ప్రేమకు లేదు మరణం
ప్రేమకు లేదు మరణం


-
సృజన...తృళ్లి పడింది. వివేక్ మాటలు వినగానే...ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి. ఆఫీసు పనవ్వగానే..ఒక నిమిషం కూడా అక్కడ వుండబుద్ది కాలేదు.హాండ్ బ్యాగ్ ని భుజాన్న వేసుకుని...హడావిడిగా బయటపడింది.
అసలు తనగురించి ఏమనుకున్నాడు...? కలిసి పనిచేస్తున్నంత మాత్రాన్న...ప్రపోజ్ చేసేయడమేనా...? అలా చెప్పేముందు నేనేంటి...నామనసేమిటి అని కొద్దిగైనా ఆలోచించాలి కదా...? ఒక పక్క అతనిపై కోపం వచ్చినా...యువతలో వుండే ఆ సహజ లక్షణానికి జాలేసింది ఆమెకి.
ఆటో ఎక్కి...ఇంటికి చేరిందే గానీ...ఆలోచనలతో తల వేడెక్కిపోయింది. టీ తాగి తలనొప్పి మాత్ర వేసుకున్నాకా గానీ...మానసికంగా పడిన ఆ అలసట తీరలేదు.
కళ్ళముందు...ప్రకాష్ కనిపిస్తున్నాడు.
ప్రకాష్ కి నేనంటే ఎంత ప్రేమ...? నన్ను విడిచి ఒక్క రోజైనా వుండేవాడా...? ఆఫీస్ పనిమీద హైద్రాబాద్ వెళ్తూ...నన్ను కౌగలించుకుని ఏడ్చినంత పనిచేశాడు. చుట్టూ ఎవరైనా చూస్తున్నారేమో అని కూడా పట్టించుకోకుండా. నాకైతే చిన్నపిల్లాడి మనస్తత్వంలా అనిపించి...నవ్వేసాను.
అలా నవ్వుతున్న నన్ను చూసి..నిలదీసి అడిగాడు.
"నేను వెళ్తున్నందుకు నీకు కొంచెం కూడా బాధ లేదు కదూ" అని.
"మళ్లీ రెండు రోజుల్లో వచ్చేస్తావుగా" అన్నాను.
" నీకు రెండు రోజులేమో...నాకు రెండు యుగాలు తెలుసా..."? అన్నాడు నన్ను కొంచెం దూరంగా నెట్టి.
"పోనీ...నేను కూడా నీతో రమ్మంటావా..."? అంటూ అడిగాను నవ్వును ఆపుకుంటూ.
ఊహూ...అంటూ బుర్ర అడ్డంగా ఊపి...నా కడుపుపై ప్రేమగా నిమిరాడు. "ఒద్దు సృజనా...నువ్వు వస్తే...మన ప్రేమకు ఊపిరి పోసుకుంటున్న ఈ బుజ్జిగాడు ప్రయాణంలో నలిగిపోతాడు" అంటూనే..నాకు వంద జాగ్రత్తలు చెప్పి ...వెళ్లలేక వెళ్లలేక వెళ్ళిపోయాడు.
అలా వెళ్ళాడే గానీ...నాకూ తోచలేదు. ప్రకాష్ లేని ఆ రెండురోజులూ మనసంతా... మా ఏకాంతపు తలుపులే. అప్పటికి గానీ తెలియలేదు నాకు..ప్రకాష్ కి నామీద, నాకు ప్రకాష్ మీద ఉన్న ప్రేమెంతో...? ప్రేమకు కొలమానమంటూ ఉండదేమో...? నన్ను అంత ప్రేమలో ముంచేసే...హైద్రాబాద్ నుంచి తిరిగివస్తుండగా....ట్రైన్ ఆక్సిడెంట్ లో తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగి ఒక సంవత్సరం కావొస్తుంది.
