gowthami ch

Drama

4.9  

gowthami ch

Drama

ఒంటరిగా మొదటి రాత్రి

ఒంటరిగా మొదటి రాత్రి

3 mins
2.9K


"ఏమే రాధా... అబ్బాయి కత్తి లాగున్నాడే ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి." అంటూ రాధని ఆటపట్టిస్తుంది సుమ.


"అమ్మా సుమ అమ్మాయిని తీసుకొని రా" ...అంటూ బయట నుండి పిలుపు వినపడి రాదని తీసుకొని బయటకి నడిచింది సుమ.


"రామ్మా రాధ, ఇలా వచ్చి కూర్చో" అంటూ పిలుస్తున్న నాన్న గారి మాట ప్రకారం వెళ్లి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంది రాధ.


"తనే అండి మా అమ్మాయి రాధ. మీరేమైన అడగాలి అనుకుంటే అడగండి" అన్నాడు వాళ్ళ నాన్న .


తల వంచుకొని కూర్చున్న రాధ కి ఎదురుగా ఉన్న అబ్బాయి కాళ్ళవైపు చూసింది. అలానే తల ఎత్తకుండానే కళ్ళతోనే అబ్బాయిని కిందనుండి పై వరకు చూడడానికి ప్రయత్నించింది కానీ తల ఎత్తకపోవడం వలన కొంత వరకు మాత్రమే చూడగలిగింది.


ఎప్పుడెప్పుడు అబ్బాయిని చూడు అని చెప్తారా అని ఎదురు చూస్తోంది రాధ. "అమ్మా రాధ ఒకసారి అబ్బాయిని చూడు" అని వాళ్ళ అమ్మ అనడంతో మెల్లగా తల పైకెత్తి అబ్బాయివైపు చూసింది.


తెల్లటి ఆకారం, చక్కటి నవ్వు అన్నిటికి మించి అతనిని చూసిన వెంటనే ఏదో తెలియని ఒక ఆకర్షణ కలిగింది రాధకి. మెల్లిగా అబ్బాయి కళ్ళలోకి చూసింది అనుకోకుండా అబ్బాయి కూడా రాధ ని చూడడంతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.


మొదటి చూపులోనే ప్రేమ పుట్టడం అంటే ఇదేనేమో అనుకుంది రాధ తన మనసులో. పెద్దలు ఏవేవో మాట్లాడుకుంటున్నారు అవేమి వీళ్ళ చెవులని చేరడంలేదు. ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు.


"అరే కృష్ణ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలంటే అలా వెళ్లి మాట్లాడు." అంటూ కృష్ణ వాళ్ళ నాన్న అనడంతో టక్కున లేచి బయటకి వెళ్ళిపోయాడు కృష్ణ. "రాధ నువ్వు కూడా వెళ్ళు" అంటూ వాళ్ళ నాన్న సైగ చేయడంతో రాధ కూడా మెల్లగా లేచి బయటకి నడిచింది.


ఇద్దరూ ఒకరి ఎదురుగా ఒకరు నిలబడి ఉన్నారు. కొంత సేపు మౌనం తరువాత మెల్లగా "హాయ్..." అంటూ పలకరించాడు కృష్ణ.


"హాయ్..." అంటూ నవ్వింది రాధ.


"నాపేరు కృష్ణ."


"నా పేరు రాధ."


"నేను ఒక సోల్జర్ని. ఈ విషయం తెలిసే ఉంటుందనుకుంటాను?"


తెలుసు అన్నట్లు తల ఆడించింది రాధ.


"నేను ఎప్పుడు బోర్డర్ కి వెళ్ళవలసి వస్తుందో చెప్పలేను. ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడా అక్కడే ఉండిపోవలసి వస్తుంది. ఇవన్నీ తెలిసే మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కదా. ఇందులో ఏమీ బలవంతం లేదు మీకు నచ్చకుంటే ఇప్పుడే చెప్పేయొచ్చు?"


"అన్నీ తెలిసే ఒప్పుకున్నాను. దేశాన్ని ప్రేమించే వాడు తప్పకుండా భార్యని ప్రేమిస్తాడు అని నా నమ్మకం. అందులోనూ ఒక దేశాన్ని కాపాడే సైనికుడిని పెళ్లి చేసికుంటున్నందుకు ఎంతో గర్వంగా కూడా ఉంది." అంది రాధ.


"మీరు నాకు మొదటి చూపులోనే నచ్చారు కానీ ఇప్పుడు ఇంకా నచ్చారు." అన్నాడు కృష్ణ.


"నేను మిమ్మల్ని చూడక ముందే నచ్చారు." అంది రాధ.


"అదెలా?" అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ.


"కష్టాల్లో ఉన్న తన స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా ఒక్క రూపాయి కూడా కట్నం ఆశించకుండా తన కూతుర్ని ఇంటి కోడలిగా చేసుకోవడానికి సిద్ధమైన గొప్ప వారు మీ నాన్న గారు.


