gowthami ch

Drama

4.3  

gowthami ch

Drama

చెరగని చిరునవ్వు

చెరగని చిరునవ్వు

5 mins
554


రాధా , కృష్ణ దంపతులకు సీత , గీత , ఉమ అని ముగ్గురు ఆడపిల్లలు. రాధ ఎంత చెప్పినా వినకుండా మగపిల్లవాడి కోసం ఎదురుచూసి...ఎదురుచూసి ఇలా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చేలా చేశాడు..


"మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనకు ఇంతమందిని పోషించే స్థోమత లేదు అని

తెలిసి కూడా, మగపిల్లవాడి మీద కోరికతో ఆ క్షణంలో ఏమి ఆలోచించలేదు, కానీ పిల్లలు ఎదిగేకొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి ఇప్పుడు వీళ్ళని ఎలా పోషించాలో కూడా మీరే చెప్పండి" అని అడిగింది రాధ వచ్చే కన్నీటిని అదుపుచేసుకుంటు. 


"ఏమో అదంతా నాకు తెలియదు, నారు పోసిన వాడే నీళ్లు కూడా పోస్తాడులే, వీళ్ళని మనకు ప్రసాదించిన ఆ దేవుడే వాళ్ళని పోషించడానికి కూడా ఏదో ఒక మార్గం చూపకపోడు" అన్నాడు కృష్ణ అన్నం తినడానికి సిద్ధమై చేతులు కడుక్కుంటూ. 


"మనం చేసిన పనికి ఆ దేవుడి పైన భారం వేస్తే ఎలా? మనం చేయాల్సింది మనం చేస్తేనే కదా ఆయన అయినా మనకు సహాయం చేసేది, ఊరికే మాటలతో కడుపులు నిండవు కదా" అంది కంచంలో అన్నం వడ్డిస్తూ. 


"అయితే నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావో చెప్పు?" అన్నాడు కోపంగా కంచం ముందు కూర్చొని అన్నం కలుపుతూ. "మీరు పని చేసేది ఒక సాధారణ గుమస్తా కాబట్టి పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆ సంపాదన మన అవసరాలకు సరిపోదు. పోనీ ఇంకేమైనా మార్గం చూస్తారేమో అని ఇప్పటివరకు ఎదురుచూసాను. ఇక మీవల్ల కాదని అర్ధమైంది. అలా అని పిల్లల్ని పస్థులు ఉంచలేను.


అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను, నాకు ఎలాగో కుట్టు పని వచ్చుకాబట్టి మీ సర్ ని అడిగి కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఒక కుట్టు మెషిన్ కొనివ్వండి. నాకు తోచిన విదంగా నేను 4 రాళ్లు సంపాధిస్తాను" అంది రాధ భర్త సమాధానం కోసం ఎదురుచూస్తూ.


కొంతసేపు ఆలోచించిన తరువాత "సరేలే, ఈరోజే మా సర్ ని అడిగి చూస్తాను" అన్నాడు. అన్నట్లుగానే తన భార్య కోరిక మేరకు రాధకి ఒక కుట్టు మెషీన్ కొనిపెట్టాడు. ఇలా ఇద్దరూ కష్టపడి సంపాదించిన దాంట్లో పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోలేకపోయినా ఉన్నంతలోనే వాళ్ళ అవసరాలు తీరుస్తూ వచ్చారు. 


భార్య సంపాదనతో తన భారం తగ్గుతుంది అనుకున్నాడే తప్ప ఏరోజు భార్య గురించి పట్టించుకోలేదు. ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోతుందో లేదో కూడా ఎన్నడూ అడగలేదు. భార్య సంతోషంగా ఉందొ లేదో కూడా తెలుసుకునే వాడు కాదు. 


కృష్ణ సంపాదన అంతా పిల్లల చదువులకు, స్కూల్ బుక్స్ కి , ఇంటి అద్దె , తన అవసరాలకు పోను ఇంకా మిగిలితే పొదుపుచేసేవాడు లేకుంటే అదికూడా లేదు. రాధ మాత్రం రాత్రి పగలు అన్న తేడా లేకుండా మిషన్ కుట్టి తన సంపాదనలో ఇంటి ఖర్చులకి పోను మిగిలిన డబ్బుతో ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొంచెం కొంచెం గా బంగారం చేర్చి పెడుతూ వచ్చింది.


