Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

gowthami ch

Others


4  

gowthami ch

Others


దాచాలంటే దాగదుగా

దాచాలంటే దాగదుగా

3 mins 329 3 mins 329

అమ్మా...! ఇప్పుడేమైందని అంతలా బాధపడుతున్నావు, నాకేమి కాలేదు కదా!!" అంటూ తల్లిని ఓదారుస్తుంది హాస్పిటల్ మంచం మీద పడుకుని ఉన్న దివి. 


"నువ్వలానే అంటావు, చూడు ఎలా తగిలాయో, అసలు అంత చూడకుండా ఎలా నడిపావు? స్కూటీ లో వెళ్ళేటప్పుడు ముందు వెనక చూసుకోవాలని తెలీదా!" అంటూ కంటినుండి జారి చెంపలపై చేరిన కన్నీరు తుడుచుకుంటూ అంది యశోద. 


"అయ్యో అమ్మా...! నాకేమి కాలేదు, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు. మరేం పర్లేదు ఇంకో రెండు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని కూడా చెప్పారు. నువ్వు అనవసరంగా బాధపడకు. అయినా.! నా మీద అంత ప్రేమ పెట్టుకొని ఎందుకమ్మా నటిస్తారు." అంది కళ్ళనిండా ఆనందబాష్పాలు నింపుకొని.


"ఎవరే నటించేది? నువ్వంటే ఇష్టం లేదని మేమెప్పుడూ అనలేదే. చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తన సొంత నిర్ణయాలని తీసుకొనే స్థాయికి ఎదిగిందని తెలుసుకోలేకపోయిన గుడ్డివాళ్ళం అని తెలిసేలా చేసావు. ఎప్పుడూ మమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోదు మా బంగారం అని ఎంతో మురిసిపోయాడు పాపం మీ నాన్న, అందుకే తన

కూతురు ఒక్కసారిగా అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు. అందుకే ఆ క్షణంలో మాకు నచ్చని పని చేసి మమ్మల్ని బాధపెట్టావు అన్న కోపం, అంతే." అంది కంటతడి పెట్టుకుంటూ.


ఎలాగైతేనేం నా మీద కోపం తగ్గి నన్ను చూడడానికి వచ్చావు...నాకదే చాలు. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా! ఈ ఆక్సిడెంట్ ఏదో ఇంకా ముందే జరిగుంటే బాగుండేది" అంది ఇంతకాలం కోల్పోయిన తల్లి ప్రేమని ఆస్వాదిస్తూ.


"ఛి...ఛి..! ఏంటే ఆ అపశకునపు మాటలు, ఇంకెప్పుడూ అలా అనకు." అంటూ కూతురి నోటికి చేతిని అడ్డుపెట్టింది. 


"మరి ఇంకేమనాలి, నా పెళ్ళయ్యి సంవత్సరం అవుతున్నా ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి రాలేదు. ఎన్ని రాత్రులు మీకోసం ఏడ్చానో తెలుసా? అంత తప్పు నేనేం చేసానమ్మా!! ప్రేమించిన విషయం మీతో చెప్పి మీ అంగీకారంతో పెళ్ళిచేసుకోవాలి అనుకోవడమేనా? ఈరోజు ఈ ఆక్సిడెంట్ జరగకుండా ఉంటే ఇక ఎప్పటికీ నన్ను కలిసేవారు కాదుకదా!?" అంది కన్నీటిని కనురెప్పలతో కట్టడి చేస్తూ.


"అదంతా నువ్వు కావాలని కోరి తెచ్చుకున్నదే కదా! మా మీద అంత ప్రేమ ఉన్నదానివే అయితే ఇలా చేయవు. అయినా అవన్నీ ఇప్పుడెందుకులే మీ నాన్న గారు ఇంటికి వచ్చే టైం అయింది, ఇక నేను వెళ్తాను. నువ్వు జగర్తగా ఉండు. సమయానికి మందులు వేసుకో" అంటూ పైకి లేచింది.


"ఎలాగో మీ అల్లుడుగారు వచ్చే టైం అయింది, ఇంకాసేపు ఉండి ఆయన్ని కూడా కలిసి వెళ్ళొచ్చుగా అమ్మా."


"ఏదో నీకు బాగలేదని చూడ్డానికి వచ్చాను కదా అని జరిగినదంతా మరచిపోయి క్షమిస్తాము అనుకోకు. అతన్ని మాత్రం క్షమించేదిలేదు. అసలు దీనంతటికీ కారణం అతనే!!. అతననే వాడు నీ జీవితంలోకి రాకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు. మేమెంత చెప్పినా మా మాట వినకుండా అతన్ని ప్రేమించానని, అతను లేకపోతే ఉండలేనని చెప్పి, మమ్మల్ని కాదని పెళ్ళి చేసుకున్నావు, ఇప్పుడేమో ఇలా అనుభవిస్తున్నావు." అంది కూతురికి తగిలిన గాయాలను చూసి బాధపడుతూ.