నాన్న గారి మాటకి గౌరవమిచ్చి కనీసం అమ్మాయిని కూడా చూడకుండా పెళ్ళికి ఒప్పుకున్న గొప్ప మనసున్న వారు మీరు. మీరు అలా అన్నారని తెలిసిన మరుక్షణమే మీ మీద అభిమానం కలిగింది. ఆ తరువాత మీ గురించి మానాన్న చెప్తుంటే విని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అనుకున్నాను."


"అవును రాధ, నువ్వన్నది నిజమే మా నాన్న నిన్ను పెళ్లి చేసుకోమన్న వెంటనే ఒప్పేసుకున్నాను. కానీ నాన్నగారే బలవంతంగా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసారు."


"ఇప్పటికే చాలా సమయం అయినట్లు ఉంది ఇంక లోపలికి వెళదాం లేకుంటే వాళ్లే ఇక్కడికి వచ్చేస్తారేమో!" అంటూ నవ్వింది రాధ.


సరే అన్నట్లు తల ఊపి ఇద్దరు లోపలికి వెళ్లారు.


"సరే రా అయితే మేము ఇంక బయల్దేరుతాము త్వరలో పెళ్లికి ఒక మంచి ముహూర్తం చూసి కబురు పంపుతాం." అని అందరూ లేచి రాధని ఆశీర్వదించి వెళ్లిపోయారు.


ఒక నెలలోనే మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ పెళ్లి చేశారు. ఆ రోజు కాకుండా తరువాతి రోజు రాత్రి కి వాళ్ళ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టారు.


ఆ రోజు రాత్రంతా ఇద్దరికీ నిద్ర పట్టలేదు ఒకరిగురించి మరొకరు ఆలోచిస్తూ ఆలోచనలలో తెలిపోతూ గడిపారు. ఉదయం లేచి బయటకి వచ్చిన కృష్ణ కి అప్పుడే స్నానం చేసి తల ఆరబెట్టుకుంటున్న రాధ కనపడింది చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో వెంటనే వెళ్లి వెనక నుండి రాధని హత్తుకోబోయాడు ఇంతలో "అమ్మాయ్ రాధ" అంటూ వస్తున్న వాళ్ళ అమ్మని చూసి టక్కున లోపలికి వెళ్ళిపోయాడు.


"అయ్యో ఇప్పుడే రావాలా అమ్మ కూడా." అని బాధపడుతుండగా "సరేలే రా కృష్ణ ఇంకెంతో సేపు లేదుగా రాత్రి వరకు కొంచెం ఓపిక పట్టు రా కృష్ణా" అంటూ మనసు హెచ్చరించడంతో ఊరుకున్నాడు.


మొదటి రాత్రికి ఇంక ఒక గంట సమయం ఉంది అనగా రాధ గదిలోకి వచ్చిన కృష్ణ మెల్లగా "రాధ..." అని పిలిచాడు.


అద్ధం ముందు కూర్చొని సింగరించుకుంటున్న రాధ వెనక్కి తిరగకుండానే "అదేంటి అండి మీరు ఇలా వచ్చారు ఈ సమయంలో. ఇంక ఒక్క గంట ఓపికపట్టండి" అంటూ నవ్వుతూ వెనక్కి తిరిగిన రాధ యూనిఫామ్ లో ఉన్న భర్తని చూసి ఆశ్చర్యపోయింది.


"రాధ , అది..." అంటూ బాధగా ఏదో చెప్పబోతున్న భర్తని ఆపమని సైగ చేసి , దగ్గరకి వచ్చి "మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారో నాకు అర్ధమైంది. ఇప్పుడు మీ అవసరం దేశానికి అవసరం అయింది అంతేగా?"


అవును అన్నట్లు తల ఊపాడు కృష్ణ.


"మీరు క్షేమంగా వెళ్లి రండి. ఇందులో బాధ పడవలసి పనిలేదు. మనం క్షేమంగా ఉండలంటే ముందు ఈ దేశం క్షేమంగా ఉండాలి. ఇంకేమి ఆలోచించకుండా వెళ్లి రండి అంటూ భర్తని దగ్గరకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టింది."


"థాంక్స్ రాధ నీలాంటి అర్ధం చేసుకునే భార్య నాకు దొరకడం నిజంగా నా అదృష్టం" అంటూ భార్య ని గట్టిగా హత్తుకొని అందరి దగ్గరా వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు.


ఆ రాత్రికి భర్త ని తలుచుకొంటూ రాధ , భార్యని తలుచుకొంటూ కృష్ణ వాళ్ళ పెళ్లి నాటి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ, వాళ్ళ మొదటిరాత్రిని ఒంటరిగా గడపవలసి వచ్చింది.


Rate this content
Log in

Similar telugu story from Drama