పిల్లలు ఎదిగే కొద్దీ తనదగ్గర దాచిన డబ్బు సరిపోకపోవడంతో, ఇంటింటికి తిరిగి బట్టలు అడిగి తెచ్చుకొని ఎంతో తక్కువ ధరకు కుట్టి ఇవ్వడంతో రోజు రోజుకి ఖాతాలు పెరుగుతూ వచ్చాయి, కానీ కుట్టడానికి సమయం సరిపోయేది కాదు. పండగ రోజుల్లో రాత్రి కూడా నిద్ర మేల్కొని మరి కుట్టేది. ఇలా ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ వచ్చింది. 


ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఎన్నడూ తన మొహం మీద చిరునవ్వు చెరిగేది కాదు. తన పని తనం చూసిన అందరూ రాధని ఎంతో అభినందించేవారు. 


ఎప్ప్పుడూ ఏ పెళ్ళిళ్ళకు కానీ , పేరంటాళ్ళకు కానీ బయటకి వెళ్ళేది కాదు. ఒక్క గుడికి తప్ప. ఒకరోజు వాళ్ళ బాబాయ్ గారి అబ్బాయిది పెళ్ళి ఉందని అందరూ తప్పకుండా రావాలని వాళ్ళ పిన్ని పదే పదే పిలవడంతో ఇక మొహమాటంగా వెళ్ళక తప్పలేదు. పిల్లలకి మంచి మంచి బట్టలు వేసి బాగా అలంకరించి మెడలో తను కొన్న బంగారంతో చిన్న పాటి గొలుసులు చేయించి వేసి అందంగా తయారుచేసి పెళ్లికి తీసుకెళ్లింది.


పెళ్లి మొదలవ్వడానికి ఇంకో గంట సమయం ఉందనగా రాధ వాళ్ళ అమ్మగారు రాధని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్ళి తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి రాధ మెడలో వేసింది. తన దగ్గర ఉన్న చీరలలో ఒక మంచి చీర ఇచ్చి కట్టుకోమంది. 


"ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా. నేను కట్టుకున్న చీర చాలు నాకు" అంటున్నా తల్లి వినకపోవడంతో అన్యమనస్కంగానే తీసుకుని కట్టుకుంది రాధ.


"నువ్వు ఎప్పుడూ ఇంతే. మరలా ఏమన్నా అన్నాను అంటే బాధపడతావు. ఎప్పుడూ వాళ్ళ గురించే కాకుండా అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించుకో, అంటూ పక్కనే పెళ్ళి మండపం దగ్గర ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ అంది. చూడు! ఎలా తయారయ్యావో సరిగా భోజనమన్నా చేస్తున్నావా లేదా? పోనీ నేనేమైనా సహాయం చేస్తాను అంటే నాకు పెళ్ళి అయింది ఇంకా పుట్టింటి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టంలేదు , అది మా వారికి అవమానం అని ఏవేవో చెప్పి నా చేతులు కట్టేస్తావు. అయినా..!! ఎప్పుడూ నా పిల్లలు , నా మొగుడు అనుకోవడమే తప్ప వేరే ధ్యాసే లేదా నీకు?"


"ఎందుకు లేదమ్మా" 


"ఏంటే అది?"


"నువ్వే "అంటూ నవ్వి అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచిస్తానులే బాధపడకు" అంది రాధ.


"ఇంత భారాన్ని ఎలా మోస్తున్నావే!? అంత బాధలో కూడా నవ్వు ఎలా వస్తుందే నీకు." అంటూ బాధపడింది రాధ తల్లి శకుంతల.


"నాకేం బాధలు ఉన్నాయమ్మా? ఒక తల్లిగా , భార్యగా ఇవన్నీ నా బాధ్యతలే తప్ప భారం కాదు. నా భర్త , నా పిల్లలు సంతోషంగా ఉన్నన్ని రోజులు నాకు ఏ బాధలు ఉండవమ్మా." అంది రాధ తల్లిని ఓదారుస్తూ.


ఇదంతా బయట తలుపు చాటునే నిలబడి వింటున్న కృష్ణ, తన భార్య మాటలకి ఎలా స్పందించాలో తెలియక చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


పెళ్ళి కార్యక్రమం మొదలైంది. అందరూ వచ్చి కూర్చున్నారు, పంతులు గారు మంత్రాలు చదవడం మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రం చదివి దాని అర్ధం చెప్తూ ఉంటే కృష్ణ ఎంతో శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు. 


