. ఇక స్టేజి ఎక్కినప్పుడు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే మీ అంకితభావం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ప్రవృత్తిలో ఇంట క్రమశిక్షణ పాటించే నటుడిని నేను ఇంతవరకూ చూడలేదు. మీరు నాకు ఆజన్మాన్తమ్ తోడుగా లభిస్తే? ఎంతబాగుంటుందీ. ఇది ఒక తీరని అత్యాశ అని నాకు తెలుసు.


ఎవరి సంగతి ఏమో గానీ నేను మాత్రం ''(అను) రాగం ఎరుగని కోయిలను.'' తరాలు మారినా, యుగాలు మారుతున్నా, ఆడది ఎప్పుడూ సమాజానికి ఆటవస్తువే. నా తండ్రి నా తల్లిని మోసం చేస్తే చదువులేని ఆమె నాటకాన్ని ఆశ్రయించింది. ఆమె కుమార్తెగా చక్కగా చదువుకున్ననేను కళ్యాణ మంటపం ఎక్కినా తన అవసరం తీరాకా అనుమానంతో భర్త అనే మగవాడు వదిలేస్తే ఏ ఉద్యోగానికి వెళ్తే ఆ వుద్యోగం లోనే ఆకలి కళ్ళతో మృగాళ్లు. ఇక నాకు గుర్తింపు ఎప్పుడు? అనుకున్ననేను ఈ రంగానికి రాక తప్పలేదు సర్. మంచి నటిగా గుర్తింపు పొందాను. కానీ నాకు నాటకాలు రావాలంటే మగవాడి గాలానికి చిక్కక తప్పలేదు. అందుకే భగవంతం గారికి లొంగక తప్పలేదు.


నాకు ఒకే అబ్బాయి. మంచివాడు. బాగా చదువుకుంటున్నాడు. ఈసంవత్సరం తో ఇంజినీరింగ్ పూర్తయిపోతుంది. క్యాంపస్ లో కూడా సెలెక్ట్ అయ్యాడు. వాడు స్థిరపడితే చాలు. నా బతుకు నేను బ్రతకగలను. ఆనాడు ఈ రంగాన్ని వదిలేస్తాను. నా ఈ కధ మీకు చెప్పుకోవాలనిపించింది. స్త్రీని స్త్రీగా గౌరవించే మీలాంటి ఉత్తమునితో నటించే అవకాశం వచ్చినందుకు గర్విస్తున్నాను. మళ్ళీ జీవితం లో మీ ఇంటికి వచ్చే అవకాశం దొరక్కపోవచ్చు .అందుకే నా మనసు విప్పి ఈ రెండు వాక్యాలు మీముందు ఉంచుతున్నాను. ఈ ఒక్కరాత్రి నాజీవితంలో మధురమైన జ్ఞాపకం. ఉంటాను.


నమస్కారాలతో


మనోరమ. ''


ఒకటికి రెండు సార్లు చదివిన నా హృదయం ఆమె పట్ల జాలితో నిండిపోయింది. ఆర్ద్రత తో చెమర్చిన కళ్ళను తుడుచుకుని అగ్గిపుల్లతో ఆ ఉత్తరాన్ని బూడిద చేసాను.


సమాప్తం



Rate this content
Log in

Similar telugu story from Drama