"అమ్మా...! ఆయన్ని పెళ్ళి చేసుకోవడానికీ ఈ ఆక్సిడెంట్ కి ఏంటి సంబంధం? ఆయనంటే మీకు ఇష్టం లేకుంటే లేదని చెప్పు, అంతే కానీ అనవసరంగా ఆయన్నెందుకు లాగుతావు ఇందులో." అంది చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ.


"ఈ కోపానికేమీ తక్కువలేదు. నేనేమి కావాలని అనట్లేదు. అన్నీ తెలుసుకున్నాను కాబట్టే చెప్తున్నాను. మీ పెళ్ళైన కొన్ని రోజులకి ఇద్దరి జాతకాలు తీసుకెళ్ళి పంతులికి చూపించాను, అబ్బాయి జాతకంలో ఏదో దోషం ఉందని దాని మూలంగా పెళ్ళైన సంవత్సరంలోపే భార్యకి ప్రాణఘండం ఉందన్నారు. ఆ మాట విన్న నాకు గుండె ఆగిపోయింది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా నిన్ను కాపాడు కోవాలనుకున్నాం, కానీ ఎలా? ఇదంతా చెబితే నువ్వు నమ్మవు సరికదా మిమ్మల్ని విడతీయడానికి మేము కావాలని చెప్తున్నాం అనుకుంటావు అందుకే నీకేమి చెప్పలేదు. కానీ జరగబోయే అనర్ధాన్ని అయితే ఆపాలి. అందుకే మా తృప్తికోసం కొన్ని పరిహారాలు చేయించాము.


కానీ నీ భర్త ఏం చేశాడు. తన మూలంగా ఒక ఆడపిల్ల జీవితం బలి కాబోతోందని తెలిసి కూడా ఆ విషయాన్ని దాచి కేవలం తన సంతోషం కోసం నిన్ను పెళ్ళి చేసుకున్నాడు. అలాంటి వాడిని ఎలా క్షమించగలం?" అంది స్వరం పెంచుతూ.


"ఇంక చాలు ఆపమ్మా...! నువ్వన్నట్లు ఆయనేమి మోసగాడు కాదు. పైగా ఆయనకి అలాంటి దోషం ఉందని ఇప్పటివరకు ఆయనకే తెలియదు." అంది ఉక్రోషంగా. అంతలోనే నవ్వుతూ "ఎందుకంటే ఆ జాతకం ఎవరిదో ఆయనకు తెలియదు కాబట్టి." అంది. "ఏంటే నువ్వనేది. నాకేమి అర్ధంకావట్లేదు." అడిగింది కూతురి వైపు ఆశ్చర్యంగా చూస్తూ."అవునమ్మా...! నేను మీకిచ్చింది ఆయన అసలైన జాతకం కాదు. ఆయన నా కన్నా ఒక సంవత్సరం చిన్నవాడు, అది తెలిస్తే మీరు మా పెళ్ళికి ససేమిరా ఒప్పుకోరని ఆ క్షణంలో అలా అబద్ధం చెప్పాను. అయినా ఒప్పుకోలేదు సరికదా మమ్మల్ని బయటకి పంపేశారు. ఆ తర్వాత నిజం చెప్పాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు చెప్పమ్మా! నాకు ఇలా జరగడానికి కారణం ఆయనే అంటావా? అంది బాధగా.


దివి చెప్పిన మాటలకి ఎలా స్పందించాలో అర్థంకాక అయోమయంగా నిలబడిపోయింది యశోద. అంతలోనే అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి స్తబ్దుగా ఉండిపోయారు ఇద్దరూ.


"నాన్నా... మీరా!" అంటూ ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో దివి కళ్ళు విప్పారాయి. అంతలోనే తండ్రి వెనకే లోపలికి వస్తున్న భర్త కళ్ళల్లోని ఆనందాన్ని చూసి విషయం గ్రహించిన దివి కంటి కొసన కన్నీటి బిందువు తళుక్కున మెరిసింది. కాళ్ళు కందకుండా పెంచుకున్న కూతురిని అలాంటి స్థితిలో చూసిన రామారావు కళ్ళు దుఃఖంతో నిండాయి. ఒక్క అంగలో కూతురిని చేరి లాలనగా తలని స్పృశించాడు. తండ్రి స్పర్శ తగలగానే చిన్నపిల్లలా మారి తండ్రి భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది దివి. ఇన్నిరోజులు తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధ కరిగి కన్నీరై ప్రవహించింది.Rate this content
Log in