"అనవసరంగా నా మూర్ఖత్వంతో నా భార్య మాట వినకుండా మగపిల్లవాడి మీద ఉన్న ఇష్టంతో నా స్వార్ధం చూసుకున్నానే కానీ తరువాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆలోచించలేదు. 

నేను మగావాడిని ఎలా తిరిగినా ఎవ్వరూ పట్టించుకోరు, కానీ ఆడవాళ్లు బయటకి వస్తే ముందుగా వాళ్ళ వేష ధారణ , అలంకరణ చూసిన తరువాతే మాట కలుపుతారు. అందుకేనేమో ఇన్నాళ్లూ నా భార్య ఎప్పుడు బయటకు రాలేదు.


తను ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా సొంత తల్లి దగ్గర కూడా ఎన్నడూ చెయ్యి చాపి ఏదీ అడగలేదు. అది కూడా నా కోసం. నాకోసం ఇన్ని ఆలోచిస్తున్న నా భార్యకు నేను ఎన్నడూ ఏమీ ఇవ్వలేదు సరికదా తన కష్టాన్ని కూడా గుర్తించలేదు." అని భార్యవైపు చూసి బాధపడ్డాడు. 



పంతులు గారు ఎంతో నిదానంగా చక్కగా పెళ్ళి తంతు ముగించి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు.


పెళ్ళికి వచ్చిన వారంతా దంపతులని ఆశీర్వదించి 

భోజనాలు చేసి తాంబూలాది సత్కారాలు స్వీకరించి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొందరు అయిన వాళ్ళు , దగ్గరి బంధువులు మాత్రం పిచ్చా పాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.


పిల్లలంతా ఆడుకుంటూ తిరుగుతున్నారు. అందరితో మాట్లాడుతూ నవ్వుతూ ఆనందంగా ఉన్న తన భార్యనే చూస్తూ "నిన్ను ఇన్ని రోజులు ఎంతగా బాధ పెట్టానో ఇప్పుడే నాకు అర్ధమవుతుంది రాధ. మన పెళ్ళి జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా, ఏనాడు నీ కంటూ నువ్వు ఏదీ అడగలేదు. మగ బిడ్డ కావాలన్న నా పంతం వల్ల నువ్వు నీ సుఖాలను అన్నింటినీ త్యాగం చేశావు. ఇక అలా జరగనివ్వను" అనుకుంటూ కూర్చున్న చోటునుండి టక్కున లేచి రాధ ని సమీపించి, చెయ్యి పట్టుకొని స్టేజి పైకి ఎక్కి "నేను ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక విషయం చెప్పాలి.


 నాకు పెళ్ళి అయిన రోజు నుండి ఇప్పటి వరకు నా భార్యకి నా చేత్తో ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు. ఒక్కరోజు కూడా బయటకి తీసుకెళ్ళలేదు. ఏ పెళ్ళిళ్ళకు , పేరంటాళ్ళకు కూడా తీసుకెళ్ళలేదు అయినా ఏ రోజు ఆమె నన్ను నోరు తెరచి నాకు ఇది కావాలి అని అడగలేదు. 


ఇన్ని సంవత్సరాలు నా కోసం నా పిల్లల కోసం ఎంతో కష్టపడింది. మా సంతోషంలోనే ఆమె సంతోషం చూసుకుంది. బ్రతికినంత కాలం మాకోసమే బ్రతుకుతుంది అని ఇప్పుడే తెలిసింది. అటువంటి ఆమెకి నేను ఏమి ఇవ్వగలను. అందుకే మీ అందరి సమక్షంలో ఆమెకి ఒక మాట ఇస్తున్నాను. అంటూ పిల్లలు ముగ్గుర్ని పైకి పిలిచి భార్య చేతిలో చేతులు వేసి ఇక నుంచి ఆమె సంతోషమే మా సంతోషం . ఆమెకోసమే నా జీవితం" అంటూ భార్యని తన చేతులతో ఎత్తుకున్నాడు.


వాళ్ళిద్దర్నీ అలా చూసిన బంధువులు అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. అల్లుడి మాటలు విన్న శకుంతల కళ్ళు ఆనందబాష్పాలతో తడిచాయి. పెళ్ళి అయిన ఇంత కాలానికి రాధ మొహంలో నిజమైన సంతోషం కనపడింది కృష్ణ కి. 




 


Rate this content
Log in

Similar telugu story from Drama