*** **** ****
"ఇప్పుడు చెప్పు&n
bsp;వివేక్...ఇదీ నాకథ. నాభర్త ప్రకాష్ చనిపోవడంతో....డిగ్రీ పాసై ఉన్నందుకు...ఆయన ఉద్యోగం నాకిచ్చారు. ఈ ఆఫీసుకు నువ్వు కొత్తగా వచ్చి నెల్లాళ్ళైనా కాలేదు. అప్పుడే నాకు ప్రపోజ్ చేయడం గొప్పనుకుంటున్నావా?"
అసలు పూర్వపు రోజులే నయమేమో..? చిన్న వయసులో భర్త పోయినా...వారి జ్ఞాపకాలతో తెల్లచీరను ధరించి...నుదుట బొట్టు లేకుండా...యే పరాయి మగాడినీ ఆకర్షించకుండా ఉంటూ భర్త తలపుల్లోనే వుండేవారు.
వంట మనిషిగానో....కుట్టుపనులు నేర్చుకుని బట్టలు కుట్టుకుంటూనో..మరేవిధంగానైనా...తమ పిల్లల్ని పోషించడానికి పుట్టింటికీ,అత్తింటికీ భారమవ్వకూడదని .. ఏపని చేసుకోడానికైనా నామోషీ పడేవారే కాదు. వితంతువులకు అప్పటి రోజులు పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది.రోజులు మారాయి. అంతా చదువుకోవడం వలనే భర్త పోయినా భార్యలకు ఉద్యోగాలు వస్తున్నాయి. నాకూ అలాగే ఆయన చేసే ఉద్యోగం దక్కింది. ఎంత నాగరికత పెరిగితే మాత్రం...కలిసి ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన్న...కలిసి జీవించాలనే కోరిక మాత్రం నాకు లేదు.
సృజన చెప్పడం పూర్తి చేసి...వివేక్ కి తనపై ప్రేమ తుడిపేయాలనుకుంది. కానీ..ఆమె చెప్పింది విన్నాకా...వివేక్ కి ఆమెపై ప్రేమ మరింత పెరిగింది.
"చూడు సృజనా...! నీ గతం విన్నాకా నీపై మరింత ప్రేమ పెరిగిందే గానీ...తరగలేదు. ఒక చంటిబిడ్డ తల్లిగా నిన్ను విధి వెక్కిరించినా... నీకు తోడై నిలబడాలన్న కోరిక మరింతగా పెరిగిందే తప్ప తరగలేదు అంటూ...ఆదర్శం వల్లిస్తున్న వివేక్ మాటల్ని...ఇక చాలించమంటూ గట్టిగా అరిచి ఆపేసింది.
సృజన ఆవేశానికి...ఖంగు తిన్నట్టు చూసాడు వివేక్.
ఆ వెంటనే తానే కంట్రోల్ చేసుకుంటూ...జాలిగా చూసింది అతన్ని.
"నీకెలా చెప్తే అర్థం అవుతుంది.. వివేక్..?" ఈ ప్రేమ గురించి చెప్పాలంటే...అది ఈవిశ్వంలో అనంతం. షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టి తన ప్రేమ నిరూపించుకున్నాడు. వాళ్ళ ప్రేమకు చిహ్నమైన ఆ కట్టడాన్ని ఎందరో సందర్శకులు చూసి ఆహా అని అనుకోకుండా ఉండలేరంటే....వారి ప్రేమ ఎంత అనంతమైనదో...మరణం లేనిదో అర్థం చేసుకో. అలాగే ...నా భర్త ప్రేమతో నాకిచ్చిన మాముద్దుల కొడుకు నాకున్నాడు. వాడిలో నాభర్త రక్తం ప్రేమతో నిండిపోయింది. వాడినలా చూస్తుంటే...నా భర్త ప్రేమ చూపులే వాడికళ్ళల్లో ప్రతిబింబిస్తాయి. అందుకే అనిపిస్తూ ఉంటుంది నాకు..నా భర్త మరణించినా గానీ...మా ప్రేమకు మరణం లేదు." అంటూ వివేక్ కి తాను చెప్పాల్సింది చెప్పేసి...కన్నకొడుకుని గుండెలకు హత్తుకోవాలనే ఆత్రుతతో... వడివడిగా నడుచుకుంటూ అక్కడనుంచి వెళ్ళిపోయింది సృజన....!!